బస్సు బంద్‌ రైలే దిక్కు

కొనసాగుతున్న ఆర్‌టిసి సమ్మె

విధులకు దూరంగా 40 వేలమంది ఉద్యోగులు
ఆందోళనలో పాల్గొన్న 700 మంది నిర్బంధం
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చాలక ప్రజల అగచాట్లు

ప్రైవేటు వాహనదారుల దోపిడీ

ప్రజాపక్షం / హైదరాబాద్‌: ఆర్‌టిసి సమ్మె రెండవ రోజు కూడా కొనసాగింది. దసరా, సద్దుల బతుకమ్మ పండుగలకు తమ గ్రామాలకు వెళ్లే వారికి ఇబ్బందులు తప్పలేదు. హైదరాబాద్‌లోనూ ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. బస్సులు డిపోలకే పరిమిమవుతుండడగా పరిమిత సంఖ్యలో వాహనాలను నడుపుతున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా అవి సరిపో లేదు. 40 వేలకు పైగా ఉద్యోగులు విధులకు హాజరుకాలేదు. అన్ని జిల్లాల్లో స్వల్ప సంఖ్య లో బస్సులు రోడ్డెక్కాయి. పలు డిపోల వద్ద ఆర్‌టిసి కార్మికులు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. బతుకమ్మ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. సమ్మెలో పాల్గొంటూ ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆర్‌టిసి కార్మికులు, సంఘాల నేతలను సుమారు 700 మందిని పోలీసులు నిర్బంధించారు. సమ్మె వల్ల ఆర్‌టిసి యాజమాన్యం, రవాణా శాఖ ప్రైవేటు డ్రైవర్లతో నడిపిన పలు బస్సులు ప్రమాదానికి గురైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇదిలా ఉండగా ఆర్‌టిసి జెఎసి నేతల ప్రతినిధి బృందం ఆదివారం ఉదయం విపక్ష రాజకీయ పార్టీల నేతలను కలిసి సమ్మెకు, కార్మికుల నిరహారదీక్షలకు మద్దతును ఇవ్వాలని కోరింది. జెఎసి నేతల విజ్ఞప్తికి స్పందిస్తూ సిపిఐ, కాంగ్రెస్‌, టిడిపి, టిజెఎస్‌, సిపిఐ(ఎం) తదితర పార్టీలు ఆర్‌టిసి కార్మికుల సమ్మె, ఉద్యమాలకు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి.

DO YOU LIKE THIS ARTICLE?