ఫరూఖ్‌, ఒమర్‌ అబ్దుల్లాలను కలిసిన ఎన్‌సి పార్టీ సభ్యుల బృందం

శ్రీనగర్‌: నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సి)పార్టీకి చెందిన 15 మంది సభ్యుల బృందం ఆదివారం ఆ పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లాను శ్రీనగర్‌లోని ఆయన నివాసంలో కలిసింది. ఆయనతోపాటు ఆయన భార్య మోలీ అబ్దుల్లాను కలిసింది. ఆయన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లాతో సభ్యులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. హరి నివాస్‌లో మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాను కలిసిన పార్టీ సభ్యుల బృందానికి పార్టీ ప్రాంతీయ చీఫ్‌ దేవేందర్‌ సింగ్‌ రాణా నేతృత్వం వహించారు. వారు కేవలం అరగంట మాత్రమే ఆయనతో గడిపారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదానిచ్చే ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన మరునాటి..అంటే ఆగస్టు 5నుంచి నిర్బంధంలో ఉన్న ఒమర్‌ను పార్టీ సభ్యులు కలవడం ఇదే తొలిసారి. గడ్డం పెంచుకున్న ఒమర్‌ అబ్దుల్లా పార్టీ నాయకులతో సెలీలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆ పార్టీ సభ్యుల బృందం ఫరూఖ్‌ అబ్దుల్లా నివాసానికి వెళ్లింది. సమావేశానంతరం రాణా విలేకరులతో మాట్లాడుతూ ‘జమ్మూకశ్మీర్‌లో ఏదైనా రాజకీయ ప్రక్రియ ఏదైనా మొదలెట్టాలనుకుంటే, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలనుకుంటే ముందు క్రిమినల్‌ రికార్డులేని పార్టీ నాయకులందరినీ విడుదల చేయాలి’ అని రాణా చెప్పారు. దీనికి ముందు పార్టీ అధ్యక్షుడు ఫరూక్‌, ఆయన కుమారుడు ఒమర్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని పార్టీ నేతలు కోరడంతో రాష్ట్ర గవర్నర్‌ సత్యపాల్‌ మలిక్‌ వారికి అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో 15 మంది సభ్యుల బృందం ఆదివారం వారిని కలిసింది. ఫరూక్‌ నివాసంలోకి ప్రవేశించే ముందు సభ్యులు మీడియాతో మాట్లాడారు. మోసం చేశారు. 370వ అధికరణం తిరిగి తెచ్చేందుకు మేం కృషి చేస్తున్నాం అని పార్టీ నాయకుడు అక్బర్‌ లోనే అన్నారు. ఆగస్టు 5కు ముందున్న పరిస్థితులను మళ్లీ నెలకొల్పాలి. రాజ్యాంగ అంశాలపై కేంద్ర ప్రభుత్వం అవగాహన తెచ్చుకుంటుందని భావిస్తున్నాం. ఇప్పటి వరకు చేసిందంతా ఏకపక్షమే. ఎవర్నీ ప్రభుత్వం సంప్రదించలేదు అని హస్నయిన్‌ మసూది అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?