మోడీ సర్కార్‌కు వామపక్ష నేతల హెచ్చరిక
సికింద్రాబాద్‌లోని హిందుస్థాన్ పెట్రోలియం ఆఫీస్ ఎదుట ధర్నా
ప్రజాపక్షం/హైదరాబాద్ పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వామపక్ష పార్టీల నేతలు మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్పొరేట్ సంస్థలకు రాయితీలనిస్తూ, పేదలపై పన్నుల భారం మోపుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై జరిగే ఉద్యమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్య ఉద్యమాలతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగొస్తాయని, అప్పుడే ధరలను, పన్నులను తగ్గిస్తారని తెలిపా రు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల జాతీయ స్థాయి పిలుపులో భాగంగా సికింద్రాబాద్‌లోని హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ కార్యాలయం ఎదురుగా వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు. పెంచిన ధరలను తగ్గించకపోతే మోడీ వెంటనే గద్దె దిగాలని, పన్నులను తగ్గించాలని ప్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో వామపక్ష నేతలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్‌పాషా, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఇ.టి.నర్సింహ, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జి.నర్సింహరావు, నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రావు, సిసిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసి రాష్ట్ర నాయకులు జె.వి.చలపతి, ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్, ఎస్‌యుసిఐ(సి) రాష్ట్ర నాయకులు మురహరి, లిబరేషన్ రాష్ట్ర నాయకులు రాజేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని, లేదంటే మోడీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్యనాయక్, బిసి హక్కుల సాధన సమితి ప్రధాన కార్యదర్శి పాండురంగచారి, ఎఐఎస్‌ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు స్టాలిన్, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలీ ఉల్లా ఖాద్రీ, సిపిఐ నాయకులు కొణతం యాదగిరి, ఉమర్‌ఖాన్, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర నాయకులు శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు.
పన్నుల పేరుతో పేదల రక్తం పీల్చుతున్న కేంద్రం : చాడ
పేదల రక్తం తాగుతున్న మోడీ ప్రభుత్వ విధానాలు పోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలపై కనీస కనికరం లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులపై పన్నులు మోపుతున్నాయని విమర్శించారు. పేదలను, సామన్యులను ఆర్థికంగా దెబ్బతీసి వారు ఎప్పటికీ పేదలుగానే ఉండేలా మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు రాయితీలను ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు పన్నుపోటు, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు రాయితీల పోటా అని ప్రశ్నించారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెంచుతున్నారని నిలదీశారు. పార్లమెంట్ అంటేనే మోడీ మోసం, మోడీ దగాగా మారిందని ధ్వజమెత్తారు. పెట్రోల్ అసలు ధర 30 శాతం ఉంటే, పన్నులు 70 శాతం వేస్తున్నారని, అసలు ధరలకంటే పన్నుల ధర రెట్టింపుగా ఉన్నదని, ఇది దుర్మార్గమని అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అయితున్నప్పటికీ మోడీ ప్రభుత్వం ఇంకా గత కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందంటూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వం చేస్తే ప్రస్తుత మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందని, మోడీ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ప్రజలు గద్దె దింపుతారని ఆయన హెచ్చరించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడుతూ తిరోగమనం వైపు వెళ్తోందన్నారు. తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ అన్ని వస్తువులను జిఎస్‌టి పరిధిలోకి తీసుకొచ్చిన మోడీ ప్రభుత్వం… పెట్రోల్,డీజిల్‌ను ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. మోడీ, కెసిఆర్ పన్నులు పెంచితే ఆ భారం సామాన్యులపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సారా, పెట్రోల్,డీజిల్ ధరలపైనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బతుకుతున్నాయన్నారు. ఎన్నికలు రాగానే సిఎం కెసిఆర్ ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలిస్తారని, తద్వారా ఓట్లు దండుకుంటున్నారని విమర్శించారు. దక్షిణ తెలంగాణ జిల్లాలపై సిఎం కెసిఆర్ వివక్షత చూపుతున్నారని ఆరోపించారు. జెవి.చలపతి, మురహరి, తాండ్ర కుమార్,రాజేష్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామిక హక్కులు రద్దయ్యాయన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని విమర్శించారు.
పెట్రో ధరలు తగ్గించకుంటే ఉద్యమం ఉధృతం
RELATED ARTICLES