HomeNewsBreaking Newsప్రపంచంపై ఆధిపత్యవాదాన్ని సహించం…

ప్రపంచంపై ఆధిపత్యవాదాన్ని సహించం…

ఐక్యరాజ్యసమితికే పట్టం కడదాం…
తైవాన్‌లో ఇతరుల జోక్యం అంగీకరించం…
సంక్షోభ తరుణంలో మానవ విలువలు ఇచ్చిపుచ్చుకుందాం
సిపిసి కాంగ్రెస్‌ వర్క్‌ రిపోర్ట్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపు
బీజింగ్‌ :
ప్రపంచంపై గుత్తాధిపత్యం వహించే అన్నిరకాల ఆధిపత్యవాద ధోరణులను చైనా నిర్దంద్వంగా తిరస్కరించింది. అంతర్జాతీయ చట్టాలను కాపాడుతూ ఐక్యరాజ్యసమితికే పట్టం కట్టాలని సిపిసి 20వ కాంగ్రెస్‌ ప్రారంభోత్సవ సభలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు. తైవాన్‌లో బలప్రయోగానికి అతీతంగా శాంతియుత విలీన పరిష్కారానికే చైనా ప్రయత్నం చేస్తుందని, అయితే తైవాన్‌ సమస్య చైనాకే పరిమితమని అన్నారు. తైవాన్‌ లో ఇతరుల జోక్యం నివారించేందుకు అవస రం అయితే బలప్రయోగానికి వెనుకాడబోమని హెచ్చరించారు. మానవాళి అసాధారణమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో సన్నిహితత్వంతో ప్రపంచ ప్రజలు పరస్పరం అర్థం చేసుకోవాలన్నారు. శాంతి, అభివృద్ధి, న్యాయం,ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, హక్కులు, నిజాయతీతో కూడిన బాహాటత్వం వంటి మానవాళి విలువలను ఇచ్చిపుచ్చుకోవాలని జిన్‌పింగ్‌ పిలుపు ఇచ్చారు. చైనా ఏనాడూ ఆధిపత్యవాదాన్ని కోరుకోలేదని, ఎన్నడూ విస్తరణ వాద కార్యకలాపాలను ఆశ్రయించలేదని అన్నారు. కొత్త తరహా అంతర్జాతీయ సంబంధాలను ప్రోత్సహించేందుకు చైనా కట్టుబడి ఉందన్నారు. వాస్తవాలపై ఆధారపడిన బహుళత్వాన్ని, అంతర్జాతీయ సంబంధాల్లో గురుతర ప్రజాస్వామ్యాన్ని చైనా గౌరవిస్తుందన్నారు. ఐక్యరాజ్యసమితి పాలనావ్యవస్థ అభివృద్ధి,సంస్కరణల్లో చైనా క్రియాశీల పాత్ర వహిస్తోందన్నారు. చైనా తన మౌలిక జాతీయ విధానానికి కట్టుబడి పరస్పర ప్రయోజనాత్మక,వ్యూహాత్మక సంబంధాలకు ఇతర దేశాలను ఆహ్వానిస్తుందన్నారు. ఆదివారం ఉదయం బీజింగ్‌లో ప్రారంభమైన చరిత్రాత్మక సిపిసి( చైనా కమ్యూనిస్టుపార్టీ )20 వ జాతీయ మహాసభల (కాంగ్రెస్‌) ప్రారంభోత్సవ వేదికపై జిన్‌పింగ్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నాలుగేళ్ళ కార్యకలాపాల నివేదికను కీలకోపన్యాసంలో మహాసభ ముందుంచారు. ప్రపంచంపై సాగించే అన్ని రకాల ఆధిపత్యవాదాలను, అధికార రాజకీయాలను, ద్వంద్వ ప్రమాణ రాజకీయాలను చైనా చెక్కుచెదరని స్థిరత్వంతో వ్యతిరేకిస్తోందని చెప్పారు. ప్రపంచమానవాళి అభివృద్ధికి, వెలుగులబాట పరచడానికి చేయి చేయి కలిపి పని చేయడానికి చైనా ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. చైనా సమాజంలో బాధ్యత, అంకితభావం, పనిసంస్కృతి, నైతిక రుజ వర్తనలను పెంపొందించడంతోపాటు శాస్త్రసాంకేతిక రంగాల్లో చైనాను అగ్రగామిగా, సోషలిస్టు ప్రజాస్వామ్య వ్యవస్థగా చైనాను తీర్చిదిద్దడమే కమ్యూనిస్టుపార్టీ ఆశయమని జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు. చైనా ప్రజల హక్కుల సంరక్షణ, ప్రాదేశిక, సార్వభౌమాధికార రక్షణకు సైన్యాన్ని 2027 నాటికి ప్రపంచస్థాయీ నాణ్యతా ప్రమాణాలతో తీర్చిదిద్దుతామన్నారు. శతాబ్ది సోషలిస్టు లక్ష్యాలు సాధిస్తామన్నారు. ప్రాంతీయంగా ఉన్న కొన్ని దేశాలకు వ్యతిరేకంగా గురిపెట్టి ఏర్పాటు చేసిన అనేక బ్లాకులు, గ్రూపులు, కూటములు సహా అన్ని రకాల ఏకస్వామ్యధోరణులను చైనా ప్రతిఘటిస్తుందన్నారు. అమెరికా, భారత్‌,ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన ‘క్వాడ్‌’ ఆస్ట్రేలియా,బ్రిటన్‌, అమెరికాలతో కూడిన ‘ఔకస్‌’ (ఎయుకెయుఎస్‌) వంటి కూటములన్నీ చైనా ఎదుగుదలను అడ్డుకోవడానికేనని జిన్‌పింగ్‌ అన్నారు. అత్యంత కీలకమైన ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వ్యవస్థ, దాని చట్టాలను సంరక్షించడానికి చైనా కృతనిశ్చయంతో ఉందని జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి హక్కుల పత్రానికి అనుగుణంగా అంతర్జాతీయ సంబంధాలను, పాలనను నిర్దేశింస్తూ చేసిన సూత్రాలు, ఉద్దేశాలు పటిష్టమైన పునాదులపై రూపొందించబడి ఉన్నాయని, ఆ చట్టాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇండో ్రప్రాంతంలో చైనా సైనికశక్తి పట్టుబిగించి బెడదగా మారడంతో ఆ దేశాన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉందని ఆ లక్ష్యంకోసం ఆవిర్భవించిన ‘క్వాడ్‌’ కూటమి వాదిస్తున్నది.
చైనా అభివృద్ధి గురించి జిన్‌పింగ్‌ సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. కమ్యూనిస్టు సిద్దాంతమే చైనా సమాజ అభివృద్ధి వెనుక కీలకమైన సిద్ధాంతంగా కొనసాగుతుందని జిన్‌పింగ్‌ తన నివేదికలో స్పష్టం చేశారు. చైనా పారిశ్రామిక రంగం, సైనిక రంగం, ప్రాదేశిక సరిహద్దుల సంరక్షణ, సాంకేతికత విస్తరించడంద్వారా ప్రతి రంగాన్ని అభివృద్ది చేయడం, చైనా ప్రజలమధ్య సంబంధాలు, వారి నైతిక రుజు వర్తన, ప్రజల్లో బాధ్యత, అంకితభావం పెంపొందించడం కోసం సోషలిస్టు సమాజ ఆవిర్భావదిశగా తీసుకునే చర్యలు వంటి అనేక విషయాలను ఆయన సుదీర్ఘంగా వివరించారు. దేశంలో వేతనాల్లో వెనుకబడి ఉన్న కార్మికుల వేతనాలు పెంపొందించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని జిన్‌పింగ్‌ భరోసా ఇచ్చారు. పార్టీకి అనుబంధంగా ఉన్న సంస్థలన్నింటినీ పటిష్టపరుస్తామని చెప్పారు.
ఉట్టిపడిన క్రమశిక్షణ
ప్రతిసారీ ఆయన సభకు హాజరైన ప్రతినిధులను ‘కామ్రేడ్స్‌…అని సంబోధిస్తూ ఒక్కొక్క అంశాన్నీ వివరించుకుంటూ వచ్చారు. ప్రతిసారీ ఆయన సభకు హాజరైన ప్రతినిధులను ‘కామ్రేడ్స్‌…అని సంబోధిస్తూ ఒక్కొక్క అంశాన్నీ వివరించుకుంటూ వచ్చారు. 2,296 మంది హాజరైన ప్రతినిధులు తమ తమ ప్రాతీయ సంస్కృతులను ప్రతిబింబించే వేషధారణలతో హాజరై ఎంతో క్రమశిక్షణతో జిన్‌పింగ్‌ ప్రసంగాన్ని ఆలకించారు. జిన్‌పింగ్‌ ప్రసంగ సమయంలో ప్రతిసారీ గ్రేటర్‌ హాల్‌ ఆఫ్‌ పీపుల్‌ చప్పట్లతో మారుమోగిపోయింది. ఏడురోజులపాటు జరిగే ఈ మహాసభలను కవర్‌ చేసేందుకు 2,300 మంది జర్నలిస్టులు దరఖాస్తు చేసుకున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments