తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లో 106 మంది అరెస్టు
దేశ విచ్ఛిన్న శిక్షణకు గల్ఫ్ దేశాల నుండి నిధులు
నిషేధం దిశగా కేంద్రం అడుగులు?
న్యూఢిల్లీ : ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) కార్యాలయాలపైన, నాయకుల ఇళ్ళపైన దేశవ్యాప్తంగా ఎన్‌ఐఎ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ (ఇడి) దాడులు చేశాయి. 15 రాష్ట్రాల్లో 95 ప్రాంతాల్లో దాడులు చేసి 106 మంది పిఎఫ్‌ఐ నాయకులను ఎన్‌ఐఎ అధికారులు అరెస్టు చేశారు. తెలంగాణలో అబ్దుల్ వారిస్‌ను అరెస్టు చేశారు. కేరళలో 22 మంది పిఎఫ్‌ఐ నాయకులను, మహారాష్ట్రలో 20 మందిని, కర్ణాటకలో 20 మందిని, తమిళనాడులో 10 మందిని అరెస్టు చేశారు. అసోంలో తొమ్మిదిమందిని, ఉత్తర ప్రదేశ్‌లో ఎనిమిదిమందిని, ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురిని, మధ్యప్రదేశ్‌లో నలుగురిని, పుదుచ్చేరీలో ముగ్గురు, ఢిల్లీలో ముగ్గురు, రాజస్థాన్‌లో ఇద్దరు, తెలంగాణలో ఒక పిఎఫ్‌ఐ నాయకుణ్ణి ఎన్‌ఐఎ అధికారులు అరెస్టు చేశారు. అదేవిధంగా మహారాష్ట్ర,పశ్చిమబెంగాల్, బీహార్,మణిపూర్,గోవాలలో కూడా జరిపిన ఈ దాడుల్లో పిఎఫ్‌ఐ కార్యాలయాలను అధికారులు సీజ్ చేశారు. ఒకవైపు దాడులు జరుగుతూ ఉండగానే కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షా ఎన్‌ఐఎ, జాతీయ భద్రతా సలహారులతో గురువారం ఉదయం సమావేశం జరిపారు. పిఎఫ్‌ఐపై నిషేధం విధించే దిశగా కేంద్రం ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, కేరళలో 14 మంది పిఎఫ్‌ఐ రాష్ట్ర ఆఫీసు బేరర్లను, జాతీయస్థాయి,జిల్లాస్థాయి నాయకులను ఎన్‌ఐఎ అరెస్టు చేసింది. పిఎఫ్‌ఐ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు సి.పి.మహ్మద్ బషీర్, పిఎఫ్‌ఐ జాతీయ ఛైర్మన్ ఓఎంఎ సలామ్, జాతీయ కార్యదర్శి నజరుద్దీన్ ఎలామరమ్ తదితరులను కేరళలో అరెస్టు చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వీరందరనీ అరెస్టు చేశారు. అరెస్టుల సందర్భంగా పలు రాష్ట్రాలలో పాపులర్ ఫ్రంట్ కార్యకర్తలు కేంద్ర దర్యాప్తు సంస్థలకు తీవ్ర నిరసనలు తెలియజేశారు. జాతీయస్థాయి నుండి స్థానిక స్థాయి వరకూ ఉన్న పిఎఫ్‌ఐ నాయకుల ఇళ్ళపై దాడులు చేసి వారిని అరెస్టులు చేశారు. దేశ విచ్ఛిన్నం, ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం, విదేశీ నిధులు సంపాదించడం, యువకుల హృదయాల్లో ఉగ్రవాద భావనలు నాటడం, వివిధ సమూహాలమధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం,ఉగ్రవాద శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కస్టడీలో ఉన్న నిందితుడిచ్చిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా పిఎఫ్‌ఐ కార్యాలయాలపై దాడులు చేసినట్లు ఎన్‌ఐఎ తెలిపింది. కరాటే శిక్షణల ముసుగులో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఐఎ గుర్తించింది. ఈ కార్యకలాపాల నిమిత్తం గల్ఫ్ దేశాల నుండి వారిని నిధులు సమకూరుతున్నట్లు ఎన్‌ఐఎ గుర్తించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్‌కు కూడా సమాచారం ఇవ్వడంతో ఈ రెండు జాతీయ సంస్థలూ గురువారం ఉదయం నుండే దాడులు ప్రారంభించాయి. ఎన్‌ఐఎ చరిత్రలో ఇప్పటివరకూ ఇంత భారీస్థాయిలో దాడులు, ఇళ్ళల్లో సోదాలు నిర్వహించి ఇంతమందిని ఒకేసారి అరెస్టు చేయలేదని, ఇలాంటి అరెస్టులు ఇదే మొదటిసారి అని ఎన్‌ఐఎ అధికారులు తెలియజేశారు. కేరళలో పిఎఫ్‌ఐ ఛైర్మన్ ఇంటిపై దాడి చేసి అతడిని అరెస్టు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తను హత్య చేసిన కేసులో పిఎఫ్‌ఐ కేరళ పాలక్కాడ్ జిల్లా కార్యదర్శి సిద్ధిఖ్‌ను అరెస్టు చేశారు. వివిధ రా్రష్ట్రాలలో ఎన్‌ఐఎ జరిపిన దాడుల్లో గత కొద్ది రోజులుగా ఎన్‌ఐఎ తెలంగాణలో దాడులు కొనసాగిస్తూ అరెస్టులు చేసి కీలక సమాచారం సంపాదించింది. జులై 4న దాడులు చేసి నిజామాబాద్ పోలీస్ స్టేషన్‌లో 25 మందిపైగా పిఎప్‌ఐ కార్యకర్తలపై కేససులు నమోదు చేశారు. వారిచ్చిన సమాచారం మేరకే ఉగ్రవాద వ్యతిరేక ఎన్‌ఐఎ దేశవ్యాప్తంగా ఈ దాడులు చేస్తోంది. గతకొన్ని సంవత్సరాలుగా పిఎఫ్‌ఐపై వివిధ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.కళాశాల ప్రొఫెసర్ చెయ్యి నరికివేయడం,ఇతర మతాలనుసమర్థించే సంస్థలతో సంబంధాలున్నవారిని హత్య చేయడం,ప్రముఖ వ్యక్తులు,స్థాలను లక్ష్యంగా చేసుకుని పేలుడు పదార్థాల సేకరణ,ఇస్లామిక్ స్టేట్ కుమద్దతు,ప్రజా ఆస్తుల విధ్వంసం వంటి హింసాత్మక చర్యలకు వీరు పాల్పడుతున్నారని ఎన్‌ఐఎ పేర్కొంది. తెలంగాణలో అబ్దుల్ వారిస్‌ను అధికారులు అరెస్టు చేశారు. పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా దేశంలో అల్లర్లకు పిఎఫ్‌ఐ ఆజ్యం పోసిందని, ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడంకోసం ఇతర దేశాల నుండి పిఎఫ్‌ఐకి నిధులు అందుతున్నాయని ఇ.డి. పేర్కొంది. లక్నోలో పిఎంఎల్‌ఎ చట్టం కింద పిఎఫ్‌ఐ నాయకులమీద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ రెండు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఇడి. పిఎఫ్‌ఐ విద్యార్థి విభాగం క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సిఎఫ్‌ఐ)పై హవాలా కేసులు నమోదు చేసిది. సిఎఫ్‌ఐ సంస్థ సభ్యులు మత ఘర్షణలు రెచ్చగొడుతున్నారని, ఉగ్రవాదాన్ని విస్తరింపజేస్తున్నారని ,2020లో హత్రాస్‌లో సామూహిక అత్యాచార సంఘటన అనంతరమే ఇదంతా జరుగుతోందని పేర్కొంది. ఈ ఛార్జిషీటులో సిఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.ఎ.రవూఫ్ షరీఫ్, సంస్థ జాతీయ కోశాధికారి అతికుర్ రెహ్మన్, ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సిఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మసూద్ అహ్మద్, కేరళకు చెందిన జర్నలిస్టు సిద్ధిఖ్ కప్పన్, మహ్మద్ ఆలమ్ తదితరులు ఉన్నారని పేర్కొంది. ఈ ఏడాది ఇడి నమోదు చేసిన రెండో ఛార్జిషీటులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న ఒక హోటల్ కేంద్రంగా పిఎఫ్‌ఐకి నిధులు సరఫరా అవుతున్నాయని వెల్లడించింది.
కేరళలో నేడు పిఎఫ్‌ఐ హర్తాళ్ పిలుపు
ఫాసిస్టు ప్రభుత్వ దాడులకు నిరసన
తిరువనంతపురం : దేశవ్యాప్తంగా తమ కార్యాలయాలపైనా, తమ నాయకుల ఇళ్ళపైనా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్‌ఐఎ, ఇడిల దాడులకు పాల్పడటాన్ని పాపులర్ ఫ్రంట్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. కేరళ రాష్ట్రంలో శుక్రవారం హర్తాళ్‌కు పిలుపు ఇచ్చింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా పిఎఫ్‌ఐ కార్యకర్తలలు భారీ ఎత్తున నిరసన ప్రద్శ్రనలు జరిపారు. ది రాజ్యవ్యవస్థ ఉగ్రవాదం తప్ప మరోటి కాదని, దీనికి వ్యతిరేకంగా తాము హర్తాళ్ పాటించి నిరసన తెలియజేసస్తామని పిఎఫ్‌ఐ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో అప్రమత్తమైన కేంద్ర దళాలు కేరళలోని అన్ని ప్రాంతాలలో అల్లర్లు జరగక్కుండా మోహరించాయి. తిరువనంతపురం, కొల్లాం, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిస్కూర్‌లలో గురువారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఫాసిస్టు ప్రభుత్వం తమ నాయకుల ఇళ్ళపై దాడులు చేసి తమ నిరసన గళాన్ని తొక్కిపెట్టాలని ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తింది. దేశవ్యాప్తంగా దాడులు సందర్భంగా తమ కార్యకర్తలు కేంద్ర దర్యాప్తు సంస్థలకు తమ నిరసన తెలియజేసినట్లు ప్రకటన పేర్కొంది. తన అసమ్మతి గణాన్ని తొక్కిపట్టేందుకే ఎన్‌ఐఎ,ఇ.డిల దాడులకు ఫాసిస్టు ప్రభుత్వం పురిగొలిందని పేర్కొంది. సామాజికంగా ఆర్థికంగా వెనుకవడిన భారత్‌లోని వర్గాల శ్రేయస్సుకోసం పోరాటం చేసేందుకు 2006లో ఆవిర్భవించిన పిఎఫ్‌ఐ సంస్థ పైకి మాత్రం సామాజిక వెనుకబాటుతనంపై పోరాటమనే ముసుగు వేసుకున్నప్పటికీ ఇస్లాంలో ఉగ్రవాద మనస్తత్వాన్ని, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించేందుకే తెరవెనుక పిఎఫ్‌ఐ పనిచేస్తోందని ఎన్‌ఐఎ తరచు తమపై ఆరోపణలు చేస్తున్నదని విమర్శించింది.
త్రిసూరులో ఉన్న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడి ఇంటిపై కూడా దాడి చేశారని ఈ సంస్థ కేరళ రాష్ట్ర అధ్యక్షుఉడు అష్రఫ్ మౌలావి చెప్పారు. తిరువనంతపురంలో ఆయన గురువారం పాత్రికేయులతో మాట్లాడుతూ, రాజ్యాంగంపై విశ్వాసం ప్రకటించి రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకునే ఎవ్వరైనాగానీ, తమ సంస్థపై ఆర్‌ఎస్‌ఎస్ పాలిత దేశంలో ఇలాంటి దాడులు జరుగుతాయని ఊహిచగలరని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్న తమను ఉగ్రవాద సంస్థగా చిత్రీకరించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
పిఎఫ్‌ఐ కార్యాలయాలపై ఎన్‌ఐఎ, ఇడి దాడులు
RELATED ARTICLES