చాడ పుస్తకావిష్కరణ సభలో వక్తల ఉద్ఘాటన
ప్రశ్నించే గొంతులపై దేశ ద్రోహం కేసులా!
ప్రజాపక్షం/హైదరాబాద్ దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని, ప్రశ్నించే గొంతులపై దేశ ద్రోహం కేసు లు నమోదు చేస్తున్నారని పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై కనీసం నిరసన తెలిపే పరిస్థితులు కూడా లేకుం డా పాలకులు వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా పరిణామాలు, పరిస్థితులకు “ప్రభుత్వాల బందీగా ప్రజాస్వామ్యం” పుస్తకం అద్దం పడుతోందని వారు పేర్కొన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి రాసిన వ్యాసాల సంకలనం “ప్రభుత్వాల బందీగా ప్రజాస్వామ్యం” పుస్తకావిష్కరణ సభ శనివారం హైదరాబాద్ మఖ్దూంభవన్లోని రాజబహద్దూర్ గౌర్ హాల్లో జరిగింది. ఈ పుస్తకాన్ని కేంద్ర సమాచార మాజీ కమిషనర్ ఆచార్య మాడభూషి శ్రీధర్ ఆవిష్కరించారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) అధ్యక్షులు, ‘ప్రజాపక్షం’ ఎడిటర్ కె.శ్రీనివాస్‌రెడ్డి, ఇప్టా ఉపాధ్యక్షులు కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి, నవచేతన విజ్ఞాన సమితి చైర్మన్, మాజీ ఎంఎల్ఎ పల్లా వెంకట్‌రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యులు సయ్యద్ అజీజ్‌పాషా, పుస్తక ప్రచురణకర్త శివారెడ్డి, రాజమణి దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
పార్టీ ఫిరాయింపుల చట్టం సభ్యులకు విఘాతం: మాడభూషి శ్రీధర్
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వల్ల సభలోని సభ్యుల(ఎంపిలు, ఎంఎల్ఎలు) స్వేచ్ఛకు విఘా తం కలుగుతుందని మాడభూషి శ్రీధర్ అన్నారు. ఈ చట్టం ద్వారా సభ్యలను తొలిగించే ప్రమాదం ఉన్నదని అన్నారు. “ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న బిల్లులలో ఏముందో కూడా చూడకుండా సభ్యులు ఆమోదం తెలుపుతున్నారు. బిల్లులకు మద్దతు తెలుపుతున్న ఎంపిలకు ఆ చట్టంలో ఏముందో తెలుసా? వాటి గురించి చెప్పలగలరా” అని శ్రీధర్ ప్రశ్నించారు. ఓట్ల నిష్పత్తి ద్వారా కాకుండా ఎక్కువ ఓట్లు, సీట్లు వచ్చిన వారికే అధికారం చేపట్టే విధానం ప్రజాస్వామ్యానికి పట్టిన పెద్ద కరోనా లాంటిదని, ఇలాంటి మెజారిటీని రాజ్యాంగంలో ఎక్కడా నిర్వచించలేదని ఆయన వివరించారు. భావావేశాలతో ప్రభుత్వం నియంతల చేతిలోకి పోతుందని, ఆ తర్వాత ప్రభుత్వాల చేతిలో ప్రజాస్వామ్యం బందీగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతికలలోని సంపాదకీయ స్థలాన్ని కూడా ప్రభుత్వ అధినేతలే ఆక్రమిస్తున్నారని, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు ఎంపిలు వ్యాసాలు రాస్తున్నారన్నారు. కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చాడ వెంకట్‌రెడ్డి అంతర్లినం భిన్నంగా ఉంటుందన్నారు. ప్రజల భావాలను అర్థం చేసుకుని, వారితో చాడ మమేకమయ్యారన్నారు. నాడు ఒక ప్రకటన చూసి ఆర్టిఐ కమిషనర్‌గా దరఖాస్తు చేసుకున్న మాడభూషి శ్రీధర్‌కు అవకాశం లభించిందని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ చాడ వెంకట్‌రెడ్డి పార్టీ కార్యదర్శిగా, రచయితగా, కవిగా త్రిపాత్రభినయం పోషిస్తున్నారన్నారు. “ప్రభుత్వాల బందీగా ప్రజాస్వామ్యం” పుస్తకం భావితరాలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. పుస్తక పఠనం లేకపోతే చరిత్ర తెలిసే అవకాశం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి గురించి ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించారన్నారు. సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ దేశం, రాష్ట్రంలో డిక్టెటర్షిప్ కొనసాగుతోందని విమర్శించారు. వాస్తవ పరిస్థితుల పరిశీలన, అంచనాలు, వాటిపై చర్చలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఐటియసి రాష్ట్ర ప్రధాన వి.ఎస్.బోస్ మాట్లాడుతూ శ్రామిక రాజ్యం వచ్చే వరకు “ప్రభుత్వాల బందీగా ప్రజాస్వామ్యం’ ఒక కర దీపికగా ఉంటుందన్నారు. ఐఎఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ ఉద్యమకారుల పుస్తకాలు అద్భుతంగా ఉంటాయన్నారు.
ప్రజాస్వామ్య విలువలకు పాతర: చాడ వెంకట్ రెడ్డి
దేశంలో ప్రజాస్వామ్య విలువలను పాతరేస్తున్నారని చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తున్నారని, వ్యవసాయ రంగంలో కూడా ప్రైవేటీకరణ వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల నుంచి నేర్చుకుని, వారితో మమేకమై ఆ ఆనుభవాలతోనే పుస్తకాలను రాశానన్నారు. ప్రతి ఒక్కరిలో హవభావాలు ఉంటాయని, అనుభవాలను , స్పందనను గుర్తించి ఆలోచన చేసినప్పుడే పుస్తకాలను రాయగలమన్నారు. వ్యాసాలు రాయడం కత్తి మీద సాములాంటిదని, అంత సులువైన పని కాదని, ఒక్కోసారి రాత్రి 12 గంటలకు వచ్చిన ఆలోచననలను అక్షర రూపంలో పెట్టానని వివరించారు. అనంతరం పుస్తక ప్రచురణకర్త శివారెడ్డి, రాజమణి దంపతులను చాడ వెంకట్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమానికి అభ్యుధయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు సుదర్శన్ సభకు అధ్యక్షత వహించారు. తొలుత అరసం కార్యనిర్వాహక కార్యదర్శి వల్లేరు వీరాస్వామి సభకు స్వాగతం పలుకగా అరసం రాష్ట్ర కార్యదర్శి కెవిఎల్ సమన్వయ కర్తగా వ్యవహారించారు.
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
RELATED ARTICLES