ఫీజుల నిర్ణయాధికారం ప్రైవేటు వర్సిటీలదే!

ఉన్నత విద్యాశాఖ నుంచి ఒక అధికారి
కొత్త ప్రైవేటు వర్సిటీల్లో రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉండదు
ప్రైవేటు విశ్వవిద్యాలయంలో 25వ స్థానంలో మన రాష్ట్రం
ఉన్నత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్‌ కొత్తగా ఏర్పాటు చేసే ప్రైవేటు విశ్వ విద్యాలయాల్లో ఫీజులను నిర్ణయించే అధికారం యాజమానాల్యకే ఉంటుందని, ఇందులో ఉన్నతా విద్యాశాఖ నుంచి ఒక అధికారి ఉంటారని ఉన్నత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బ్రైన్‌ జోన్‌ పరిధిలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కొత్తగా అడ్మిషన్లు పొందే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రిజర్వేషన్లు అమలు కాదని, అలాగే నూతన ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రిజర్వేషన్లు అమ లు కావని స్పష్టం చేశారు. శాసనసభలో సోమవారం ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టంలో మరో ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాలను చేర్చు తూ ఆర్డినెన్స్‌ రూపంలో సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో సభ్యుల లేవనెత్తిన పలు అంశాలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానమిస్తూ మహేంద్ర, మల్లారెడ్డి, ఎస్‌ఆర్‌ విశ్వవిద్యాలయం, అనురాగ్‌ విశ్వవిద్యాలయాన్ని అనుమతి ఇచ్చే విషయమై చట్టంలో చేర్చుతున్నామని, అనివార్యమైనందుకే ఆ విశ్వవిద్యాలయాలకు అనుమతినిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ప్రైవేటు విశ్వవిద్యాలయంలో మన రాష్ట్రం 25వ స్థానంలో ఉన్నదన్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కొత్తగా 16 ప్రతిపాదనలను వచ్చాయని, ఒక్కోదానికి నిపుణుల కమిటీ వేశామని, అన్ని పరిశీలించిన తర్వాతనే ఇందులో 9 మాత్రమే ప్రభుత్వం వద్దకు వచ్చాయని, మొదటి విడతలో ఐదు అనుమతినిచ్చామని, మిగిలిన మూడు పరిశీలనలో ఉన్నాయన్నారు. కొత్తగా ఏర్పడే విశ్వవిద్యాలయాలు తమ అడ్మిషన్లలో 25 శాతం తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు కేటాయించాలనే నిబంధనల పెట్టినట్టు పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌కు చెందిన వారికి ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతినిచ్చారన్న కాంగ్రెస్‌ సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రస్తావించిన అంశానికి మంత్రి స్పందిస్తూ చట్టంలోని నిబంధనల మేరకే నడుచుకుంటున్నామన్నారు. 20 సంవత్సరాలుగా వారు విద్యారంగంలోనే ఉన్నారని, 20 నుంచి 50వేల మంది విద్యార్థులు ఉన్నారని, నిధులు, స్థలం విషయంలో నిబంధనల మేరకే ఉన్నాయని అందుకే అనుమతినిచ్చినట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ప్రతి ఏటా రూ. 700 కోట్లు ఇవ్వబోతున్నామని, విసిలను కూడా విలైనంత త్వరగా నియమిస్తామని హామీనిచ్చారు. అంతకుముందు జరిగిన చర్చలో టిఆర్‌ఎస్‌ సభ్యులు ఎస్‌.రాజేందర్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అఫిలేషన్‌, అడ్మిషన్‌, ఎగ్జామినేషన్‌ మూడింటిని కూడా కోర్టులే నిర్వహిస్తున్నాయని, ఇది ఒక ఎంఆర్‌ఒ కార్యాలయం కూడా నిర్వహిస్తుందని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ఉద్దేశించి తెలిపారు
ముగ్గురు టిఆర్‌ఎస్‌వారే- : శ్రీధర్‌బాబు
బిల్లులో పొందపర్చిన ఐదు యూనివర్సిటీల్లో ముగ్గురు టిఆర్‌ఎస్‌కు సంబంధించిన వారే ఉన్నారని కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయం విషయంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికను సభలో ప్రవేశపెట్టాలన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 1528 ఖాళీలు ఉన్నాయని, 1061 భర్తీ చేస్తామని నాటి విద్యా శాఖ మంత్రిగా కడియం శ్రీహరి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. పైగా ప్రభుత్వం విశ్వవిద్యాయాల నుంచే నాయకత్వం వచ్చిందన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు నిధులు, టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయకపోతే ఎలా పటిష్టమవుతాయన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాయాలకు విసిలు లేరని, సీనియర్‌ ఐఎఎస్‌ అధికారలను ఇన్‌చార్జ్‌ నియమించి పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. కెజి నుంచి పిజి అని టిఆర్‌ఎస్‌ తన మ్యానిఫెస్టోలో పొందపర్చిందని గుర్తు చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?