పొత్తులతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై పోరాటం
అసెంబ్లీలో ఉన్న ఒక్కస్థానం నుంచి పదికి చేరుకోవాలి
ఇప్పటినుంచే భవిష్యత్ ఎన్నికలకు సన్నద్ధం కావాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
హన్మకొండ నుంచి ఇ.చంద్రశేఖర్
ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థులను ఓడించేందుకు భావసారూప్యత కలిగిన ప్రజాతంత్ర, లౌకిక పార్టీలతో పొత్తులు లేకపోయినా, ఉన్నా ప్రజా సమస్యలపై కమ్యూనిస్టు పోరాటాలు నిరంతరం కొనసాగుతాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో సిపిఐకి ఉన్న ఒక్క స్థానం నుంచి పదుల సంఖ్యకు చేరుకోవాలని, అందుకు ఇప్పటి నుంచే భవిష్యత్ ఎన్నికలకు సన్నద్ధం కావాలన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ విఫలమైందని, ఆ పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి వెళుతున్నారన్నారు. హన్మకొండలో జరుగుతున్న సిపిఐ రాష్ట్ర సమితి నిర్మాణ సమావేశాల రెండో రోజు శుక్రవారం కూనంనేని సాంబశివరావు కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. సమావేశానికి హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి అధ్యక్షత వహించగా, వేదికపై సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపి సయ్యద్ అజీజ్‌పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ, తక్కెళ్లపల్లి శ్రీనివాస్, కలవేణ శంకర్, ఎన్.బాలమల్లేష్, ఇ.టి.నరసింహ్మ, ఎం.బాలనరసింహ్మ, కార్యవర్గ సభ్యులు బి.విజయసారధి ఆశీనులయ్యారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలలో ఇప్పటి నుంచే తగిన ఏర్పాటు చేసుకోవాలని, ఈ కార్యాచరణను రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నుంచే మొదలు పెట్టాలని, అన్ని గ్రామాలలో సిపిఐ పోటీ చేయాలన్నారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, సమస్యల నేపథ్యంలో కమ్యూనిస్టులు ఉండాలని కోరుకునే వారి సంఖ్య నిత్యం పెరుగుతున్నదని, ఎన్నికల్లో గెలిచినా ఓడినా కమ్యూనిస్టులు ఉండాలని ప్రజలంతా కోరుకునే స్థాయికి కమ్యూనిస్టు పార్టీ ఎదగాలన్నారు. కమ్యూనిస్టు పార్టీని ప్రజల పార్టీగా, పోరాటపార్టీగా మరింతగా పటిష్ట పరచాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందని ఆయన అన్నారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సిపిఐ తన సత్తా చాటాలని, తద్వారా కమ్యూనిస్టు పార్టీని మరింత పటిష్టం చేసుకోవాలన్నారు. ప్రజల కోసం ప్రజలతోనే కమ్యూనిస్టు శ్రేణులు ఉండాలన్నారు.
వియత్నాం పర్యటనకు చాడ వెంకట్‌రెడ్డి
సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా నేతృత్వంలో ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు వియత్నాం పర్యటనకు వెళుతున్న సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డికి సిపిఐ రాష్ట్ర సమితి అభినందనలు తెలియజేసింది. సమావేశంలో ఈ విషయాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. చాడ వెంకట్‌రెడ్డి పర్యటన విజయవంతం కావాలని, ఆ దేశంలో కమ్యూనిస్టు పరిపాలన, రాజకీయాలు, ఇతర పరిణామాలను అధ్యయనం చేసి రాష్ట్ర కమ్యూనిస్టు శ్రేణులకు తెలియజేయాలని ఆయన అన్నారు.