ప్రభుత్వాలకు ప్రజలప్రాణాలంటే లెక్క లేదు!

l కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

రాష్ట్రంలో రైతుల స్వేచ్చను హరించడం సిగ్గుచేటు

ఉద్యోగుల జీతాల కోత కూడా సరికాదు

పెట్రోలు, డీజీల్‌ ధరల పెంపుపై ఈ నెల 20న

నిరసనలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి

ప్రజాపక్షం / కరీంనగర్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి ఆరోపించారు. గురువారం కరీంనగర్‌లోని బద్దం ఎ ల్లారెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చాడ వెంకట్‌ రెడ్డి మాట్లాడారు. కరోనా పాజిటివ్‌ పేషంట్స్‌ ను చూడడానికి డాక్టర్లు, సిబ్బందికి కనీసం పిపిఇ కిట్లను కూడా అందించడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయని, పేషంట్ల ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. రోజు రోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగున్నాయని, ప్రభు త్వం మాత్రం చేతులెత్తేసిందని విమర్శించారు. గచ్చి బౌలీ స్టేడియంలోకి 1500 పడకల గదుల వసతి ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం దుర్మార్గమని, పే షంట్స్‌ను అక్కడికి ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు. హస్పిటల్‌ లో సిబ్బంది కొరత ఉన్నదని, వారికి వసతులు కల్పించడం లేదని, ప్రభుత్వం ఎందుకు ఆ కొరత తీర్చడం లేదో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ రాష్ట్రంలో రైతుల స్వేచ్ఛను ముఖ్యమంత్రి కెసిఆర్‌ హరించడం సిగ్గుచేటని అన్నారు. ఏ పంట వేయాలో ఏ పంట వేయకూడదో పాలకులు చెప్పి రైతులను అయోమయానికి గురిచేయడం, రైతులకు రైతుబంధు వస్తదో రాదో అని రైతులు భయాందోళనకు గురవుతున్నారని ఆందోళన వ్య క్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కోత, చివరకు పెన్షనర్స్‌ పెన్షన్‌లో కోత విధించి వారిని ఇబ్బందులకు గురి చేసిన ఘనత సిఎం దక్కిందని దుయ్యబట్టారు. వేతనాల కోతకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పటికీ కేంద్రం ప్రభుత్వం వరుసగా పది రోజుల నుండి పెట్రోల్‌, డీజిల్‌ ధ రలు పెంచి కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును ఆర్థిక లేమి పేరుతో కూడపెట్టడం తీవ్ర అన్యాయమని, ఈ విధానాన్ని నిరసిస్తూ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈ నెల 20న దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు లేదా జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ముందు ఆందోళనలు చేపట్టనున్నట్లు చాడ వెంకట రెడ్డి తెలిపారు. చైనా -భారత్‌ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్లకు సిపిఐ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. సరిహద్దు సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలని కేంద్రానికి చాడ వెంకట రెడ్డి సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పోనగంటి కేదారి, సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్‌ కుమార్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్‌, గూడెం లక్ష్మీ, అందె స్వామి, టేకుమల్ల సమ్మయ్య, బత్తుల బాబు, పైడిపల్లి రాజు, జెవి.రమణా రెడ్డి, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్న, బోనగిరి మహేందర్‌, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, బ్రామండ్ల పెల్లి యుగేందర్‌, నునావత్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?