HomeNewsBreaking Newsప్రైవేటీకరించాలని చూస్తేమరో ఉద్యమం

ప్రైవేటీకరించాలని చూస్తేమరో ఉద్యమం

వామపక్షాల నాయకులు హెచ్చరిక
బషీర్‌బాగ్‌లో విద్యుత్‌ ఉద్యమ అమరులకు ఘనంగా నివాళి
ప్రజాపక్షం / హైదరాబాద్‌
అడ్డగోలుగా విద్యుత్‌ చార్జీలు పెంచి, విద్యుత్‌ సం స్థలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తే విద్యుత్‌ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో మరో ఉద్యమాన్ని చేపడతామని వామపక్ష పార్టీల నేత లు హెచ్చరించారు. విద్యుత్‌ ఉద్యమ 23వ వార్షికోత్సవం సందర్భంగా బషీర్‌బాగ్‌లోని షహీద్‌చౌక్‌, విద్యుత్‌ ఉద్యమ అమరుల స్తూపం వద్ద సోమవారం విద్యుత్‌ ఉద్యమ అమరులు బాలాస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ల చిత్రపటాలకు ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌ రెడ్డి, సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు, సిపిఐ రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు ఇటి నరసింహ, సిపిఐ(ఎం) రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు డిజి నరసింహారావు, సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ రాష్ర్ట నాయకులే కె. గోవర్ధన్‌, వి. సంధ్య, ఎంసిపిఐ(యు) రాష్ర్ట కార్యదర్శి గాదగోని రవి, సిపిఐ ఎంఎల్‌ ప్రజాపంథా రాష్ర్ట నాయకులూ హన్మేష, ఎస్‌.ఎల్‌.పద్మ, ఎస్‌యుసిఐ(సి) రాష్ర్ట నాయకు లు కె. మురహరి, ఫార్వడ్‌ బ్లాక్‌ రాష్ర్ట కార్యదర్శి ఆర్‌. వి. ప్రసాద్‌, ఆర్‌ఎస్‌పి రాష్ర్ట కార్యదర్శి ఎస్‌. జానకి రామ్‌ తదితర వామపక్ష నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో బి.వి. రాఘవులు మాట్లాడుతూ సరళీకరణలో భాగంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భారీగా విద్యుత్‌ చార్జీలు పెంచిందని, ప్రైవేట్‌ శక్తులకు లాభం చేకూర్చే విధంగా ప్రయత్నాలు చేశాయని అన్నారు. దానికి వ్యతిరేకంగా ప్రజలు వీరోచితంగా విద్యుత్‌ పోరాటం చేసి అమరులయ్యారని గుర్తు చేశారు. విద్యుత్‌ ఉద్యమ ఫలితంగానే పాతిక సంవత్సరాలు అవుతున్నా పాలక ప్రభుత్వాలు విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి ధైర్యం చేయడం లేదని, కమ్యూనిస్టు పార్టీలుగా సాధించిన మొదటి విజయం అన్నారు. బిజెపి చేస్తున్న దుర్మార్గమైన పాలనను వ్యతిరేకించకుండా దానిని పెంచి పోషించే పనిలో బిఆర్‌ఎస్‌, వైసిపి ఉన్నాయని, దేశద్రోహం బిజెపి చేస్తుంటే…. ఆ ద్రోహంలో బిఆర్‌ఎస్‌, వైసిపి, పాలుపంచుకుంటున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌కు మాకు చాలా వైరుధ్యాలు ఉన్నా బిజెపిని ఓడించడమే కర్తవ్యంగా పెట్టుకొని ఇండియా కూటమిలో చేరమని, బిజెపిని ఓడించడానికి ఇండియా కూటమితో వెళ్ళడం కెసిఆర్‌కు ఎందుకు నచ్చడం లేదని అయన ప్రశ్నించారు. అందుకే వామపక్షాలతో పొత్తు వద్దనుకున్నారన్నారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్‌ ఉద్యమం మహత్తరమైన ఉద్యమమని, ఆ ఉద్యమం కారణంగానే ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు విద్యుత్‌ చార్జీలను పెంచే, విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరణ చేసే సాహసం చేయలేదని చెప్పారు. ప్రపంచ బ్యాంకు విధానాల్లో భాగంగానే అప్పటి టిడిపి ప్రభుత్వం విద్యుత్‌ సంస్కరణలను అమలు చేసిందని, విద్యుత్‌ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వేలాదిమందితో వామపక్షాలు ప్రజా ఉద్యమం చేస్తే చంద్రబాబు ప్రభుత్వం క్రూరమైన ప్రవర్తనతో బషీర్‌బాగ్‌ వద్ద అడ్డుకొని గుర్రాలతో తొక్కించి, విచక్షణా రహితంగా లాఠీచార్జ్‌, నీటి ఫిరంగులు ప్రయోగించి, పోలీసు కాల్పులు జరిపి ముగ్గురు ఉద్యమకారులను బలి తీసుకుందని అయన గుర్తు చేశారు. వామపక్షాల నేతత్వంలో ఆనాడు జరిగిన విద్యుత్‌ ఉద్యమానికి విస్తృతంగా ప్రజా మద్దతు లభించిందన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అంతకంటే ఉధతంగా ప్రపంచ బ్యాంకు, పెట్టుబడిదారీ విధానాలను అమలు చేస్తూ ప్రజా వ్యతరేక కేంద్రం విద్యుత్‌ సవరణ బిల్లును తీసుకువచ్చిందని, దేశంలో కొన్ని రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేసి వ్యవసాయ నీటి మోటార్‌లకు విద్యుత్‌ మీటర్‌లను బిగించిందని, దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. విద్యుత్‌ సంస్కరణలను వ్యతిరేకిస్తూ గ్రామ స్థాయి నుంచి ప్రజా ఉద్యమం మొదలైతే మోడీ ప్రభుత్వం తట్టుకోవడం కష్టమన్నారు. కేంద్రం విద్యుత్‌ సవరణ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని అయన డిమాండ్‌ చేశారు. బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ముందుకు రావాలని చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్‌ నాయకురాలు పి. ప్రేమపావని, హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌. ఛాయాదేవి, సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, ఎఐటియుసి తెలంగాణ రాష్ర్ట ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ, కార్యదర్శి బి. వెంకటేశం, సిపిఎం హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఏం. శ్రీనివాస్‌, నాయకులూ మహేందర్‌, ప్రజాపంథా నాయకులూ కిరణ్‌, న్యూడెమోక్రసీ నాయకులు జి. అనురాధ, ఏం. శ్రీనివాస్‌, ఎంసిపిఐ(యు) నాయకులూ వనం సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments