కరీంనగర్ లోక్సభ నియాజకవర్గ సన్నాహక సమావేశంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
ప్రజాపక్షం/హైదరాబాద్/కరీంనగర్: ఎన్నికల్లో టిఆర్ఎస్ ఇచ్చిన హామీల్లో భాగంగా ఏప్రిల్ లేదా మే నుంచి ఆసరా పెన్షన్ రూ.2 వేలు, రైతు బంధు కింద రూ. 5 వేలు ఇవ్వబోతున్నామని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు వెల్లడించారు. త్వరలోనే రైతులకు రుణ మాఫీ చేయబోతున్నామన్నారు. వీటి సంబంధిం చి బడ్జెట్లో కేటాయింపులు చేశామని చెప్పారు. కేంద్రంలో కొత్త కూటమి ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, ప్రధాని ఎవరు అనేది ఫెడరల్ ఫ్రంట్ నిర్ణయిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇవ్వాలని, 16 ఎంపి స్థానాలు గెలిపిస్తే, ఢిల్లీలో ఎవరిని గద్దె ఎక్కించాలనేది టిఆర్ఎస్ నిర్ణయిస్తుందని చెప్పారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం కరీంనగర్లో బుధవారం జరిగింది. ఈ సమావేశానికి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, మంత్రులు మహమూద్ అలీ, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు డాక్టర్ కె.కేశవరావు, కరీంనగర్ ఎంపి బి.వినోద్ కుమార్, ఎంఎల్ఎలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, జడ్పి చైర్పర్సన్ తుల ఉమ పాల్గొన్నారు. యుపిఎ, ఎన్డిఎ అంటే గిట్టని రాజకీయ పార్టీలు ఉన్నాయని, ఈ పార్టీలకు 70 ఎంపి స్థానాలు గెలిస్తే వాటికి టిఆర్ఎస్కు వచ్చే 16 స్థానాలు తోడైతే వందకు పైచిలుకుతో కొత్త కూటమి ఏర్పడుతుందని, అప్పుడు ప్రధాని ఎవరనేది మనమే నిర్ణయిస్తామన్నారు. పొరపాటున కాంగ్రెస్ రెండు సీట్లు గెలిచినా తెల్లారితే వారికీ మనకు కొట్లాటలు తప్పవన్నారు. ఒకే నాగలికి దున్నపోతు, ఎద్దును కడితే వ్యవసాయం ముందుకుసాగదని, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అలాగే ఉంటుంది అని చెప్పారు. ప్రతి ఎంపి సీటును కూడా ఒక సవాలుగా తీసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ ఎంపికి 5 లక్షల మెజార్టీ రావాలని ఆకాంక్షించారు. ఎంఎల్ఎలు తమకు వచ్చిన మెజార్టీ కంటే రెట్టింపు మెజారిటీని లోక్సభ ఎన్నికల్లో తీసుకురావాలని సూచించారు. నాయకులు నేల విడిచి సాము చేయరాదని, పెద్ద నాయకులమని సొంత గ్రామాన్ని నిర్లక్ష్యం చేయవద్దన్నారు. స్థానికంగా నేతలు తమ సత్తా చాటాలని, అప్పుడు ఎంపిటిసి, జెడ్పిటిసి టిక్కెట్ అడుగుతానని సవాలుగా తీసుకోవాలన్నారు.