ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టీకా @ 250

సర్‌ చార్జీలు అందులోనే
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితం
కేంద్ర సర్కార్‌ నిర్ణయం
కరోనా పరిస్థితిపై సమీక్ష
న్యూఢిల్లీ : ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టీకా ధరను 250 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. సర్‌ చార్జీలు కూడా అందులోనే కలిసి ఉంటాయి. అయితే ప్రతి వ్యక్తి రెండుసార్లు టీకా వేయించుకోవాలి గనుక వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో రెండుసార్లకీ కలిపి 500 రూపాయలు ఖర్చు చేయాల్సివస్తుంది. అధికారవర్గాలు శనివారంనాడు ఈ విషయం వెల్లడించాయి. 60 ఏళ్ళు పైబడినవారందరికీ మార్చి 1వ తేదీ నుండి టీకా వేసేందుకు రెండో దశ పంపిణీ కార్యక్రమానికి కేంద్రం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రైవేటు హాస్పిటల్స్‌లో టీకా సర్వీసు చార్జి నిమిత్తం 100 రూ పాయలు చెల్లించాలని కేంద్రం స్పష్టం చేసింది. టీకా కొనుక్కోడానికి ఇప్పుడు 150 రూపాయలు ధర నిర్ణయించింది. అంటే టీకా వేయించుకోవడానికి ఎవరైనా ప్రైవేటు హాస్పిటల్‌కు వెళితే వంద రూపాయలు సర్వీస్‌ చార్జి, 150 రూపాయలు టీకా ధర కలిపి మొత్తం 250 రూపాయలు చెల్లించాలి. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ప్రైవేటు ఇంతే మొత్తాన్ని వసూలు చేయాలని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ప్రభుత్వ హాస్పిటల్స్‌లో టీకా వేయించుకుంటే ఎలాంటి డబ్బూ చెల్లించాల్సిన అవసరం లేదు. టీకా వేయించుకున్నవారి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. ఎల్లుండి నుండీ ప్రారంభమయ్యే రెండో విడత టీకా పంపిణీలో 2022 జనవరి 1వ తేదీ నాటికి 60 ఏళ్ళ వయసు నిండే వారిని కూడా వృద్ధులుగానే పరిగణించి టీకా వేయించుకోడానికి అర్హులుగా నిర్ణయించారు. 45 నుండి 59 ఏళ్ళ మధ్య వయసుగల తీవ్ర జబ్బులకు గురైనవారికి కూడా రెండో దశలో టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీకా వేయించుకోవాలనుకునేవారు వారంతట వారే వయసు ధృవీకరణ కోసం ఏడు రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదాని సహాయంతో తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ ద్వారా నమోదు చేసుకోవాలి. 45-59 ఏళ్ళ మధ్యగలవారు 20 రకాల దీర్ఘకాలిక జబ్బుల్లో దేనిబారిన పడ్డారో తెలిపే ధ్రువీకరణ పత్రంతోపాటు వయసు ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలి. టీకా వేయించుకకున్న తర్వాత ఏవైనా దుష్ప్రభావాలు కనిపిస్తే 104 నెంబర్‌కు ఫోన్‌ చెయ్యాలి. అయితే ఈ టీకా సురక్షితమైనదని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పదే పదే స్పష్టం చేస్తోంది. 2021 జనవరి 16న దేశంలో ఈ టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.
కరోనా పై కఠిన చర్యలు
కరోనా సెకండ్‌ వేవ్‌ పరిస్థితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. కరోనా తాజా కేసులపై కేంద్ర ష్ట్రాలు శనివారంనాడు చర్చించాయి. సామాజికంగా ఎలాంటి ఉల్లంఘనలూ జరగకుండా అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని, కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశించింది. సమగ్ర గస్తీ చర్యలు సమర్థవంతంగా చేపట్టాలని సమావేశంలో కోరినట్లు ఒక అధికార ప్రకటన పేర్కొంది. కేంద్ర పాలిత ్రప్రాంతాలతో సహా మహారాష్ట్ర, పంజాబ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి రాజీవ్‌ గౌడ అధ్యక్షతన ఉన్నతస్తాయి సమీక్షా సమావేశం జరిగింది. గత వారంలో పెరిగిన కేసుల ధోరణిపై విశ్లేషణ చేశారు. పరిస్థితిని తక్కువగా అంచనా వేయొద్దనీ, అప్రమత్తంగా వ్యవహరించాలని, సమర్థవంతమైన గస్తీ, వ్యూహాత్మక నిఘా చాలా అవసరమని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కరోనా పరీక్షలను ఎక్కువ చేపట్టాలని, ఎప్పటికప్పుడు కనిపెడుతూ, పాజిటివ్‌ కేసులను సకాలంలో ఐసొలేషన్‌లో ఉంచాలని సమావేశంలో రాజీవ్‌ గౌడ్‌ పేర్కొన్నారు. జిల్లాల్లో టీకా పంపిణీకి రాష్ట్రాలు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సమావేశంలో ఆయన కోరారు. కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా ఇవే ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 14న అత్యధికగా మహారాష్ట్రలో 34,449గా నమోదదైన కేసులు ఈ పన్నెండు రోజుల్లోనూ 68,810కి చేరి రెట్టింపు స్థాయికి పెరిగాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. నిర్దేశిత మార్గదర్శకాలను జిల్లాల కలెక్టర్లు పాటించాలని కోరింది. కఠినమైన చర్యలు కొనసాగించకతప్పదని ఈ సమీక్షా సమావేశంలో కేబినెట్‌ కార్యదర్శి రాష్ట్రాలకు తెలియజేశారు.

DO YOU LIKE THIS ARTICLE?