సచివాలయ బిజినెన్ రూల్స్ మేరకు చట్టపరమైన చర్యలు
మంత్రి భట్టి విక్రమార్క
ప్రజాపక్షం/హైదరాబాద్ మంత్రివర్గ అనుమతి లేకుండా, సచివాలయ బిజినెస్ రూల్స్‌కు భిన్నంగా, కేవలం అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి మౌఖిక ఆదేశాలతోనే “ఫార్మూలా ఈ రేస్” ఒప్పందం జరిగిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. దీనిపైన న్యాయసలహా తీసుకుని, సచివాలయ బిజినెస్ రూల్స్ మేరకు
చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ‘ఫార్మూలా రేస్’తో హైదరాబాద్ కు ఏవిధమైన లాభం లేకపోగా ప్రజాధనాన్ని గత ప్రభుత్వం అప్పనంగా ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించిందని విమర్శించారు. ఒక ప్రైవేటు సంస్థకు ప్రయోజనం చేకూరే రేస్ ను రద్దు చేస్తే, హైదరాబాద్ ఇమేజ్ తగ్గిందని మాజీ మంత్రి మాట్లాడడం హాస్యస్పదమన్నారు. హైదరాబాద్, సచివాలయ మీడియా సెంటర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఏ విధమైన ముందస్తు అనుమతులు లేకుండా నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్ ఒప్పదం, నిర్వహణపై న్యాయపరంగా ముందుకెళ్తామన్నారు. హైదరాబాద్‌లో గతేడాది నిర్వహించిన ‘ఫార్ములా ఈ రేసింగ్’పై టికెట్లను విక్రయించుకునే ఒక ఎస్ నెక్ట్ సంస్థ, రేస్ నిర్వహించే ‘ఫార్మూలా ఈ రేస్’ తో పాటు గత రాష్ట్ర ప్రభుత్వం ట్రై ఒప్పందం చేసుకున్నదని, ఆ తర్వాత టికెట్లను విక్రయించే సంస్థను తప్పించి, మరో అప్పందం చేసుకున్నదని వివరించారు. హైదరబాద్ ఇమేజ్‌ను పెంచే ఈ రేస్ ఒప్పందం నుండి ఎస్ నెక్స్ సంస్థను ఎందుకు తప్పించారని మాజీ మంత్రులను నిలదీశారు. ఈ వెంట్‌ను ఒక కంపెనీకి లబ్ధి చేకూర్చడం కోసమే పెట్టారని విమర్శించారు. దీనికి సంబంధించి ఏవిధమైన విధి విధానాలు పాటించలేదని, నిర్వహణ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వంలో ఏవిధమైన ముందస్తు ఒప్పందం జరుపకుండా, వ్యాపార సూత్రాలకు విరుద్ధంగా ఫార్మూలా రేస్‌ను నిర్వహించారని తెలిపారు. ఈ వెంట్ నిర్వహణకు రాష్ట్ర మంత్రివర్గం అనుమతి లేకుండా, కేవలం ఆ శాఖ మంత్రి ఫోన్‌లో ద్వారా చెప్పారని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంవ కార్యదర్శితో రూ. 55 కోట్లను చెల్లించారన్నారు. ఈవెంట్ నిర్వహణకు రూ.110 కోట్లకు ఒప్పందం కుదిరిందని, ఇందులో రూ.55 కోట్లను చెల్లించగా, మిగతా రూ. 55 కోట్ల చెల్లించాలని ఫార్ములా కంపెనీ నోటీసులు పంపిందని వివరించారు. రేస్‌కు సంబంధించిన టికెట్ల రూపంలో వచ్చే డబ్బులను ఎస్ నెక్ట్ సంస్థకు వెళ్తుందని, మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ఉపయోగమని, ప్రభుత్వానికి ఎటువంటి ఉపయోగం లేపోయినప్పటికీ మౌలిక సదుపాయాల నిమిత్తం రూ. 20కోట్లను ఎందుకు వెచ్చించారని భట్టి ప్రశ్నించారు. ఈ రేస్ వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయని చెబుతున్న మాజీ మంత్రి, ఆ పెట్టుబడులు ఏ కంపెనీ నుండి, ఎక్కడ వచ్చాయో చెబుతారా అని నిలదీశారు. కేవలం ఒక కంపెనీకి లబ్ధిచేకూరేందుకు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు.తమ ప్రభుత్వంపై ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయని, ప్రతిపైసా ప్రజల అవసరాల కోసమే తాము ఖర్చు చేస్తామని వివరించారు. ఎవరో హైదరాబాద్‌కు వచ్చి వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కట్టాలా? అని ప్రశ్నించారు. ఇది బిజినెస్ రూల్స్ కు విరుద్ధమైనదన్నారు. తమ ప్రభుత్వం ప్రతి పైసాను రాష్ట్ర ప్రజల అవసరాల కోసం ఖర్చు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి చిన్న సంఘటన లేకుండా చాలా పకడ్బందీగా నిర్వహించామని తెలిపారు.
విడతల వారిగా రైతుబంధు
ఒక ఎకరా రైతులకు పూర్తి
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక ఎకరా రైతలుకు రైతుబంధు నిధులను పంపిణీ చేశామని భట్టి విక్రమార్క అన్నారు. ప్రస్తుతం రెండు ఎకరాల రైతులకు అందజేస్తున్నారని, విడతల వారిగా రైతుబంధు నిధులను పంపిణీ చేస్తున్నామన్నారు. మూడు ఎకరాల భూ పంపిణీ ఎగ్టొట్టినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల హామీలను అమలు చేయకూడదని బిఆర్‌ఎస్ నేతలు, మాజీ మంత్రులు కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రుల మనసులోని మాటలు బయటికి వస్తున్నాయని, వారి కోరికలను తాము నిజం చేయబోమని, తమ ఎన్నికల హామీలను అమలు చేస్తామని భట్టి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6.50 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించారన్నారు.