పోలీసుల దాష్టీకం!

తమిళనాడులో లాకప్‌డెత్‌ కలకలం
పోలీసు రిమాండ్‌లో తండ్రీ తనయుల మృతి
‘ఇండియన్‌ జార్జి ఫ్లాయిడ్‌’లకు నెటిజన్ల మద్దతు
కేసు సిబిఐకి అప్పగిస్తాం : ప్రభుత్వం
చెన్నై: తమిళనాడులో లాకప్‌డెత్‌ కలకలం రేపింది. పోలీసుల రాక్షసత్వంపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో తండ్రీకొడుకుల్ని హింసించి చంపడంపై జనం మండిపడుతున్నారు. బాధితులను ఇండియన్‌ ‘జార్జ్‌ ఫ్లాయిడ్‌’లుగా నెటిజన్లు సోషల్‌మీడియా లో అభివర్ణిస్తున్నారు. తమిళనాడులోని శాంతాకులం ప్రాంతానికి పి.జయరాజ్‌ (62) జూన్‌ 19న తన దుకాణాన్ని లాక్‌డౌన్‌ నిబంధనల ప్రకారం సాయంత్రం 7 గంటలకు మూసివేయకపోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తండ్రి గురించి కనుక్కోవడానికి వెళ్లిన జయరాజ్‌ కొడు కు బెనిక్స్‌నూ అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసి వారి బంధువులు 20న స్టేషన్‌కెళ్లారు. అప్పుడే వారిద్దరి నడుము భాగాల కింద తీవ్రంగా రక్తస్రావం అవుతుండడాన్ని గుర్తించారు. 21న వీరిద్దరూ రిమాండ్‌లోనే కన్నుమూశారు. బాధితుల బంధువులు మాట్లాడుతూ, పోలీస్‌ స్టేషన్‌లో జయరాజ్‌, బెన్నిక్స్‌లపై పోలీసులు విపరీతంగా దాడి చేసి, హింసించడంతో, వారిద్దరూ ఆసుపత్రిలో మరణించారని చెప్పారు. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం స్పందించి, ఇద్దరు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు సహా, నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్‌ చేసింది. 19న రాత్రంతా పోలీసులు వీరిద్దరిని తీవ్రంగా హింసించారని ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు చెప్పా రు. వారి ప్రైవేటు భాగాల్లోకి లాఠీలు దూర్చారని తెలిపారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకొని విచారించనున్నట్లు తమిళనాడు హైకోర్టు ప్రకటించింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పి.జయరాజ్‌, బెనిక్స్‌లను పోలీసులు జైలు కస్టడీలో హింసించి చంపిన ఘటనను నటుడు, రాజకీయ నేత కమల్‌హాసన్‌ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై కమల్‌ హాసన్‌ స్పందిస్తూ.. మృతి చెందిన తండ్రీకొడుకుల ఘటనలో సిఎం పళనిస్వామి ప్రధాన నిందితుడుని ఆరోపించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తిగా బాద్యత వహించాలన్నారు. తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి పోలీసుల చర్యకు మద్దతు పలకుతున్నారని దుయ్యబట్టారు. ఈ నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారని.. ఇది సరైన పద్దతి కాదని దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.
కేసు సిబిఐకి అప్పగింత పోలీస్‌ స్టేషన్‌లో కస్టడీలో ఉన్న తండ్రీకొడుకులు ఆసుపత్రిలో మరణించిన కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి అప్పగిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి కె పళనిస్వామి చెప్పారు. పళనిస్వామి ఆదివారం మాట్లాడుతూ, పి జయరాజ్‌, జే బెన్నిక్స్‌ పోలీసు కస్టడీలో మరణించినట్లు ఆరోపణలు వస్తుండటంతో, ఈ కేసును సిబిఐకి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. మద్రాస్‌ హైకోర్టును సంప్రదించి, సమ్మతి తీసుకుని, ఈ కేసును సిబిఐకి బదిలీ చేస్తామని చెప్పారు. తండ్రీకొడుకులు జయరాజ్‌, బెన్నిక్స్‌లను అష్ట దిగ్బంధనం నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని చెప్పారు. ఆ మర్నాడు వారిని రిమాండ్‌లో ఉంచారన్నారు. ఆ తర్వాత వారు మరణించారన్నారు. దీనిపై మద్రాస్‌ హైకోర్టు స్వీయ విచారణ జరుపుతోందని తెలిపారు. అష్ట దిగ్బంధనం నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ జయరాజ్‌ను పోలీసులు సతంకుళం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్ళారు. ఆ విషయం తెలుసుకున్న ఆయన కుమారుడు బెన్నిక్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళారు. వీరిద్దరినీ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ పి శరవణన్‌ జూన్‌ 20న పోలీస్‌ కస్టడీకి ఆదేశించారు.

DO YOU LIKE THIS ARTICLE?