90 శాతానికి చేరిన రుణగ్రస్థ జీవనం
వాషింగ్టన్: కోవిడ్ 19 కారణంగా ప్రభుత్వ వ్యయం పెరగడంతో భారత ప్రజల రుణభారం దాదాపు 90 శాతానికి చేరుకుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ వెల్లడించింది. 1991 నుంచి ఇది 70 శాతానికి అటూ ఇటూగా ఉండేది. ఈ ఏడాది మాత్రం కోవిడ్ కారణంగా ప్రభుత్వ వ్యయం పెరగడం, పన్నుల ఆదాయం, ఆర్థిక కార్యకలాపాల్లో క్షీణత వల్ల 17 శాతం పెరుగుదల చూసిందని ఐఎంఎఫ్ విత్త వ్యవహారాల విభాగం సంచాలకులు విటార్ గాస్పర్ పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలు మొదలైన 1991 నుంచి భారత్ ప్రపంచంలో వృద్ధికి ముఖ్య వనరుగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. 1991 2019 మధ్యకాలంలో వాస్తవ స్థూల దేశీయ ఉత్పత్తి (రియల్ జిడిపి) సగటున 6.5% ఉంది. అదే సమయంలో వాస్తవ తలసరి జిడిపి మాత్రం నాలుగు రెట్లయ్యింది. ఇది లక్షలాది ప్రజలు తీవ్ర పేదరికంలోంచి బయటపడేలా చేసిందని ఆయన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. కొనుగోలు శక్తి ఆధారంగా రోజుకు 1.90 అమెరికా డాలర్ల కంటే తక్కువగా ఉన్నవారిని పేదలుగా పరిగణిస్తారు. భారత్‌లో ఈ సంఖ్య 1993లో 45% ఉండగా, అది 2015 నాటికి 13%కి చేరుకుందని గాస్పర్ అన్నారు. అలా భారత్ 2015 నాటికి పేదరికాన్ని 1990ల నాటికంటే సగానికి తగ్గించుకుని ‘సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యా’న్ని చేరుకుందన్నారు ఆయన. ఇలానే పాఠశాల ప్రవేశాల్లో ప్రాథమిక విద్య దాదాపుగా అందరికీ అందుబాటులోకి రావడం, 2000 సంవత్సరంతో పోలిస్తే శిశు మరణాల రేటు సగానికి పడిపోవడం, తాగునీరు, పరిశుభ్రత, విద్యుత్, రోడ్లు కూడా చాలా మెరుగు పడ్డాయని ఆయన పేర్కొన్నారు. అయితే పేదలు, బలహీనులకు అండగా ఉండేందుకు అదనపు ఆర్థిక చర్యలు అవసరమని గాస్పర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆరోగ్యం, విద్య, పేదరికం, పోషణ మీద కోవిడ్ ప్రభావం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు కారణం అవుతుందని ఆయన అన్నారు. కోవిడ్ సంక్షోభాన్ని నియంత్రించేందుకు ఒక్కొక్క దేశం ఒక్కో రకంగా స్పందించాయని ఆయన చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు విత్త విధానాలు అవస్థాపన నుంచి కుటుంబాలకు అండగా నిలవడం, గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్ వైపు మళ్లాలని ఆయన సూచించారు.
పెరిగిన రుణభారం
RELATED ARTICLES