కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్
న్యూఢిల్లీ: భవిష్యనిధి(పిఎఫ్) డిపాజిట్లపై 2018- సంవత్సరానికి గానూ వడ్డీరేటును 8.65శాతానికి పెంచుతూ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఇపిఎఫ్ఒ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ వెల్లడించారు. గురువారం జరిగిన ఇపిఎఫ్ఒ కేంద్ర ధర్మకర్తల మండలి సమావేశంలో వడ్డీరేటును పెంచేందుకు సభ్యులు ఆమోదం తెలిపినట్లు గాంగ్వర్ తెలిపారు. ఈ ప్రతిపాదనను త్వరలోనే ఆర్థికమంత్రికి పంపించనున్నట్లు తెలిపారు. ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన తర్వాతే చందాదారుల ఖాతాల్లో పెంచిన వడ్డీ మొ త్తం జమ అవుతుంది. 2017 సంవత్సరానికి పిఎఫ్ వడ్డీరేటును ఐదేళ్ల కనిష్ఠానికి తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 8.55శాతం వడ్డీనే ఇస్తున్నారు. అంతకుముందు 2016- 8.65 శాతం, 2015- సంవత్సరానికి 8.8 శాతం, 2014- 2013 సంవత్సరాలకు 8.75 శాతం, 2012 సంవత్సరానికి 8.5శాతం వడ్డీ ఇచ్చారు. 2018- సంవత్సరానికి కూడా 8.55శాతాన్నే కొనసాగించే అవకాశాలున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వడ్డీరేట్లను పెంచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. నెలసరి పింఛన్‌ను రూ. 2000కు రెట్టింపు చేసే ప్రతిపాదనపై ఇపిఎఫ్ఒ నిర్ణయాన్ని తదుపరి సమావేశం జరిగే మార్చి వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వాయిదా వేసింది. ఈ విషయాన్ని ఇపిఎఫ్ఒ ట్రస్టీ(సభ్యుడు) పిజె బనసురే తెలిపారు. ఇపిఎఫ్ఒ ఆదాయం అంచనా ప్రకారం ఇపిఎఫ్‌కు 8.7 శాతం వడ్డీ చెల్లిస్తే తతలితంగా రూ.158 కోట్ల లోటు ఏర్పడుతుంది. అసంఘటిత రంగాల్లోని శ్రామికులకు నెలసరి పింఛను రూ. 3000 అందించేందుకు ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మంధన్ పెన్షన్ యోజన(పిఎంఎస్ఐఎం)ను ఈ నెల ఆరంభంలోనే తాత్కాలిక బడ్జెట్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో నెలసరి కనీస పింఛనును రూ. 2000కు పెంచే ప్రతిపాదనను ఇపిఎఫ్ఒ చేసింది. భారతీయ మజ్దూర్ సంఘ్(బిఎంఎస్) ప్రధాన కార్యదర్శి విర్జేశ్ ఉపాధ్యాయ ‘ప్రభుత్వం నడిపే అన్ని సామాజిక భద్రత పథకాలకు ఒకే రకమైన కనీస పింఛను ఉండాలి. అందుకనే ఇపిఎఫ్ఒ సబ్స్క్రయిబర్లకు కూడా నెలసరి కనీస పింఛను రూ. 3000 ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం’ అన్నారు. సంక్షోభంలో కూరుకుపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఐఎల్ అండ్ ఎఫ్ఎస్)లో ఇపిఎఫ్ఒ రూ. 570 కోట్లు పెట్టుబడిగా పెట్టిందని సమాచారం. ఇటీవల భారత్ ఇటిఎఫ్‌లో కూడా రూ. 1500 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. ఇపిఎఫ్ స్కీమ్ 1952 సవరణకు సిబిటి కూడా ఆమోదం తెలిపింది. సి-డిఎస్ కొనసాగింపును కూడా ఆమోదించింది. సిపిఎఫ్ఒ సెక్యూరిటీలకు స్టాండర్డ్ ఛార్టెడ్ బ్యాంక్‌ను కస్టోడియన్‌గా నియామకాన్ని కూడా పొడిగించింది.