నిరుద్యోగ భృతి అమలుకు ఐదారు నెలలు పడుతుంది
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ వందకు వంద శాతం అమలు చేస్తాం
ప్రాజెక్టుల తర్వాత రహదారులకే అధిక ప్రాధాన్యత
డిమాండ్‌ను బట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు
ప్రజాపక్షం / హైదరాబాద్ : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ వంద కు వంద శాతం నెరవేరుస్తామని, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెంచిన పెన్షన్లు, రైతుబంధు అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శాసనసభలో ప్రకటించారు. నిరుద్యోగ భృతి అమలుకు ఐదారు నెలలు పడుతుందని, నిరుద్యోగులు ఎవరనే అంశంపై సమగ్ర అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, అనంతరం దానిపై నిర్ణయం తీసుకుంటామని సిఎం తెలిపారు. మార్చి నాటికి మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు తాగునీరు అందజేస్తామని సిఎం హామీ ఇచ్చారు. సంక్షేమం, వ్యవసాయం, ప్రాజెక్టుల తర్వాత రహదారులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని కెసిఆర్ చెప్పారు. 12,751 గ్రామ పంచాయతీల్లో బిటి రోడ్ల నిర్మాణం చేయనున్నామని ఆయన వెల్లడించారు. డిమాండ్‌ను బట్టి అవసరమైన ప్రతీ చోట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని సిఎం వెల్లడించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. వివిధ పార్టీల సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన పలు సమస్యలు, అంశాలకు సిఎం సమాధానమిచ్చారు. ఈ సందర్భం గా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ భూరికార్డుల ప్రక్షాళనపై గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని, టిఆర్ఎస్ వచ్చిన తరువాతనే భూరికార్డుల ప్రక్షాళనకు నడుం కట్టామని తెలిపారు. వందకు వందశాతం టిఆర్ఎస్ సర్కారు రైతు ప్రభుత్వంగానే ఉంటదని స్పష్టం చేశారు. ధరణి వెబ్ సైట్ ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రంలో ప్రతి ఇంచు భూమికి సంబంధించిన వివరాలు అందులో ఉంటాయన్నారు.
సమగ్ర అధ్యయనం తర్వాత రుణమాఫీపై నిర్ణయం
రాష్ట్రంలో చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా రూ. లక్ష వరకు రుణమాఫీ వందకు వందశాతం అమలు చేస్తామని, రుణాలపై సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత ఎన్ని విడతల్లో మాఫీ చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని కెసిఆర్ చెప్పారు. కొన్ని పనుల ప్రారంభానికి ఎన్నికల కోడ్ అవరోధంగా మారిందన్నారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తి కాగానే పనులు, సంస్కరణల్లో వేగం పెరుగుతుందని సిఎం స్పష్టం చేశారు. గతంలో రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేశామని, అది ఈసారి రూ. 24 వేల కోట్లుగా ఉందని, వందకు వందశాతం రుణమాఫీ చేసి తీరుతామని సిఎం వివరించారు. గతంలో కొన్నిచోట్ల బ్యాంకుల నుంచి వచ్చిన ఇబ్బందులు ఈసారి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
పైరవీలు లేకుండా బీమా సొమ్ము : గత ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యంగా వదిలేశాయని, సర్వేయర్లు లేరని, వ్యవసాయ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ల వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారని సిఎం కెసిఆర్ అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా రుణమాఫీ చేయకపోతే ప్రజలు మళ్లీ తమకు ఎందుకు ఓటు వేశారని విపక్ష సభ్యులను ప్రశ్నించారు. పహాణి, ఆర్ఒఆర్లు అవసరం లేకుండా బ్యాంకుల్లో రైతులకు రుణాలు అందాలన్నారు. ఎలాంటి దస్త్రాలు లేకుండా కేవలం ధరణి వెబ్సైట్ ఆధారంగానే రైతులకు రుణాలు అందాలని సిఎం ఆకాంక్షించారు. రైతే రాజు అయ్యే పరిస్థితులు వచ్చాయని ఇప్పటికే కొందరు ప్రశంసించారని, రైతుబీమా పరిహారం బాధిత కుటుంబాలకు కేవలం10రోజుల్లోఅందుతోందని చెప్పా రు. కార్యాలయాలు తిరగకుండా, పైరవీలు చేయకుండానే బాధిత కుటుంబం ఖాతాలో పరిహారం సొమ్ము జమ అవుతోందన్నారు. ఇప్పటికే 6,062 మందికి రైతు బీమా అందిందని, మొత్తంరూ.300కోట్లు ఆయా రైతుల ఖాతాల్లో జమ అయిందన్నారు.