HomeNewsBreaking Newsపెగాసస్‌పై చర్చ జరిగేనా?

పెగాసస్‌పై చర్చ జరిగేనా?

ప్రతిపక్షాల డిమాండ్లపై సర్కారు స్పందిస్తుందా?
పార్లమెంటు వర్షాకాల సమావేశాల ఐదో రోజు సెషన్‌లో ప్రొసీడింగ్స్‌ అనుమానామే..
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్న పెగాసస్‌పై చర్చకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా? అన్న ది అనుమానంగానే ఉంది. పెగాసస్‌ స్పైవేర్‌తో రాజకీయ నాయకుల నుంచి న్యాయమూర్తుల వరకూ, వ్యాపారవేత్తల నుంచి జర్నలిస్టుల వరకూ పలువురు ప్రముఖులపై నిఘా వేసినట్టు వచ్చిన ఆరోపణలపై చర్చకు ప్రతిపక్ష పార్టీలు చేస్తు న్న డిమాండ్‌లపై సర్కారు ఇంకా స్పందించడం లేదు. ఈ అం శంపై ప్రతిపక్షపార్టీలన్నీ ఒకే తాటిపై ఉన్నాయి. ఈ ఉదంతాన్ని ‘భారత వాటర్‌గేట్‌’గా పేర్కొంటున్నాయి. అమెరికాలో రిచర్డ్‌ నిక్సన్‌ ప్రభుత్వం 1972 మధ్యకాలంలో రాజకీయ ప్రత్యర్థుల ఫోన్‌ సంభాషణలను తెలుసుకోవడానికి గుప్త సాధనాలను వినియోగించారు. ఆ విషయం బహిర్గతం కావడంతో, 1974 ఆగస్టు 8న నిక్సన్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. వాటర్‌ గేట్‌ ఉదంతంగా అప్పట్లో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన కుంభకోణాన్ని ఇప్పుడు పెగాసస్‌ నిఘా, ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు గుర్తుచేస్తున్నాయి. కాగా, ఈ స్పైవేర్‌ను రక్షణ, దేశ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు మాత్రమే వాడాల్సి ఉండగా, రాజకీయ ప్రయోజనాలను కోసం ప్రముఖులపైన కూడా కేంద్రం ఉపయోగిస్తున్నదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కనీసం 300 మంది ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని అంతర్జాతీయ మీడియాలో వార్తాకథనాలు వెలువడడం ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఎవరి ఫోన్లూ ట్యాప్‌ కాలేదని కేంద్రం పదేపదే చెప్తున్నప్పటికీ, వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లేలా పెగాసస్‌ వ్యవహరిస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి. ఒకవేళ నిజంగానే ఫోన్‌ ట్యాపింగ్‌కు ఆదేశించకపోతే, పెగాసస్‌ సంస్థ ప్రతినిధుల నుంచి వివరణను మోడీ సర్కారు ఎందుకు తీసుకోవడం లేదన్నది సమాధానం లేని ప్రశ్న. పార్లమెంటు వర్షాకాల సమావేశలు ఈనెల 19న ప్రారంభంకాగా, మొదటి రెండు రోజుల సెషన్స్‌లో ఎలాంటి కార్యక్రమాలను చేపట్టలేదు. బుధవారం బక్రీద్‌ సందర్భంగా సెలవుకాగా, గురు, శుక్ర వారాల్లోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీల సభ్యుల నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ఐటి మంత్రి వైష్ణవ్‌ చేతిలో కాగితాలను లాక్కొని, చింపి గాల్లోకి విసిరిన కారణంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) సభ్యుడు శాంతను సేన్‌పై ఈ సెషన్స్‌ ముగిసే వరకూ సస్పెన్షన్‌ వేటు పడింది. శని, ఆది వారాలు సెలవుకాగా, సోమవారం నాటి ఐదో రోజు సెషన్స్‌లో సస్పెన్షన్‌ అంశంపై రభస తప్పదన్న వాదన వినిపిస్తున్నది. అయితే, పెగాసస్‌ అంశంపైనే మరోసారి విపక్షాలు పట్టుబట్టడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ విషయంలో ప్రతిపక్షాలన్నీ ఒకేతాటిపైకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పెగాసస్‌ నిఘా వ్యవహారం దేశ ప్రతిష్టను దెబ్బతీయడమేగాక, మోడీ సర్కారుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కాగా, బోయింగ్‌, డసో, సాబ్‌ వంటి బడా కార్పొరేట్‌ సంస్థలకు చెందిన ప్రముఖుల ఫోన్లను ట్యాప్‌ చేసి, వారి సంభాషణలను తెలుసుకోవడానికి పెగాసస్‌ స్పైవేర్‌ను వాడినట్టు అంతర్జాతీయ మీడియాలో వచ్చిన సమాచారం విపక్షాలకు గొప్ప ఆయుధంగా మారింది. అమెరికా, ఐరోపాకు చెందిన ఈ సంస్థలతో భారత్‌కు ఆయుధాల కొనుగోలు ఒప్పందాలు ఉన్నాయి. కాబట్టి, ఆ సంస్థలు సైతం భారత్‌వైపు అనుమానంగా చూసే ప్రమాదం లేకపోలేదు. పౌరసత్వ చట్టం (సిఎఎ), మత స్వేచ్ఛ, సైబర్‌ చట్టాల విషయంలో బ్రిటన్‌ అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బ్రిటిష్‌ పార్లమెంటులో చర్చ కూడా జరిగింది. పెగాసస్‌ నిఘా వ్యవహారం బ్రిటన్‌ను మరింత అసహనానికి గురి చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. మరోవైపు అమెరికా సైతం అప్రమత్తమైంది. డొనాల్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆర్భాటంగా ప్రారంభించిన ’క్వాడ్‌’ను ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు పెగాసస్‌ అంశంపై వెలుగులోకి రావడంతో, భారత్‌తో అమెరికా వైఖరి ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తిని రేపుతున్నది. ఏదిఏమైనా పెగాసస్‌ వ్యవహారంపై కేంద్రం విధాయక ప్రకటన చేస్తే తప్ప నష్ట నివారణ సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments