‘స్పీకప్ తెలంగాణ’లో కాంగ్రెస్ డిమాండ్
ప్రజాపక్షం/హైదరాబాద్
కరోనా కట్టడిలో సిఎం కెసిఆర్ మొదటినుంచి అనాలోచితంగానే మాట్లాడుతున్నారని టిపిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పేదలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్సను అందించాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్‌ను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ‘స్పీకప్ తెలంగాణ’ కార్య క్రమంలో భాగంగా శనివారం ఆయన ‘ఫేస్‌బుక్’ లైవ్‌లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు తాజా పరిస్థితులు, ప్రభుత్వ వైఖరి తదితర అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు లేవని, ప్రైవేటు ఆసుపత్రుల్లో విపరీతంగా డబ్బులను వసూలు చేస్తూ రోగులను పీడిస్తున్నారని, ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రభుత్వానికి నియంత్రణ లేదని పలువురు నాయకులు తెలిపారు. ఆక్సిజన్ కొరత వల్ల అనేకమంది చనిపోయారని, సెల్ఫీలు తీసి వారు తమ బాధను, ఇబ్బందులను తెలియజేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని నేతలు దుయ్యబట్టారు. తమ తమ జిల్లాలో జరిగిన పలు పరిణామాలను వారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ‘స్పీకప్ తెలంగాణ’కు మంచి స్పం దన లభించిందన్నారు. కరోనా టెస్టులు చాలా తక్కువ చేస్తూ తక్కువ కేసులు చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పక్క రాష్ట్రం ఎపిలో 15 లక్షలు, ఢిల్లీలో 16 లక్షల వరకు కరోనా పరీక్షలను నిర్వహించారని, మన రాష్ట్రంలో కొవిడ్ పరీక్షలు అనేక రెట్లు పెంచాలన్నారు. వైరస్ సోకి మరణించిన పేద కుటుంబాలను ఆదుకోవాలని, వారికి రూ. 10 లక్షల నష్టపరిహారాన్ని అందించాలన్నారు. కరోనా నివారణ కోసం ముందుండి పని చేస్తున్న వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బంది, ఆశావర్కర్లు, పోలీసులు, జర్నలిస్టులకు ప్రాణహాని జరిగితే రూ.50 లక్షల నష్ట పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ విషయంలో సిఎం కెసిఆర్ అసెంబ్లీలో అనాలోచితంగా మాట్లాడారని, 22 డిగ్రీల ఉష్ణోగ్రతలో వైరస్ చనిపోతుందని, పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే చాలని, మాస్కులు కూడా అవసరం లేదని కెసిఆర్ చెప్పిన మాటలను ఉత్తమ్ గుర్తుచేశారు. ప్రైవేటు ఆసుపత్రులు తమకు ఇష్టమొచ్చినట్టు డబ్బులు వసూలు చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉన్నదన్నారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. మార్చి నెలలో కరోనా ఉధృతి మొదలైతే జూలై వరకు ఆసుపత్రుల్లో ఎందుకు వసతులను కల్పించలేదని ప్రశ్నించారు.
పేదలకు ఉచిత చికిత్స
RELATED ARTICLES