పేదలు, ఎస్‌సి, ఎస్‌టిలు, మైనారిటీలే లక్ష్యంగా రాజ్యాంగ వ్యతిరేక పథకం

భారత లౌకిక, ప్రజాతంత్ర వ్యవస్థకు పొంచి ఉన్న ముప్పు
పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
ఎన్‌పిఆర్‌ ప్రక్రియను తక్షణమే ఆపాలి
ప్రతిపక్షాల సమావేశం ఏకగ్రీవ తీర్మానం

న్యూఢిల్లీ: మోడీ సర్కారు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిపక్షాలు మరోసారి ఎండగట్టాయి. ప్రమాదకరమైన సిఎఎ, ఎన్‌పిఎ, ఎన్‌సిఆర్‌లపై విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) తక్షణమే ఉపసంహరించాలని, జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పిఆర్‌) ప్రక్రియను వెంటనే ఆపేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. సిఎఎ, ఎన్‌పిఎలు రాజ్యాంగ విరుద్ధమైనవని పేర్కొన్నాయి. అవి ప్రధానంగా ఎస్‌సి/ఎస్‌టి, మతపరంగా, ప్రాంతీయపరంగా, భాషాపరమైన మైనారిటీలు, పేదలను లక్ష్యం చేసుకోనున్నాయని తెలిపాయి. ఈ సమావేశానికి 20 పార్టీలకు చెందిన ప్రతిపక్ష నాయకులు హాజరయ్యాయి. “సిఎఎ, ఎన్‌పిఆర్‌, ఎన్‌ఆర్‌సి రాజ్యాంగవిరుద్ధమైనవి. అవి ప్రధానంగా పేదలను లక్ష్యం చేసుకుంటాయి’ అన్న తీర్మానాన్ని ప్రతిపక్షాలు ఆమోదించాయి. ‘ఎన్‌ఆర్‌సికి ఎన్‌పిఆర్‌ ఆధారం కానుంది. సిఎఎను ఉపసంహరించాలని, దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సి/ఎన్‌పిఆర్‌లను వెంటనే ఆపేయాలని మేము డిమాండ్‌ చేస్తున్నాం’ అని కూడా పేర్కొన్నాయి. తమ రాష్ట్రాల్లో ఎన్‌ఆర్‌సిని అమలుచేయబోమని చెప్పిన ముఖ్యమంత్రులు జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పిఆర్‌)ను కూడా రద్దు చేసే విషయమై పరిశీలించాలని, బిజెపియేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఈ తరహా చర్యలు చేపట్టాలని పేర్కొన్నాయి. జనాభా లెక్క ఎన్‌ఆర్‌సికి ముందస్తు చర్య కాగలదని కూడా ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ఈ సమావేశానికి వివిధ ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. వారిలో డి.రాజా(సిపిఐ ప్రధాన కార్యదర్శి), శరద్‌ పవార్‌(ఎన్‌సిపి), సీతారామ్‌ ఏచూరి (సిపిఐ(ఎం), హేమంత్‌ సొరేన్‌ (జెఎంఎం, జార్ఖండ్‌ సిఎం), శరద్‌ యాదవ్‌(ఎల్‌జెడి), ఉపేంద్ర కుశ్వాహ (రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ), మనోజ్‌ ఝా(ఆర్‌జెడి), హస్నయిన్‌ మసూదీ(నేషనల్‌ కాన్ఫరెన్స్‌), కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ, గులాం నబీ ఆజాద్‌, అహ్మద్‌ పటేల్‌, మాజీ ప్రధాని డా. మన్మోహన్‌సింగ్‌ తదితరులు హాజరయ్యారు. కాగా బహుజన్‌ సమాజ్‌ పార్టీ చీఫ్‌ మయావతి, తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమతా బెనర్జీ, ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్‌ కేజ్రీవాల్‌ ఈ సమావేశానికి హాజరుకాలేదు.

DO YOU LIKE THIS ARTICLE?