పెరిగితే కాంగ్రెస్ హవా, తగ్గితే హంగ్ ఖమ్మం, రంగారెడ్డి, ఆదిలాబాద్లో కాంగ్రెస్ మెదక్, వరంగల్, నిజామాబాద్లో టిఆర్ఎస్ మహబూబ్నగర్, కరీంనగర్ హోరాహోరీ : లగడపాటి
ప్రజాపక్షం / హైదరాబాద్ : తెలంగాణలో ప్రజానాడి హస్తం వైపు ఉందని మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ తెలిపారు.హైదరాబాద్లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను చేసిన ఎన్నికల మొత్తం సర్వేకు సంబంధించి మొత్తం ఫలితాలను ఈ నెల7న సాయంత్రం పోలింగ్ తరువాత తెలియచేస్తానన్నారు. ఇప్పటికే తెలంగాణలో పది మంది స్వత్రంతులు గెలుస్తారని చెప్పానని, వీరి పేర్లను రోజుకు ఇద్దరి చొప్పున చెబుతానన్నారు. ఇప్పటికే ఇద్దరి పేర్లు చెప్పానని మరో ముగ్గురు పేర్లను ఇప్పుడు చెబుతున్నానన్నారు. వీరిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి స్వతంత్ర అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి(బిఎస్పి) మహబూబ్నగర్ జిల్లా మక్తల్ నుంచి స్వతంత్ర అభ్యర్థి జలంధర్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి జి.వినోద్(బిఎస్పి)లు గెలుస్తున్నారన్నా రు. తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో ప్రజాకూట మి, మూడు జిల్లాల్లో టిఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయన్నారు. రెండు జిల్లాల్లో టిఆర్ఎస్, ప్రజాకూటమిల మధ్య హోరాహోరీగా పోరు ఉం దన్నారు. ఆదిలాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ప్రజాకూటమికి అనుకూల వాతావరణం ఉందన్నారు. కరీంనగర్, మహబూబ్నగర్ నియోజకవర్గాల్లో ప్రజాకూటమి, టిఆర్ఎస్ల మధ్య పోటాపోటీ ఉందని చెప్పారు. నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల్లో టిఆర్ఎస్ ఆధిక్యంలో ఉందని తెలిపారు. హైదరాబాద్లో ఎంఐఎం హవా ఉందని, ఎక్కువ స్థానాలను కైవ సం చేసుకుంటుందని, మిగిలిన స్థానాలను టిఆర్ఎస్, బిజెపి, ప్రజాకూటమి పంచుకుంటాయన్నారు. బిజేపికి ఈ సారి గతంలో కంటే ఎక్కువ స్థానాలు వస్తాయన్నారు. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 100 నియోజకవర్గాల్లో పర్యటించి సర్వే చేపట్టామన్నారు. అక్టోబర్ 28 నుంచి 45రోజుల పాటు ఈ సర్వే నిర్వహించామని చెప్పారు. సర్వేలో 1200 నుంచి 2000 నమూనాలు సేకరించామని తెలిపారు. ప్రజలను అడిగి తెలుసుకుని వారి నాడీ ఆధారంగా సర్వేలు విడుదల చేస్తూ వస్తునానన్నారు. పోలింగ్ శాతం తగ్గితే హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. పెరిగితే ప్రజాకూటమికి అనుకూలంగా ఉందని చెప్పారు. 68.5శాతం పోలింగ్ నమోదయితే పరిస్థితి మరోలా ఉంటుందని తెలిపారు. మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల పేర్లు తన వద్ద ఉన్నాయని, వారు తన స్నేహితులు కావడంతో వారి పేర్లు బహితర్గతం చేయడం లేదని చెప్పారు. ముందస్థు ఎన్నికలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నారు. తన పేరుతో వస్తున్న సర్వేలకు తనకు సంబంధం లేదన్నారు. తాము జి ఫ్లాష్ టీంతో సర్వే చేస్తున్నామన్నారు. నేనే నేరుగా మీడియా ముందుకు వచ్చి చెబితేనే ఆ సర్వే తనదని నమ్మాలన్నారు.