పీడిత, తాడిత అణగారిన వర్గాలకు గద్దర్ ఆటా పాటా భరోసా
స్మారక స్పూర్తి సదస్సులో వక్తలు
ప్రజాపక్షం/భద్రాద్రి కొత్తగూడెం బతికున్నంత కాలం తన పాట, ఆటను ఆయుధంగా మలిచి సమాజంలో పీడిత, తాడిత, అణగారిన వర్గాలకు అందించి పోరాడే తత్వాన్ని నేర్పించిన గద్దర్ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వక్తలు అన్నారు. గద్దర్ అమరత్వం, జహీర్ లౌకికత్వంపై ప్రజా సంఘాల ఐఖ్యవేదిక అధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన స్మారక స్పూర్తి సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తోపాటు టిజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్, సిపిఎం రాష్ట్ర నాయకులు రాములు, ప్రొఫెసర్ ఖాసీం, సీనియర్ జర్నలిస్టు తెలంగాణ విఠల్, న్యూడెమెక్రసీ నాయకులు సాధినేని వెంకటేశ్వరరావు, ఆవులూరి మధు, కాంగ్రెస్ నాయకులు పోట్ల నాగేశ్వరరావు, భారతీయ దళిత సేన చైర్మన్ జేబి రాజు, బిఎస్‌పి రాష్ట్రప్రథాన కార్యదర్శి యెర్రా కామేష్, ఎన్‌డి రాష్ట్ర నాయకులు ముద్దా బిక్షం, ప్రజాగాయకుడు జయరాజ్, గద్దర్ కుమార్తె వెన్నెల హాజరై ప్రసంగించారు. ప్రజాస్వామ్య విలువల ప్రతిష్టాపన లక్ష్యంగా తన తుదిశ్వాస వరకు జహీర్ అలీఖాన్ అమరుడని, గద్దర్, జహీర్‌ఖాన్ మరణం తెలంగాణలోని ప్రతీ ఒక్కరిని కలిచివేసిందని అన్నారు. గద్దర్ పేద ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకై ముందునడిచారని, నాటి నైజాం పోరాటం నుంచి తెలంగాణ పోరాటం వరకు దొరలగడీల పాలన పోవాలని, ప్రజల మాటలనే పాటలుగా అల్లి చైతన్యం చేశారని చెప్పారు. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నేనున్నా అంటూ ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాడని అన్నారు. జన చైతన్యం కోసం తాను నమ్మిన సిద్దాంతం కోసం తుదిశ్వాస వరకు పోరాటం చేసిన ప్రజా యుద్దనౌక గద్దరని అన్నారు. గొంగలి, గజ్జలు, ఎర్ర తువ్వాలు, చేతికర్రతో కనిపించే గద్దర్ సాంస్కృతిక విప్లవానికి ఐకాన్‌గా నిలిచాడని చెప్పారు. ఏ మతమైనా ప్రజా స్వామ్య రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధుంగా ప్రవర్తించరాదని, రాజ్యాంగ స్పూర్తితో లౌకికవాదాన్ని కొనసాగించాలని కోరుకున్న సియాసత్ ఉర్ధూ పత్రిక
మేనేజింగ్ ఎడిటర్, విద్యావేత్త జహీర్‌అలీఖాన్ మరణం బాధాకరమని చెప్పారు. గద్దర్ అంతిమయాత్రలో పాల్గొంటూ ప్రాణాలోదలడం వారి మధ్య ఉన్న అనుబంధాన్ని స్పష్టం చేసిందన్నారు. మతాన్ని, రాజకీయాలకు అంటగట్టి లబ్దిపొందే హిందూ, ముస్లీం మతోన్మోదాన్ని వ్యతిరేకించిన లౌకిక, ప్రజాస్వామ్య వాది జహీర్ అలీఖాన్ అని వారు అన్నారు. ఈ సందర్భంగా ఎస్‌పాల్, బల్లెపల్లి మోహన్, మిట్టపల్లి సురేంధర్ బృంధాలు గద్దర్, జహీర్‌కు సాంస్కృతిక నివాళులు అర్పించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె సాబీర్ పాషా, నిర్వహణ కమిటీ కన్వీనర్ జెబి శౌరి, సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అధ్యక్షతన జరిగిన సదస్సుల్లో కార్మిక సంఘాలనాయకులు గొల్లపల్లి దయానంద్, ప్రజా సంఘాల ఐఖ్యవేదిక నాయకులు కూసపాటి శ్రీనివాస్, బందెల నర్సయ్య, డాక్టర్ రమేష్ బాబు, మారపాక రమేష్, ఎస్సి,ఎస్టి నాయకులు కాలవ దేవదాసు,టివిపిఎస్ నాయకులు గండపునేని సతీష్, జర్నలిస్టు సంఘాల నాయకులు కల్లోజి శ్రీనివాసరావు, ఇమంది ఉదయ్‌కుమార్,సుగుణారావు, సలిగంటి శ్రీనివాస్, రత్నకుమారి, మైనార్జీ మహిళనాయకురాలు ఫర్వీన్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
పోరు తెలంగాణకుఆ గొంతుకే ఆయుధం
RELATED ARTICLES