సజీవ దహనం
అక్రమ తయారీ..నిల్వ ఫలితం
బీహార్ సరన్ జిల్లాలో ఘటన
పాట్నా: బీహార్‌లోని సరన్ జిల్లాలో చోటు చేసుకున్న భారీ పేలుళ్లలో ఆరుగును సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని ఆసుపత్రిలో చేర్చారు. పేలుళ్ల ధాటికి భవనం కూలిపోవడంతో, శిథిలాలను తొలగిస్తున్నారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. స్థానికుల కథనాన్ని అనుసరించి, చాప్రా నగరానికి సమీపంలోని కొడైబాగ్ గ్రామంలోని ఓ ఇంట్లో ఆదివారం ఉదయం పది గంటల నుంచి సుమారుగా మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఆరు పర్యాయాలు పేలుడు సంభవించింది. షాబిర్ హుస్సేన్ అనే వ్యక్తికి చెందిన ఆ భవనంలో అక్రమంగా బాణాసంచా తయారు చేయడమేగాక, భారీగా నిల్వలు కూడా ఉంచారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి, బాణా సంచా పేలడంతో అందులో పని చేస్తున్న వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే, కొంత మంది ప్రమాద స్థలిలోనే చిక్కుకుపోయిన ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుకు దారితీరిన కారణాలపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. మూడు అంతస్థుల భవనం పూర్తిగా కుప్పకూలిందని, ఈ దాటికి చుట్టుపక్కన ఉన్న ఇళ్లు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయని తెలిపారు. స్థానికులు ఆరు పేలుళ్లు సంభవించినట్టు చెప్తుండగా, మూడు పేలుళ్లను పోలీసులు ధ్రువీకరించారు. బాణాసంచా అంటుకోవడంతో, భవనంలో ఉన్న గ్యాస్ సిలిండర్లు కూడా పేలాయని చెప్పారు. బాణాసంచా తయారు చేయడానికిగానీ, నిలువ చేయడానికిగానీ సదరు భవన యజమాని వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేవని తెలిపారు. అతను అక్రమ వ్యాపారం చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నామని, వివరాలు త్వరలోనే తెలుస్తాయని పేర్కొన్నారు.
పేలిన బాణాసంచా ఆరుగురు
RELATED ARTICLES