గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న రైతులు
పెట్టుబడి ఆధారంగా మద్దతు ధర నిర్ణయించాలి
రైతు చేజారిన తర్వాత పెరుగుతున్న ధరలు
ప్రజాపక్షం/ఖమ్మం : రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పేరిట ప్రతి ఎకరాకు రూ.10వేల పెట్టుబడి సహాయాన్ని అం దిస్తుంది. దీనికి సంబంధించి సాగు భూమి సాగుకు లాకి కానీ భూమి అనే తేడా లేకుండా పట్టాదారు పాసుపుస్తకం కలిగిన ప్రతి రైతుకు సీజన్‌కు రూ.5వేల చొప్పున రూ.10వేలు అందిస్తున్నారు. దీనిలో రియల్ ఎస్టేట్‌గా మలచిన భూములు పెద్ద భూ కమతాలకు కూ డా పెట్టుబడులు అందిస్తున్నారన్న విమర్శలు మినహాయిస్తే రైతుబంధు పథకం రైతుకు ఊరటనిస్తుంది అనడంలో సందేహాం లేదు. మారి న పరిస్థితులు వ్యవసాయ రంగంలో పెరిగిన యాంత్రీకరణ మొదలైన వాటిని దృష్టిలో ఉంచుకుంటే రూ.5వేల పెట్టుబడి సహాయం ఏ మూలకు సరిపోదన్నది వాస్తవం. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడం ఆది నుంచి అంతం వరకు యంత్రాలనే ఉపయోగిస్తుండడంతో పెట్టుబడి భారమైంది. క్రిమి సంహారక మందులు, రసాయనిక ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఐదేండ్ల కాలం లో రసాయనిక ఎరువుల ధరలు మూడు నుంచి ఐదు రేట్లు పెరిగాయి. దీనికి సంబంధించి నియంత్రణ అనేది కొరవడింది. రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు తయారు చేస్తున్న కర్మాగారాలు పాలక వర్గాలను మెప్పించి, ఒప్పించి ప్రతిఏటా ధరలను పెంచుకుంటున్నాయి. కూలీ ధరలు కూడా బాగానే పెరిగాయి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కూలీ రేట్లను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది మొత్తంగా రైతుపై భారం పడుతుంది. అననుకూల వాతావరణ పరిస్థితుల నడుమ వ్యవసాయ దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. అతివృష్టి, అనావృష్టి, కల్తీ విత్తనాలు, తెగుళ్లు, ఇతర కారణాలు దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. గతేడాది మిర్చిని బొబ్బరోగం ఇబ్బందిపెడితే పత్తిపై గులాబీ, మొక్కజొన్నపై కత్తెర పురుగులు తీవ్ర ఇబ్బందులు పెట్టాయి. ఇందు కోసం ప్రతి రైతు వేలాది రూపాయల క్రిమిసంహారక మందులను పిచికారి చేయాల్సి వచ్చింది. అయినా ఫలితం ఆశించినంతగా లేదు. వరి రైతును సైతం రోగాలు ఇబ్బందులు పెట్టాయి. మొత్తంగా దిగుబడి తగ్గడంతో పెట్టుబడులు రాని పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో గిట్టుబాటు కాని ధర రైతును మరింత కుంగదీసింది. మొత్తం వ్యవసాయ రంగాన్నే సంక్షోభంలోకి నెట్టివేసింది. పెట్టుబడి ఆధారంగా ప్రభుత్వ మద్దతు ధర నిర్ణయించాలన్న డిమాండ్ దశాబ్దాలుగా అది డిమాండ్‌గానే మిగిలిపోయింది. రైతు చేజారగానే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగిపోతున్నాయి. ఇది ఏ ఒక్క వ్యవసాయ ఉత్పత్తికో పరిమితం కాలేదు. పత్తి, మిర్చి, మొక్కజొన్న, ధాన్యం ప్రధానమైన ఈ నాలుగు పంటలకు సంబంధించి రైతు చేజారగానే మిర్చి, పత్తికి సంబంధించి క్వింటాకు ఒక్కసారిగా రూ.1000 నుంచి రూ.2వేల పెరుగుదల కన్పిస్తుంది. ధాన్యం రూ.500ల వరకు పెరగగా మొక్కజొన్నది అదే పరిస్థితి. రైతు వద్ద ఉన్నప్పుడే ఈ ధర లభించి ఉంటే రైతుకు కొంత మేర ఆర్థిక వెసులుబాటు లభించేది. గిట్టుబాటు ధర లభించకుండా ఎంత ఆర్థిక సహాయం అందించినా రైతుకు నష్టం తప్ప లాభం జరిగే పరిస్థితి ఉండదు. పెట్టుబడి ఆధారంగా గిట్టుబాటు ధర కల్పించినప్పుడే రైతుకు వ్యవసాయం లాభసాటిగా కన్పిస్తుంది. ప్రతి యేటా కష్టాలు, నష్టాలనే మిగుల్చుకుంటున్న రైతుకు గిట్టుబాటు ధర లేకపోతే మళ్లీ అవే కష్టాలు, నష్టాలు తప్పవు. సాగుకు ముందే మద్దతు ధరలను ప్రకటించడంతో పాటు ఆ ప్రకటించే మద్దతు ధర పెట్టుబడి ఆధారంగా ప్రకటించాలన్న రైతు డిమాండ్‌ను ప్రస్తుత పాలకులు పరిగణలోకి తీసుకోవాలి. ప్రతి వ్యవసాయ ఉత్పత్తికి అదే రీతిన మద్దతు ధర ప్రకటించాలి. రైతుకు గిట్టుబాటుతో కూడిన మద్దతు ధర ప్రకటించకుండా రైతుబంధు పేరిట, మరో పేరిట సహాయం అందిస్తే అది తాత్కాలిక ఉపశమనం తప్ప రైతాంగాన్ని పూర్తిగా ఆదుకునే దిశగా పనిచేయలేదన్నది వాస్తవం. ఈ వాస్తవాన్ని గుర్తెరిగి పాలకులు మద్దతు ధరలపై నిర్ణయం చేయాలని రైతాంగం కోరుతుంది.