ప్రజల జీవనభృతి, ప్రాణాల రక్షణకుప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం

7న ప్రగతిభవన్‌ వద్ద నల్లజెండాలు, బెలూన్ల ఎగరవేత
కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర వైఫల్యం
ప్రైవేటు ఆసుపత్రులను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకోవాలి
‘రచ్చబండ’ కార్యక్రమంలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, రాజకీయ నాయకులు
ప్రజాపక్షం / హైదరాబాద్‌  ప్రజల బతుకుదెరువు, ప్రాణాల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాల ని వామపక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు నిర్ణయించాయి. కరోనా వైరస్‌ నుంచి ప్రజలను కాపాడి, వారిని ఆదుకునేలా ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మేలుకొలిపేలా ఈనెల 7న హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ వద్ద నల్ల జెండాలను, బెలూన్లను ఎగరవేయాలని, ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశాయి. “కరోనా కోరల్లో ప్రజలు – చేతులేత్తేసిన కేంద్ర, రాష్ట్ర పాలకులు” అనే అంశంపై ‘తెలంగాణ రాష్ట్ర వామపక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల వేదిక’ ఆధ్వర్యంలో ‘రచ్చబండ’ పేరుతో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదిక నుంచి ఆన్‌లైన్‌ బహిరంగ సభను నిర్వహించారు. కరోనా కట్టడి, ప్రజలను ఆదుకునే విషయమై ఇప్పటికే అనేక పద్ధతుల్లో ప్రభుత్వానికి వినతులు, విజ్ఞప్తులు చేశామని, ఇక ప్రజలు కదిలితేనే పాలకుల్లో మార్పులు వస్తాయని, వారి నిద్రమత్తు వదిలి చర్యలకు పూనుకుంటారని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వ ఆధీనంలోనికి తీసుకోవాలని, పేదలందరికీ బతుకుదెరువు, ప్రాణాలను కాపాడుతామని పాలకులు భరోసానివ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ బహిరంగ సభను సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టిజెఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.రమణ, సిపిఐ ఎంఎల్‌ (న్యూడెమోక్రటిక్‌) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.గోవర్దన్‌, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌, సిపిఐ (ఎం.ఎల్‌. న్యూడెమోక్రసీ) నాయకులు సాదినేని వెంకటేశ్వర్‌రావు, ఎస్‌యుసిఐ నాయకులు మురారి, సిపిఐ ఎం.ఎల్‌- న్యూడెమోక్రసీ నాయకులు పోటు రంగారావు, ఆర్‌ఎస్‌పి నాయకులు జానకిరాములు, సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ డి.రాజేశ్‌, ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయకులు బండ సురేందర్‌రెడ్డితో పాటు పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌.బాలమల్లేశ్‌, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.జి.నర్సింహరావు, టిజెఎస్‌ నాయకులు పి. శ్రీశైల్‌రెడ్డి బహిరంగ సభను మాడరేటర్‌గా వ్యవహారించారు.
చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రలో ఉన్నాయన్నారు. ప్రపంచ వ్యాపితంగా కరోనా విజృంభిస్తుండగా చైనా, క్యూబా, వియత్నం ఎలా నియంత్రించాయో చర్చించుకోవాలని, అవగాహన పెంచుకోవాలన్నారు. కేరళ రాష్ట్రం అలా పనిచేస్తున్నందునే వైరస్‌ అదుపు చేయబడిందనే విషయాన్ని పాలకులు అధ్యయనం చేసి, అర్థం చేసుకోవాలన్నారు. కొవిడ్‌ను అదుపు చేయాలనే మోడీ ప్రభుత్వ ఆలోచనలోనే పెద్ద తప్పు జరిగిందన్నారు. సడలింపులతో నిబంధనలు కొనసాగుతున్నాయన్నారు. దేశంలో ఏం జరుగుతుందని, ఎవరు బలయ్యారని, దీనికి ఎవరు మూల్యం చెల్లించాలని ప్రశ్నించారు. కరోనాను మోడీ పట్టించుకనే పరిస్థితి లేదని, 25 రోజులుగా ఇబ్బడి, ముబ్బడిగా కరోనా కేసులు సంఖ్య లక్షల్లో పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరంభంలోనే కట్టడి చేసి, నిమిషం సమీక్షించారని, లక్షల కేసులు నమోదవుతూ ప్రజల ప్రాణాలు పోతుంటే కార్యాచరణ ఎందుకు చేపట్టడంలేదని ప్రశ్నించారు. ఈ నెల 5న రాముని మందిరానికి శంకుస్థాపన చేస్తే అభ్యంతరం లేదని, కరోనా విజృంభిస్తుంటే పట్టింపు ఉండదా అని ప్రశ్నించారు. కొవిడ్‌ను ఏం చేయదల్చుకున్నారని, ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో ప్రజలకు ఏం చెందుతుదని, అంసంఘటిత, విద్య, వైద్యం, వలసకార్మికుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సమానపనికి సమాన జీతం అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా పాలకులు పట్టించుకనే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి నేతలు బాగా చేశామని చెబుతున్నారని, లోలోపల కుమ్మక్కవుతారని, వారి వైఖరి ఏమిటని, తెలంగాణ రాష్ట్రానికి ఎంత మేరక నిధులు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రతి రాష్ట్రానికి రూ. 10 వేల కోట్లు ఇవ్వలేరా అని ప్రశ్నించారు. కరోనాపై సిఎం కెసిఆర్‌ పది రోజులుగా ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదన్నారు. హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని, ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తే రూ.15 వేలు ఇస్తారా? ప్రజల ఆర్థనాథాలు వినిపించవా, ప్రభుత్వానికి కళ్లు, చెవ్వులు లేవా అని చాడ వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ ఆస్పత్రులను నియంత్రణలో పెట్టాలని, వెయ్యి ఫిర్యాదులు వస్తే పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవాలన్నారు. ప్రాణాలు, డబ్బులు పోతున్నాయని, అడ్డగోలుగా బిల్లులు వేసినా స్పందించరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది త్యాగాలు విలువైనవేనని, వారిని అభినందించారు. అధిక ఫీజులు వసూలు చేసే కార్పోరేట్‌ ఆస్పత్రులపై కేసులు పెట్టాలన్నారు. ప్రజల ప్రాణాలు, డబ్బులు పోయిన తర్వాత ఇక ప్రభుత్వాలు, చట్టాలు ఉండి ప్రయోజనం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్యాన్ని మరింత మెరుగుపర్చాలని, ప్రైవేటు ఆస్పత్రులపై నియంత్రణ చేయాలని, చట్టంలో వెసులుబాటు ఉన్నదని గుర్తు చేశారు. ప్రజలు కూడా ప్రభుత్వాన్ని నిలదీసి తమ హక్కులను సాధించుకోవాలని కోరారు.
తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఏ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కూడా ప్రభుత్వం చెప్పిన ఫీజులను అమలుచేయడం లేదని, దీనిని పరిశీలించే ధైర్యం సిఎం, మంత్రులు, ఇతరులైవరికైనా ఉన్నదా అని ప్రశ్నించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను అమలు చేయడం లేదని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, దీనికి అంగీకరిస్తే రేపే ఆసుపత్రులకు వెళ్దామని సవాల్‌ విసిరారు. కొవిడ్‌ నియంత్రణ వరకైనా ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వ నియంత్రణలో తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అక్కడున్న వసతులను వాడుకునే వెసులుబాటు ఉన్నదన్నారు. కెసిఆర్‌ మనసు మారాలంటే ప్రజల ఒత్తిడి కావాలని, ప్రజలను తనను అసహించుకుంటున్నారని, ప్రజలు తిరబగడుతారని, ప్రజలకు విషయాలు తెలుస్తాయనే సోయి సిఎంకు రావాలని, ప్రజల్లో చర్చ జరగాలన్నారు. ఎంఎల్‌ఎలు, ఎంపిలు సిఎం కెసిఆర్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో లేరని, వారి పట్ల జాలి పడాలని, అదే సమయంలో నిరుద్యోగ, ఉపాధి అవకాశాలు ఇలాగే ఉంటే తాము గ్రామాల్లో తిరగలేమని, టిఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు సిఎం కెసిఆర్‌కు మొరపెట్టుకోవాలని, అప్పుడే ప్రభుత్వ వైఖరిలో మార్పు వస్తుందన్నారు. కరోనా పరీక్షలు పెంచాలని, ప్రతి కరోనా కేసుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, దిక్కులేని చావులను ప్రభుత్వ హత్యగా భావించాలన్నారు. మోడీ, కెసిఆర్‌కు అహంకారం రావడానికి మతోన్మాదానికి, తెలంగాణ సెంటిమెంట్‌తో ప్రజలు గెలిపిస్తున్నారు కాబట్టే వారు తాము ఏం చేసినా నడుస్తోదనే భావిస్తున్నారని వక్తలు అన్నారు. ప్రజాస్వామ్యం లేదని, అధికారం, డబ్బులు తప్ప మరోటి లేకుండా పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు.
కెసిఆర్‌ను మేలుకొల్పేందుకు ఈనెల 7న నల్ల జెండాలు, బెలూన్లతో నిరసన :- కోదండరామ్‌
సిఎం కెసిఆర్‌ను మేలుకోల్పేందుకు ఈ నెల 7న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రగతిభవన్‌ వద్ద నల్ల జెండాలను, నల్ల బెలూన్లను ఎగరవేసి ప్రజలు తమ నిరసనను తెలియజేయాలని ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌ విజ్ఞప్తి చేశారు. బతుకును నిలబెట్టుకునేందుకు, ప్రాణాలను కాపాడుకునేందుకు అందరూ ఐక్యంగా ఉండాలని, దీనికి అందరూ కలిసిరావాలని కోరారు. ఎవరికి వారుగా భౌతిక దూరం పాటిస్తూనే నల్ల జెండాలను ఎగరవేద్దామని, మన నినాదాలు అక్కడి వరకు పోవాలన్నారు. రాజ్యాంగ హక్కులను కాపాడుకునేందుకు ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. సిఎంను ప్రజలను, సమస్యను పట్టించుకోరని, ప్రజలందరూ కదిలితేనే సిఎం మేలుకొంటారని, నిర్లిప్తంగా ఉంటే నేరమైతుందని, మౌనంగా ఉండొద్దని పేర్కొన్నారు. నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేసేలా సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డుమీద అడ్డాలన్నీ మాయమయ్యాయని, పేదల బతుకు కష్టమైందని, ఇడ్లీ, పానీపూరి, జ్యూస్‌, ఇలా ఏ బండి నడిచే పరిస్థితి లేదని, ఒకవైపు ప్రాణం, మరో వైపు బతుకు భయంతో ప్రజలు కొట్టుమిట్లాడుతున్నారని తెలిపారు.
టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.రమణ మాట్లాడుతూ రాజకీయ నేపథ్యం, రాజకీయాలే ప్రాధాన్యత, పేదలు అంటే పట్టింపు లేని వ్యక్తి కెసిఆర్‌ అని, తెలంగాణ సాధనలో ముందున్న వ్యక్తిగా అందరూ సహకరించారని గుర్తు చేశారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదని, తన ఇష్టం మొచ్చిన తరహా పాలన చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం బాధ్యతారహితంగా పాలిస్తున్నాయని ఆయన విమర్శించారు. డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌, ప్రజా సమస్యలపై నిజాయితీగా సమీక్ష చేయని దద్దమ్మ సిఎం కెసిఆర్‌ అని, ఆయన ఒక్కసారి కూడా రాజకీయ పార్టీలు, వైద్య నిపుణులతో సమీక్షంచ నిర్వహించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యంగా కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారన్నారు. కరోనా భయాన్ని విడాలని, గుండె ధైర్యం లేకపోతే ముందే చనిపోతామని ఆయన ప్రజలకు సూచించారు. సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు సాదినేని వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ చిన్న పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వలస కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడిపించాయన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?