పరిహారం చాలకపోతే కోర్టుకు రండి
కాళేశ్వరం, అనుబంధ ప్రాజెక్టులపై హైకోర్టు స్పష్టీకరణ
ప్రజాపక్షం/ హైదరాబాద్ లీగల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయం లో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టు నిర్మాణాల్ని నిలిపివేసే విధంగా మధ్యంతర ఆదేశాలు జారీ చేసే ప్రసక్తే లేదని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. అంతే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు, దానిలో భా గంగా నిర్మిస్తున్న అనుబంధ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దాఖలైన మొత్తం కేసులన్నింటినీ కలిపి విచారిస్తామని ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నీటి కోసం జనం అల్లాడుతున్నారని, ప్రభుత్వం మంచినీటి పథకాలు, నీటిపారుదల కోసం ప్రాజెక్టును నిర్మాణం చేస్తోందని గుర్తించాల్సిన అవసరం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం సేకరించిన భూములకు ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని రైతులు తీసుకోవాలని, ఆ పరిహారం సరిపోదని భావించే రైతులు, రైతు కూలీలు, నిర్వాసితులు తమ వద్దకు రావచ్చునని ధర్మాసనం సూచన చేసింది. పరిహారం తీసుకోని 46 మంది రైతుల చెక్కులను వారి తరఫు వాదించే న్యాయవాదికి ప్రభుత్వం అందజేసింది. రైతులు, రైతు కూలీలు ఇతరులకు పునరావాసం, పునర్నిర్మాణం (ఆర్‌ఆర్ ప్యాకేజీ) అమలు చేసే వరకూ ఏట” గడ్డ కిష్టాపూర్ గ్రామంలో పనులు చేయరాదని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం అప్పీల్ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. సింగిల్ జడ్జి తీర్పును ఖాతరు చేయకుండా నిర్మాణాలు చేస్తూ కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడుతోందని సరిత సహా ఆరుగురు వ్యాజ్యాల్ని దాఖలు చేశారు. వీటన్నింటినీ హైకోర్టు ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచందర్‌రావు వాదిస్తూ.. ఇప్పటికే ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన 177 కేసులన్నింటినీ కలిపి ఒకేసారి విచారించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుబంధ వ్యాజ్యాన్ని దాఖలు చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసులన్నీ త్వరగా తేల్చాలని, ప్రాజెక్టు నిర్మాణాలు కొనసాగేందుకు న్యాయపరమైన అడ్డంకుల్ని తొలగించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వివిధ దశలను సవాల్ చేస్తూ మొత్తం 177 వ్యాజ్యాలు దాఖలయ్యాయని, వాటన్నింటినీ కలిపి సత్వరమే విచారణ పూర్తి చేయాలని ఆయన కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని, రైతుల భూముల్ని సాగులోకి తెచ్చే మహత్తర ప్రయత్నానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఈ నేపథ్యంలో కేసులన్నింటినీ ఒకేసారి విచారణ పూర్తి చేయాలన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు అందించిన పునరావాస, ఉపాధి చర్యలపై పూర్తి నివేదిక సిద్ధం చేశామని, హైకోర్టుకు అందజేశామని తెలిపారు. భూసేకరణ చట్టం కంటే ఎక్కువగా ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.