గెలిచిన కొత్త కార్పొరేటర్లకు నీరక్షణ తప్పదు
మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రెండింటిపైనా టిఆర్ఎస్ కన్ను
ప్రజాపక్షం/హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు మరో రెండు నెలల పాటు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్తగా ఎన్నికైనవారికి కార్పొరేటర్ హోదా ఇప్పుడే వచ్చే అవకాశం లేకుండా పోయింది. 2016లో ఎన్నికైన పాలకవర్గం పదవీకాలం వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీతో ముగియనుంది. అప్పటి వరకు నూతనంగా ఎన్నికైన అభ్యర్థులు ఖాళీగానే ఉండాల్సిందే. ప్రస్తుత పాలకమండలి పదవీకాలం తీరిన తర్వాత కొత్తగా ఎన్నికైన వారి తో పదవీప్రమాణం చేసిన అనంతరం వారికి కార్పొరేటర్ హోదా లభిస్తుంది. ప్రస్తుతం పాలకవర్గం గడువు ముగిశాక ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనున్నది. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం ప్రస్తుత పాలకమండలిని ప్రభుత్వం రద్దు చేసేందుకు అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడే కొత్త వారికి బాధ్యతలు అప్పగించాలంటే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే పాలకమండలి రద్దు అవుతుంది. అయితే ప్రభుత్వం అందుకు సుముఖంగా లేనట్లు తెలిసింది. పాలకమండలి గడువు తీరిన అనంతరమే కొత్త వారికి అవకాశం కల్పించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు టిఆర్ఎస్కేనా ?
మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం టిఆర్ఎస్ ప్రత్యేకంగావ్యూహరచన చేస్తోంది. ఆశించిన స్థాయిలో టిఆర్ఎస్కు కార్పొరేటర్ స్థానాలు దక్కకపోవడంతో జిహెచ్ఎంసిలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకునేందుకు మ్యాజిక్ఫింగర్ను అందుకోలేకపోయింది. కొత్తగా గెలిచిన వారితో పాటు ఎక్స్అఫీషియో సభ్యుల బలబలాలను చూస్తే.. టిఆర్ఎస్కు 55 కార్పొరేటర్ స్థానాలు, 31 ఎక్స్అఫీషియో సభ్యులు ఉన్నారు. ఇటీవల గవర్నర్ కోటాలో మరో ముగ్గురు ఎంఎల్‌సిలు ఎన్నికయ్యారు. వారు కూడా జిహెచ్‌ఎంసిలోనే ఎక్స్అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకుంటే టిఆర్ఎస్కు 99 మంది సభ్యుల బలం ఉంటుంది. ఇక ఎంఐఎం 44 కార్పొరేటర్లతో పాటు 10 మంది ఎక్స్అఫీషియో సభ్యులు ఉన్నారు. బిజెపికి 48 మంది కార్పొరేటర్లతో పాటు ముగ్గురు ఎక్స్అఫీషియో సభ్యులు ఉన్నారు. టిఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు తమ పార్టీ వారిని ప్రతిపాదిస్తే బిజెపి, ఎంఐఎం పార్టీలు వ్యతిరేకిస్తే పదవులు దక్కించుకోలేని పరిస్థితులు ఉంటాయి. రెండు పార్టీల బలం కలిపితే 105 ఉంటుంది. ఎంఐఎం టిఆర్ఎస్కు మద్దతు ఇస్తే రెండు పదవులను సునాయాసంగా దక్కించుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు ఇద్దరు కార్పొరేటర్లు, ఒకరు ఎక్స్అఫీషియో సభ్యులు ఉండటంతో పోటి పడే అవకాశమే లేకుండా పోయింది.
మేయర్ ఎన్నికలు ఇలా…
జిహెచ్ఎంసి మేయర్ ఎన్నికల్లో కార్పొరేటర్లతో పాటు, ఎక్స్అఫీషియో సభ్యులు కూడా ఓటర్లుగా ఉంటారు. ఎక్స్అఫీషియో, కార్పొరేటర్ల సంఖ్యా బలం ఏ పార్టీకి ఎక్కువ ఉంటే ఆ పార్టీ వారే మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్లో ఉంటారు. తాజాగా వెలువడిన జిహెచ్ఎంసి ఫలితాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఈ రెండు పదవుల ఎన్నికపై ఆసక్తి నెలకొంది. వాస్తవంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు జిహెచ్ఎంసి చట్టంలో ప్రత్యేక నిబంధనలను పొందుపర్చారు. కొత్త పాలకవర్గం కొలువుదీరడానికి ముందుగా హైదరాబాద్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఈ క్రమంలోనే ఎక్స్అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకునేందుకు అవకాశమిస్తూ రిటర్నింగ్ అధికారి మరో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఓటుహక్కు ఉండి, ఇతర ఏ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గతంలో ఓటు హక్కును వినియోగించుకోని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎంఎల్‌సి, ఎంఎల్ఎలు ఎక్స్అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు. అనంతరం 150 మంది కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియోలతో కలిపి మేయర్ ఎన్నిక కోసం ఓటర్ల జాబితాను రూపొందిస్తారు.
ప్రత్యేక సమావేశంలో..
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులందరికీ మూడు రోజుల ముందు సమాచారం ఇస్తారు. ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. మొత్తం కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యుల్లో కనీసం సగం మంది (కోరం) ఉంటేనే సమావేశాన్ని నిర్వహిస్తారు. సమావేశంలో గెలిచిన కార్పొరేటర్లతో ముందుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం ఎన్నిక ప్రక్రియను ప్రారంభిస్తారు. ఉదాహరణకు ఎక్స్‌అఫీషియోలు, కార్పొరేటర్లు కలిపి 200 మంది ఉంటే.. కనీసంగా వందమంది హాజరైతేనే ప్రత్యేక అధికారి సమావేశాన్ని నిర్వహిస్తారు. ఎక్కువ సంఖ్యలో కార్పొరేటర్లు ఉన్న పార్టీనే రెండు పదవులు దక్కించుకుంటారు.
* సమావేశంలో మేయర్ అభ్యర్థిని ఒక సభ్యుడు ప్రతిపాదిస్తే, మరొక సభ్యుడు మద్దతు అమోదించాల్సి ఉంటుంది.
* కార్పొరేటర్‌గా ఎన్నికైనవారే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు అర్హులు.
* ఎక్స్అఫీషియో సభ్యులకు పోటీచేసే అవకాశం ఉండదు.
* మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఏ పార్టీ అయినా తమ అభ్యర్థులను పోటీలో నిలబెట్టవచ్చు.
* ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు సమర్పించాక గుర్తింపు పొందిన పార్టీలు విఫ్‌లు జారీచేస్తాయి.
* ప్రత్యేకాధికారి నామినేషన్లు స్వీకరిస్తారు.
* చేతులెత్తే విధానంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహిస్తారు.
* ఇలా పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థి ఓట్లను లెక్కిస్తారు.
* ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉన్నవారిని మేయర్, డిప్యూటీ మేయర్లుగా ప్రకటిస్తారు.
ఫిబ్రవరి 10 వరకు ఆగాల్సిందే!
RELATED ARTICLES