చాడ వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి
ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖ
ప్రజాపక్షం/హైదరాబాద్ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా వైద్య ఖర్చులను నియంత్రిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కోరారు. కేంద్ర ప్రభు త్వం జారీ చేసిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతం పడకలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కరోనా చికిత్సను అందించాలన్నారు. రాష్ట్రంలో కరోనా బాధితులకు వైద్యం, ఆర్థిక సాయం అందించాలని పేర్కొన్నారు. ఈ మేరకు చాడ వెంకట్‌రెడ్డి సిఎం కెసిఆర్‌కు ఆదివారం ఒక లేఖ రాశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న సీనియర్,జూనియర్ డాక్టర్లు, వివిధ కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న పారిశుద్ధ్య, పారామెడికల్, ల్యాబ్ అసిస్టెంట్‌లకు వేతనాలు పెంచాలని, ప్రోత్సాహకాలను అందించాలని, వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని తెలిపారు. ఈ విషయాన్ని ఇది వరకే తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు గుర్తు చేశారు. వైద్యులు, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన సిఎంను కోరారు. కరోనా వైరస్ ఎన్ని రూపాలలో, ఎన్ని నెలలు ఉంటుందో ఊహించలేని పరిస్థితులు ఉన్నాయని, బ్లాక్ ఫంగస్, థర్డ్ వేవ్ లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని రాజకీయ పార్టీలతో, ఎన్‌జిఒలతో ఆన్‌లైన్ సమావేశాన్ని నిర్వహించాలన్నారు. అవసరమైన కేంద్రాల్లో మెడికల్, ఇతర కాలేజీలు, ఫంక్షన్ హాల్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటిని ఐసోలేషన్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా,సోషల్ మీడియాలో చేస్తున్న అనవసర ప్రచారాన్ని అరికట్టాలని తెలిపారు. మెడికల్ డయాగ్నోస్టిక్‌లలో జరుగుతున్న దోపిడీని అరికట్టాలన్నారు. కరోనా వైద్యానికి ఉపయోగించే మందుల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు అన్ని ఫార్మసీ కంపెనీల యజమానులతో మాట్లాడి, అత్యవసర మందుల ఉత్పత్తులను పెంచాలని సూచించారు. జనరిక్ మందుల షాపు ద్వారా ప్రజలకు తక్కువ ధరకే మందులు లభించేలా చూడాలని పేర్కొన్నారు. సందట్లో సడేమియాలాగా వ్యవహారిస్తున్న నకిలీ మందుల తయారీదారులుపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తక్షణమే ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలన్నారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్- 2005 ప్రకారం ఉపాధి కోల్పోయిన వారికి నెలకు రూ.5 వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొవిడ్ సంబంధించి ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఒక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని, దీనిని ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షించి, ఆ సమస్యలను గంటల వ్యవధిలోనే పరిష్కరించాలని సూచించారు. ఎన్నడూ ఊహించని విధంగా దేశంలో కరోనా విజృంభిస్తుందన్నారు. కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. ఇటీవల ‘మీరు)(సిఎం) స్వయంగా హైదరాబాదులోని గాంధీ,వరంగల్‌లోని ఎంజిఎం ఆస్పత్రులను సందర్శించి, కరోనా రోగులను పరామర్శించడాన్ని చాడ వెంకట్‌రెడ్డి అభినందించారు. ఈ చర్య రోగులకు మనోధైర్యాన్ని, వైద్యులు, సిబ్బందికి నైతిక స్థైర్యాన్ని అందించిందన్నారు. కానీ కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సరిపోవడం లేదని, కొందరు కరోనా బారిన పడితే, మరికొందరు వారికి సహాయమందిస్తూ మిగిలిన వారు తమకు కరోనా సోకుతుందనే భయంతో విలవిలలాడుతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలు, వ్యవసాయం మందగించి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. ప్రజల ఆరోగ్యమే రాష్ట్ర అభివృద్ధికి తోడుపడుతుందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గమన ంలోకి తీసుకోవాలని, వైద్యంపై ఉదారంగా ఖర్చు పెట్టాలని చాడ వెంకట్‌రెడ్డి సూచించారు.
ప్రైవేట్ ఆస్పత్రులను స్వాధీనం చేసుకోవాలి : ఉత్తమ్
ఇతర రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆస్పత్రులను స్వాధీనం చేసుకొని, కరోనాకు ఉచిత వైద్యం అందిస్తున్నారని టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కొవిడ్ రోగుల కోసం ఎంఎల్‌ఎ జగ్గా రెడ్డి ఏర్పాటు చేసిన మూడు అంబులెన్స్‌లను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులు పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం విమర్శించారు. కరోనా పరీక్షలు పెంచాలని హైకోర్టు ఆదేశాలిచ్చినా ప్రభుత్వం పెంచడం లేదని ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో అంబులెన్స్ సేవలుంటాయన్నారు. కరోనా బాధితులను సమీప ఆస్పత్రులకు చేరుస్తామన్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ అంబులెన్స్‌లు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. ప్రైవేట్ అంబులెన్స్‌లపై ప్రభుత్వ నియంత్రణ లేదన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల ధరలను నియంత్రించాలని కోరామన్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రసిడెంట్ కుసుమ కుమార్, జగ్గారెడ్డి కుమార్తె జయరెడ్డి, నగేష్ ముదిరాజ్, బొల్లు కిషన్, మెట్టు సాయి తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజులపై ఉత్తర్వులు
RELATED ARTICLES