ప్రజాస్వామిక వాదులు ఏకమై ఉద్యమించాలని వక్తల పిలుపు
ఇందిరాపార్క్ వద్ద నిరసన దీక్ష
ప్రజాపక్షం/హైదరాబాద్ బయ్యారం ఉక్కు ఫ్యాకర్టీ ఏర్పాటు, విభజన హామీలను సాధించుకునేందుకు ప్రజాస్వామిక శక్తులన్నీ ఐక్యంగా ఉధృత పోరాటం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం పట్ల మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విభజన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసిందని దుయ్యబట్టారు. ‘బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పా టు, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలు’లో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో ‘నిరసన దీక్ష’ను హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షత వహించగా, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ, ఎన్.బాలమల్లేశ్, కలవేన శంకర్, వి.ఎస్.బోస్, ఎం.బాలనర్సింహ, బాగం హేమంత్‌రావు, సిపిఐ(ఎంఎల్-) పజాపంథ రాష్ట్ర నాయకులు ప్రవీణ్ కుమార్, టిడిపి నాయకులు పి.సాయిబాబా, శ్రీపతి సతీష్ కుమార్, బాల్‌రాజ్‌గౌడ్, నల్లెల కిశోర్, సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఇటి నర్సింహ, ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, కొత్తగూడెం, భద్రాద్రి జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి విజయసారథి రెడ్డి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి డి.జి.సాయిలుగౌడ్, సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్, నల్లగొండ జిల్లా కార్యదర్శి నెలికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు. “బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు. వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి. విభజన హామీలను అమలు చేయాలి” అని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ దీక్షకు రాష్ట్ర వ్యాపితంగా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రజానాట్య మండలి బృందం ఆలాపించిన గేయాలు సభికులను ఆకట్టుకున్నాయి.
గల్లీ నుంచి ఢిల్లీ వరకు మిలిటెంట్ పోరాటం : చాడ
విభజన హామీల అమలు, బయ్యారం ఉక్కు పరిశ్రమను సాధించేందుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మిలిటెంట్ పోరాటం చేస్తామని చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు. మోడీ ప్రభుత్వం మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షత చూపుతున్నదని, ఏడు మండలాలను, సిలేరు పవర్ ప్రాజెక్ట్‌ను ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిందని విమర్శించారు. బయ్యారం ఉక్కును సాధించేందుకు కలిసొచ్చే రాజకీయ పార్టీలతో ప్రజాఉద్యమా న్ని నిర్మిస్తామన్నారు. విభజన హామీలను ఇంకెన్నాళ్లు? ఇంకెప్పుడు అమలు చేస్తారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2009- కాలంలో సిఎం వైఎస్ఆర్ అల్లుడు, ప్రస్తుత వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్‌కు గనులను లీజుకిచ్చారని, దీనిపై సిపిఐ ఎంఎల్ఎలు గుండా మల్లేశ్, కూనంనేని సాంబశివరావు అసెంబ్లీ లోపల, సిపిఐ తరపున బయట ఉద్యమించామని, ఆ పోరాట ఫలితంగానే ఆ లీజును వైఎస్ఆర్ ప్రభుత్వం రద్దు చేసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. నాడు బ్రదల్ అనీల్‌కు గనుల పనులు అప్పగిస్తే స్టీల్‌లో క్వాలిటీ ఉంటుందని, నేడు ప్రభుత్వం చేపట్టాలంటే మాత్రం ఫిజిబిలిటీ లేదని ఎలా చెబుతారని చాడ వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కిషన్‌రెడ్డి క్వాలీటీ లేదనడం అన్యాయం : కూనంనేని
కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలపై మోడీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, నిర్ల క్ష్యం వహిస్తోందని విమర్శించారు. తెలుగు రాష్ట్రాలతో ప్రధాని మోడీకి సంబంధం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు, ఐఐటి, గిరిజన, మైనింగ్ యూనివర్సీటీలు కూడా కేంద్రం ఇవ్వలేదన్నారు. జిఎస్టి డబ్బులను కూడా కేంద్రం తన జేబులో పెట్టుకుందని దుయ్యబట్టారు. దేశంలోని సంపద మొత్తాన్ని మోడీకే రాసిచ్చారా?, వాటిని అదానీ, అంబానీలకు విక్రయిస్తే ఎలాంటి అభ్యంతరాలు ఉండవా అని నిలదీశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా బయ్యారం ఉక్కులో క్వాలిటీ లేదని చెప్పడం అన్యాయమన్నారు. సుమారు 300 మిలియన్ టన్నులు క్వాలిటీ, మరో 200 మిలియన్ టన్నులు తక్కువ క్వాలిటీ స్టీల్ ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ సర్వేలోనే తేలిందని, అలాగే ఒక ప్రైవేటు సంస్థ కూడా 525 మిలియన్ టన్నుల క్వాలిటీ స్టీల్ ఉన్నట్టు నివేదికలో పేర్కొందని గుర్తు చేశారు. చైనా దేశంలో బూడిదను కూడా ఉపయోగించుకుంటారని వివరించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందేనని, అదే సమయంలో కేంద్రం ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ఆ తర్వాత కేంద్రంపై పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలతో ఐక్యకార్యాచరణను రూపొందించాలని ఆయన సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని కేసీఆర్ చెప్పారు: అజీజ్‌పాషా
దేశం ఏమైపోయినా తనకు సంబంధం లేదని, తాను మాత్రం 2024లో మూడవ సారి ప్రధాని కావాలని మోడీ ప్రయత్నిస్తున్నారని సయ్యద్ అజీజ్ పాషా ఆరోపించారు. బయ్యారం ఉక్కుతో పాటు విభజన హామీలపై అందరూ ఐక్య కార్యాచరణతో పోరాటం చేస్తే మోడీ తాత కూడా దిగిస్తారన్నారు. బయ్యారం విషయంలో నివేదిక వ్యతిరేకంగా వచ్చినా రాష్ట్ర ప్రభుత్వమే ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుందని సిఎం కెసిఆర్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పశ్యపద్మ మాట్లాడుతూ రైతుల సమస్యలతో పాటు బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై పోరాటం చేయాలన్నారు. బయ్యారంలో నాణ్యమైన స్టీల్ లేదనడం పెద్ద అబద్దమన్నారు. ఎన్.బాలమల్లేష్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం విభజన హామీలను, ఎన్నికల సందర్బంగా చేసిన వాగ్ధానాలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. బాగం హేమంత్ రావు మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా పోరాటం చేసేందుకు టిఆర్ఎస్ ముందుకురావాలన్నారు. బాలనర్సింహ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలతో రాజకీయ డ్రామాలు చేస్తున్నాయన్నారు.
ప్రజాస్వామిక శక్తులన్నీ ఏకమవ్వాలి : కోదండరామ్
ప్రజాస్వామిక శక్తులన్నీ బయ్యారం ఉక్కు ఫ్యాకర్టీతో పాటు విభజన హామీలు, పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ దరలు, విద్యుత్ చార్జీలపై పోరాటం చేయాలని ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ అన్నారు. ప్రజా సమస్యలపై సిఎం కెసిఆర్ పోరాటం చేసేందుకు ముందుకు రాడని, తన కుర్చీని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారని విమర్శించారు. విభజన హామీలు, ఇతర సమస్యల పోరాటానికి సిపిఐ నిరసన దీక్ష జీవం పోసిందన్నారు. రాష్ట్ర విభజన హామీలపై రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తే, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని ఆరోపించారు. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సంపదను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సామ్రాజ్యవాదులకు అప్పగిస్తోందని విమర్శించారు. టిఆర్ఎస్ స్వార్ధపూరిత పార్టీ అని, ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కమ్యూనిస్టులు చేస్తున్న పోరాటంలో కలిసిరావాలని సూచించారు. పి.సాయిబాబ మాట్లాడుతూ అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ‘మద్యం తెలంగాణ’గా మారుస్తున్నారని, కెటిఆర్ వచ్చిన తర్వాతనే హైదరాబాద్‌లో పబ్బులకు అనుమతి ఇప్పించారని ఆరోపించారు.
‘బయ్యారం’, విభజన హామీల సాధనకు ఐక్య పోరాటం
RELATED ARTICLES