గవర్నర్‌కు కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి
రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్
హైదరాబాద్ : పార్టీ ఫిరాయించేందుకు నిర్ణయించిన 9 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు వేయాలని గవర్నర్‌ను కాంగ్రెస్ నేతలు కోరా రు. అలాగే నేరుగా సిఎం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుండడం, ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఇతర పార్టీ ఎంఎల్‌ఎలను అధికార నివాసంలోకి పిలిపించి పార్టీలోకి ఆహ్వానించిన నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజ్‌భవన్‌లో శనివారం గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు ఈ మేరకు కేంద్ర మాజీమంత్రి వీరప్పమొయిలీ నేతృత్వంలో ప్రతినిధి బృందం వినతిపత్రాన్ని అందజేసింది. కాంగ్రెస్ పార్టీని వీడినట్లు తొమ్మిది మంది ఎంఎల్‌ఎల వివరాలను కూడా ఆ ఫిర్యాదులో పొందపర్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆర్.సి.కుంటియా, సిఎల్‌పి నేత మల్లు భట్టివిక్రమార్క, సీనియర్ నాయకులు కె.జానారెడ్డి, డాక్టర్ జె.గీతారెడ్డి, ఎస్.జైపాల్‌రెడ్డి, ఎంఎల్‌సి మహ్మద్ షబ్బీర్‌అలీ, నాయకులు కుసుమకుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వీరప్పమొయిలి మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులపై దేశ వ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహిస్తామని, లోక్‌పాల్‌లో ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఇకనైనా కెసిఆర్ తన అక్రమాలను ఆపాలని హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్, మండలి చైర్మన్‌కు కాంగ్రెస్, టిడిపి ఇప్పటికే వేర్వేరుగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. స్పీకర్, చైర్మన్‌పై కెసిఆర్ ఒత్తిడి ఉందన్నారు. కెసిఆర్‌కు పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ ఇతర పార్టీల్లో గెలిచిన నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. పార్టీలు మారిన వాళ్లు రాసిన లేఖలు, అన్నీ ఒకేలా ఉన్నాయని, ఇవన్నీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే వచ్చాయని ఆరోపించా రు. రాజ్యాంగానికి విరుద్ధంగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరామన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలన్నారు. సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రతిపక్షం ఉంటే ప్రభుత్వం చేసిన తప్పులు బయటపడుతాయనే లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని, ఇదే విషయమై రాష్ట్రపతిని కూడా కోరుతామని చెప్పారు. కేంద్ర మాజీమంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు జరిగి మూడు రోజు లు కాకముందే పార్టీ మారే నీచత్వానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఫిరాయించిన వారిపై అనర్హత వేటు
RELATED ARTICLES