పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తిలో సర్కార్‌ నిర్లక్ష్యం

ఫ్లోరైడ్‌ పీడిత జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి
శ్రీశైల సొరంగ మార్గాన్ని వెంటనే పూర్తి చేయాలి
జిఒ 203ను రద్దు చేయాలి
ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాటాలు చేద్దాం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

ప్రజాపక్షం/నల్లగొండ ప్రతినిధి : ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలైన జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంలో తెలంగాణ సర్కార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి అన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయాలని శనివారం సిపిఐ జిల్లా కార్యాలయం మఖ్దూంభవనంలో నిర్వహించిన సదస్సుకు చాడ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శ్రీశైలం సొరంగ మా ర్గం పథకం, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులకు నిధు లు కేటాయించకుండా దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పక్షపాతి ధోరణి అవలంబించడం సరైంది కాదన్నారు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా సిఎం కెసిఆర్‌ కుర్చీ వేసుకొని ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పిన మాటలు నేడు విస్మరించారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల సత్వర పూర్తి కోసం, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్వాసితులకు ప్యాకేజీ ఇచ్చేవరకు సిపిఐ ఉద్యమాలు చేస్తుందన్నారు. ఎపి సర్కార్‌ విడుదల చేసిన 203 జిఒను వెంటనే రద్దు చేసే విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ సర్కారు ఒత్తిడి తేవాలన్నారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి బలమైన ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను ఆంధ్రా ప్రాంతానికి తరలించే జిఒ 203ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా మిగులు జలాల పేరుతో నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ కుట్ర పన్నిందన్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతాలలో ప్రాజెక్టులకు నీరు రాకుండా ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. నేటికీ టెన్నెల్‌ ప్రశ్నార్థకంగా మారిందని, బ్రహ్మణవెల్లెంల ప్రాజెక్టు పూర్తి అయితే నల్లగొండ, మునుగోడు ప్రాంతాల్లో సాగు, తాగునీటి సమస్య ఉండదన్నారు. తెలంగాణ సర్కార్‌ జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కాలయాపన చేస్తూ కాళేశ్వరం పేరుతో కోట్లాది రూపాయలు అప్పులు చేశారన్నారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లా ప్రజలను కెసిఆర్‌ మోసం చేశారని ఆరోపించారు. సాగర్‌, పులిచింతల నిండిన తర్వాత మాత్రమే ఎపి సర్కార్‌ మిగులు జ లాలను వాడుకోవాల్సి ఉన్నా.. మిగులు జలాల పేరుతో ఎక్కువ టిఎంసిల నీటిని వాడుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్ర పన్నారన్నారు. జిల్లాలోని పెం డింగ్‌ ప్రాజెక్టుల కోసం ఒంటరి పోరాటం చేసేందుకు సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు, బ్రహ్మణవెల్లెంల ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గత ఆరేళ్లుగా కెసిఆర్‌ ప్ర భుత్వం నల్లగొండ జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేయకుండా వివక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి కోసం డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు కింద ఉన్న చర్లగూడెం, కిష్టరాంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు ప్యాకేజీ అందేవిధంగా సిపిఐ పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులపై అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పార్టీ శ్రేణులు ఒంటరి పోరాటాలు చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు, ప్రజాపక్షం ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి, ఉజ్జిని రత్నాకర్‌రావు, మల్లేపల్లి ఆదిరెడ్డి, పల్లా నర్సింహారెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, మాజీ ఎంఎల్‌ఎ ఉజ్జిని యాదగిరిరావు, నల్లగొండ జిల్లా, సూర్యాపేట జిల్లాల కార్యవర్గ సభ్యులు, జిల్లా సమితి సభ్యులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?