పొంచిఉన్న నకిలీవిత్తు!

నకిలీ ఎరువులు, విత్తనాలపై పోలీసుల డేగ కన్ను
నిందితులపై పిడి యాక్ట్‌కు రంగం సిద్ధం

ప్రజాపక్షం/హైదరాబాద్‌: ఖరీఫ్‌ సీజన్‌ రానేవచ్చింది. రైతులందరు దుక్కి దున్ని విత్తనాలు, ఎరువులు చల్లడానికి సిద్ధమవుతున్నారు. మార్కెట్‌కు వైపు పరుగులు పెడుతున్నారు. ఇదే అదనుగా రైతులను దోచుకునేందుకు నకిలీ వ్యాపారులు కూడా మార్కెట్‌లోకి జోరుగా విత్తనాలు, ఎరువులను సరఫరా చేసి రెండు చేతులా సంపాదించాలని తహతహలాడుతున్నారు. దీన్ని పసిగట్టిన పోలీసులు నకిలీ విత్తనాలపై డేగ కన్ను పెట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా, పట్టణ కేంద్రాలతో పాటు మండల కేంద్రాలలో విత్తనాలు విక్రయించే దుకాణాలపై సోదాలు మొదలు పెట్టారు. రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్య త పోలీసులపై ఉందని, మార్కెట్‌లోకి నకిలీ విత్తనాలు రాకుండా అరికట్టాలని డిజిపి ఎం. మహేందర్‌రెడ్డి అన్ని జిల్లాల పోలీసు అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లాల పోలీసులు విత్తనాలు సరఫరా చేసే ఆయా సంస్థ లు, గోదాములు, దుకాణాలపై శనివారం సోదాలు నిర్వహించారు. గతంలో నకిలీ విత్తనాలు సరఫరా చేసి పోలీసులకు పట్టుబడిన నిందితులపై కూడా నిఘా పెట్టారు. గతంలో పట్టుబడి జైలు నుంచి విడుదలైన వీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు, తిరిగి అదే వృత్తి కొనసాగిస్తున్నారా అనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. గతంలో నకిలీ విత్తనాలు సరఫరా చేసిన వారికి పోలీసులు హెచ్చరికలు కూడా చేస్తున్నారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తూ పట్టుబడితే ఇక నుంచి వారిపై పిడియాక్ట్‌ కేసులు పెడతామంటున్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయాలకు పాల్పడే విక్రయదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు చెబుతున్నారు. సీడ్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ షాప్‌ యజమానులు నిబంధనలకు లోబడి వ్యాపారాలు చేసుకోవాలని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతుల కు అందించాలని పోలీసులు సూచిస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?