మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో స్పష్టం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
ప్రజాపక్షం / హైదరాబాద్ లీగల్: మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని, అయితే ప్రభుత్వం ఎన్నికలకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టడంలో జరిగిన జాప్యం కారణంగా ఎన్నికలు నిర్వహించలేకపోయామని స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ అశోక్ కుమార్ హైకోర్టుకు విన్నవించారు. ఎన్నికల ప్రక్రియ తొందరగా చేయాలని హడావుడిపడటం సమంజసం కాదం టూ నిర్మల్ జిల్లాకు చెందిన కె.అంజ్ కుమార్‌రెడ్డి వేసిన పిల్‌పై వివరణ ఇస్తూ ఆయన కౌంటర్ వ్యాజ్యాన్ని వేశారు. ఐదేళ్ల గడువులోగా ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగం నిర్ధేశించిందని, అందుకే వార్డుల పునర్విభజన, వార్డు సభ్యులు/చైర్మన్ వంటి పదవులకు రిజర్వేషన్ల ఎంపిక వంటివి ఖరారు చేయాలని గత ఏడాదే సర్కార్‌కు లేఖ రాయడం జరిగిందన్నారు. మున్సిపల్ యాక్ట్‌ను కొత్తగా చేస్తామని, ఈ కారణంగా ఓటర్ల జాబితా సరవణ ప్రచురణ వంటి చర్యలు తీసుకోరాదని ప్రభుత్వం కోరడంతో ఈ ఏడాది మార్చి 14 వరకూ వాయిదా వేశామన్నారు. చివరికి ఏప్రిల్ మూడో వారం నాటికి మొత్తం అంతా చేసి ఎన్నికలకు సర్వసన్నద్ధం చేస్తామని లెటర్ రాసి కూడా చేయలేదన్నారు. అందుకే హైకోర్టు మెట్లు ఎక్కాల్సివచ్చిందని, దాంతో 119 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు సింగిల్ జడ్జి ప్రభుత్వాన్ని ఆదేశించిందని గుర్తు చేశారు. ఆ తర్వాత 30 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని తమను హైకోర్టు ఆదేశించిందని చెప్పారు. జులై 7 నాటికి వార్డుల విభజన, 14 నాటికి రిజర్వేషన్ల ఖరారు చేస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఓటర్ల జాబితా సవరణలకు పది రోజుల సమయం ఇస్తే.. ఈలోగా హైకోర్టులో కేసులు పడ్డాయన్నారు. ఫలితంగా మరో ఏడు రోజులు అవసరమైందన్నారు. తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్‌లకు జరిగిన ఎన్నికల నాటి ఓటర్ల జాబితా ఉందని, ఈ లిస్ట్ సవరణలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి వాటిని బేస్ చేసుకుని మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం చేయాల్సిన విధుల్ని పూర్తి చేసి తుది జాబితా అందజేసిన 20 రోజుల్లోనే ఎన్నికలు జరిపేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికలు నిర్వహణకు వీలుగా న్యాయపరమైన అడ్డంకులు లేకుండా ఉత్తర్వులు ఇవ్వాలని, పిల్‌ను కొట్టేయాలని కౌంటర్ రిట్ ద్వారా హైకోర్టును ఎలక్షన్ కమిషన్ కోరింది.