HomeNewsBreaking Newsప్రధాని పర్యటనకు కెసిఆర్‌ దూరం

ప్రధాని పర్యటనకు కెసిఆర్‌ దూరం

చర్చనీయాంశంగా సిఎం పర్యటన
ప్రధానికి స్వాగతం పలకనున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
ప్రజాపక్షం / హైదరాబాద్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం తెలంగాణ రాష్ట్రానికి వస్తుంటే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బెంగుళూరు పర్యటనకు వెళుతుండడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిం ది. ఈ విషయంపై బిజెపి, టిఆర్‌ఎస్‌ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకోవడంతో రాజకీయ రంగు పులుముకుంటున్నది. సిఎం కెసిఆర్‌కు ప్రధానిని కలిసే ముఖం లేకనే బెంగుళూరుకు పర్యటన చేస్తున్నారని బిజెపి నేతలు ఆరోపించగా ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన వల్ల రాష్ట్రానికి నయా పైసా ఉపయోగం లేదని టిఆర్‌ఎస్‌ నేతలు విమర్శించారు. ప్రధాన మంత్రి రాష్ట్రానికి వస్తుంటే సిఎం కెసిఆర్‌ రాష్ట్రంలో ఉండకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది.
ప్రధానికి స్వాగతం పలకనున్న మంత్రి తలసాని
హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బి) వార్షికోత్సవంలో పాల్గొనేందుకు గురువారం రానున్న
ప్రధాని మోడీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్వాగతం పలుకనున్నారు. దీంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి ప్రధాని మోడీ పర్యటనకు దూరంగా ఉండనున్నారు. గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు ప్రధాని మోడీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ‘వెయిటింగ్‌ ఇన్‌ మినిస్టర్‌’గా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆహ్వానం పలుకుతారు. ఆ తర్వాత మోడీ అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా హెచ్‌సియుకు చేరుకుంటారు. అక్కడి నుండి ప్రధాని రోడ్డు మార్గం ద్వారా ఐఎస్‌బికి చేరుకుని ఐఎస్‌బి వార్షికోత్స కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ‘ఐఎస్‌బి మై స్టాంప్‌, ప్రత్యేక కవర్‌’ను మోడీ ఆవిష్కరిస్తారు. గోల్డ్‌ మెడల్‌ సాధించిన విద్యార్థులకు పతకాలను ప్రదానం చేయనున్నారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి మోడీ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన సాయంత్రం 3.55 గంటలకు తిరుగు ప్రయాణం చేస్తారు. ఈ తిరుగు ప్రయాణంలో ప్రధానికి తలసాని వీడ్కోలు పలుకుతారు.
ఎస్‌పిజి ఆధీనంలో బేగంపేట విమానాశ్రయం
ప్రధాని మోడీ రాక సందర్భంగా బేగంపేట విమానాశ్రయాన్ని ఎస్‌పిజి తమ అధీనంలోకి తీసుకుంది. భద్రతలో పాల్గొనే సిబ్బందికి అధికారులు కొవిడ్‌ పరీక్షలను నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా రోడ్డు మార్గాన్ని కూడా అధికారులు సిద్ధం చేశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఐఎస్‌బి వరకు పిఎంఒ భద్రతా విభాగం బుధవారం ట్రయల్‌ రన్‌ నిర్వహించింది. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐఎస్‌బికి సుమారు ఐదు కిలోమీటర్ల పరిధిలో రిమోట్‌ కంట్రోల్‌ డ్రోన్ల వాడకంపై నిషేధం విధించారు. కేవలం ఒక్క ఐఎస్‌బిలోనే సుమారు 2 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments