ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సంఘటిత పోరాటం

టి.నరసింహన్‌కు ఘనమైన నివాళి అదే.. : సంతాప సభలో వక్తలు
ప్రజాపక్షం/హైదరాబాద్‌ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా అందరూ సంఘటితంగా పోరాటం చేయడమే కార్మికోద్యమ నేత టి.నరసింహన్‌కు ఘనమైన నివాళి అని పలువురు వక్త లు అన్నారు. సుఖపడేందుకు అన్ని వసతులూ, సౌకర్యాలు ఉన్నప్పటికీ ఆయన జీవితాంతం కార్మికుల హక్కుల సాధనకు, ఉద్యోగుల సమస్య ల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి అని వారు కొనియాడారు. ఎఐటియుసి జాతీయ ఉపాధ్యక్షులు టి.నరసింహన్‌ సంతాప సభ’ హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో శనివారం జరిగింది. ఈ సందర్భంగా నరసింహన్‌ చిత్రపటానికి నేతలు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కొద్దిసేపు మౌనం పాటించారు. సభకు ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌. బాలరాజ్‌ అధ్యక్షత వహించగా సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎఐటియుసి ఆంధ్రప్రదేశ్‌ శాఖ ప్రధానకార్యదర్శి పి.జె.చంద్రశేఖర్‌, ఎఐటియు సి జాతీయ కార్యవర్గ సభ్యులు ఉజ్జిని రత్నాకర్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్‌.బోస్‌, ఉపాధ్యక్షులు,డిఫెన్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు బి.చంద్రయ్య, టిఎస్‌ఆర్‌టిసి రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.బాబు, ఐఎన్‌టియుసి జాతీయ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ వై.నాగన్నగౌడ్‌, హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయ్‌భాస్కర్‌, ఎఐబిఇఎ ప్రధాన కార్యదర్శి బి.ఎస్‌.రాంబాబు, పోస్టల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు రామారావు, బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగ సంఘాల నాయకులు రాజమల్లు, మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు వేణు, ఎం.నర్సింహ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల, కార్మిక సమాఖ్య నాయకులు వి.నాగేశ్వర్‌, పబ్లిక్‌ సెక్టార్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు జనార్ధన్‌ రెడ్డితో పాటు వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు, పలు కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు.
నేటి యువతకు పోరాట పటిమను తర్ఫీదునివ్వాలె: చాడ వెంకట్‌రెడ్డి
కేంద్ర, రాష్ట్రంలో నియంతృత్వ వైఖరి, ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల యువత, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వారిని పోరాటంలో భాగస్వామ్యం చేయాలని అదే నరసింహన్‌కు ఘనమైన నివాళి అని అన్నారు. నాటి పోరాట పటిమ పట్ల నేటి యువతకు తర్ఫీదునివ్వాలని సూచించారు. కార్మిక, ప్రజల హక్కులకు కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. నరసింహన్‌ నిర్మోహమాటంగా సూటిగా మాట్లాడే వ్యక్తి అని, అవసరమైతే నిలదీసేవారని, ఆయనకు నటనలు రావని తెలిపారు. ఆయనొక ఉత్తమ కమ్యూనిస్టు అని, ఉద్యమాలకు తోడ్పడిన ఉత్తమ నేత అని కొనియాడారు. కార్మిక ఉద్యమాలకు పోరాట యోధునిగా అభివర్ణించారు. ఆయన తన తుది శ్వాస విడిచే వరకు నిరంతరం పోరాటం చేశారన్నారు.
కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ నరసింహన్‌ కార్మిక లోకానికి ఒక దిక్సూచి వంటి వారన్నారు. ఆయన కోరుకున్న మరణం వచ్చిందని, కానీ కోరకున్న సమాజం రాలేదన్నారు. మానవ, కార్మికుల హక్కులను రోజురోజుకూ కోల్పోతున్నాయని, ప్రభుత్వ రంగ పాత్ర కూడా పరిమితంగానే కాబోతుందని, ఇలాంటి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలన్నారు. చివరకు వ్యవసాయ రంగాన్ని కూడా కేంద్రం వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని రక్షించుకోవాలనే ఒకే ఎజెండాతో అందరూ కలిసికట్టుగా పోరాట బాట పట్టాలని, అందుకు అందరూ ఏకం కావాలని చెప్పారు. అందరి దృష్టిని ఆకర్షించేలా ఉద్యమ కార్యాచరణ ఉండాలన్నారు. ఎస్‌. బాలరాజ్‌ మాట్లాడుతూ నరసింహన్‌ కార్మిక, సోషలిజ సమాజం కావాలని ఆకాంక్షించారన్నారు. ఆయన మరణం ఎఐటియుసికి, కమ్యూనిస్టు పార్టీకి తీరని నష్టమన్నారు. ఉజ్జిని రత్నాకర్‌రావు మాట్లాడుతూ నరసింహన్‌ మూడవ తరగతి ఉద్యోగి అయినప్పటికీ ఆయన నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నేతగా పనిచేశారని, వారి సమస్యల కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు లేకుండా పోతున్నాయని, వీటిని రక్షించుకునేలా మరింత సంఘటితంగా కలిసి పోరాటం చేయాలన్నారు. పి.జె.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ వివిధ హోదాలలో పని చేసిన నరసింహన్‌ నిత్యం కార్మికుల పక్షాన పోరాటం చేశారని గుర్తు చేశారు. చంద్రయ్య మాట్లాడుతూ అనేక కార్మిక అంశాల పట్ల నరసింహన్‌కు అవగాహన ఉండేదన్నారు. విలువలతో కూడిన నరసింహన్‌ మార్గంలోనే తాము నడుస్తామన్నారు. బి.ఎస్‌.రాంబాబు మాట్లాడుతూ కార్మికులు నిర్ణయాత్మక పాత్రను పోషించాలని ఆకాంక్షించే వ్యక్తి నరసింహన్‌ అని అన్నారు. రామారావు మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతాలకు నరసింహన్‌ కుట్టబడిపనిచేశారని గుర్తు చేశారు. ఎస్‌.బాబు మాట్లాడుతూ కార్మిక రంగంలో ఎలాంటి సమస్యకైనా నరసింహన్‌ పరిష్కార మార్గాన్ని చూపేవారన్నారు. నరసింహన్‌ కార్యాచరణలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టనున్నట్టు తెలిపారు. వై.నాగన్నగౌడ్‌ మాట్లాడుతూ నరసింహన్‌ నిత్యం కార్మిక సమస్యల పరిష్కారానికి పరితపించేవారన్నారు. మోడీ ప్రభుత్వ హింసకు, కార్మిక వ్యతిరేక చట్టాలపై పోరాటం చేసేందుకు సమాయత్తం కావాలన్నారు. ఉదయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలను నిర్మించడమే నరసింహన్‌కు ఘనమైన నివాళి అని అన్నారు. కార్మికులు, ఉద్యమాలు, ప్రజలపై దాడులు జరుగుతున్నాయని, అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. వై.నాగేశ్వర్‌ మాట్లాడుతూ కార్మిక ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?