బలగాల ఉపసంహరణపై సిపిఐ హర్షం

ప్రజాపక్షం/న్యూఢిల్లీ  : భారత్‌, చైనా సరిహద్దులో ఉద్రిక్తత సడలేలా ఇరువర్గాల సైనికులు బలగాల ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించడం పట్ల సిపిఐ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా మంగళవారంనాడొక ప్రకటన విడుదల చేశారు. భారత్‌, చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సామరస్యాలు పునరుద్దరించేందుకు, వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వెంబడి బలగాల ఉపసంహరణకు చొరవ చూపేందుకు భారత భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ టెలిఫోన్‌లో జరిపిన చర్చలు హర్షదాయకమని పేర్కొన్నారు. సరిహద్దులో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఇదొక సానుకూల అడుగుగా సిపిఐ భావిస్తున్నదన్నారు. సరిహద్దులో దశలవారీగా బలగాలను ఉపసంహరించడంతోపాటు ఏప్రిల్‌కు పూర్వ పరిస్థితి నెలకొనడానికి రెండు దేశాలు ప్రయత్నించాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా ఇరుదేశాలు తమ సమస్యల పరిష్కారానికి చర్చల ప్రక్రియను మరింత ఉధృతం చేస్తాయని రాజా ఆశాభావం వ్యక్తం చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?