పార్లమెంటులో చర్చించాకే…

నూతన విద్యావిధానం అమలు చేయాలి : సిపిఐ డిమాండ్‌
ప్రజాపక్షం/న్యూఢిల్లీ  పార్లమెంటును పక్కనబెట్టి, సమాఖ్య స్ఫూర్తిని తుంగలోతొక్కి నూతన విద్యావిధానాన్ని కేం ద్రం ప్రకటించడం సరైనచర్య కాదని సిపిఐ వ్యా ఖ్యానించింది. విద్యారంగా న్ని ఉమ్మడిజాబితాలో పెట్టిన నాటి నుంచి అత్యధిక భాగస్వామ్యం కలిగివున్న రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పార్లమెంటులో ఈ విద్యావిధానంపై పూర్తిస్థాయి చర్చ జరపాలని డిమాండ్‌ చేసింది. సిపిఐ జాతీయ కార్యదర్శివర్గం ఈ మేరకు గురువారంనాడు ఒక ప్రకటన విడుదల చేసింది. నూతన విదావిధానం (ఎన్‌ఇపి)ను ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఏకపక్షంగా ఆమోదించిందని, ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యను విశ్వజనీనం చేయాలన్న లక్ష్యానికి దూరంగా, విద్యా మార్కెట్లను సృష్టించేందుకు అనువుగా ఈ వ్యవస్థలో సమూల మార్పులను ఈ నూత న విద్యావిధానం తీసుకువచ్చిందని ఆ ప్రకటనలో పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. సమాజంలో వెనుకబడిన వర్గాలు, పేదలకు నాణ్యమైన విద్యను అందించాల న్న ఉద్దేశం ఈ విధానం విస్మరిస్తున్నదన్నారు. ప్రభుత్వ నిధులతో విద్యను అందించకుండా చేసే ఏ ప్రయత్నమైనా సామాజిక న్యాయాన్ని అందివ్వలేదని వ్యాఖ్యానించారు. పార్లమెంటును పక్కనబెట్టి, సమాఖ్య స్ఫూర్తిని తుంగలోతొక్కిన కేంద్ర ప్రభుత్వం తన నయా ఉదారవాద ఎజెండా ద్వారా కొత్తవిధానాన్ని ప్రజలపై రుద్దుతూ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని విమర్శించా రు. భవిష్యత్‌లో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్‌ఇపి అనేది అధికార వికేంద్రీకరణకు పూర్తిగా విరుద్ధమని, పైగా పూర్తిస్థాయి ప్రైవేటీకరణ, వ్యాపారీకరణకు ఊతమిచ్చే ప్రయత్నమని అభివర్ణించారు. జిడిపిలో ఆరు శాతం విద్య కోసం ప్రభు త్వం కేటాయిస్తుందని, నిజానికి ఇది ఎన్నో దశాబ్దాల క్రితం కొఠారీ కమిషన్‌ చేసిన ప్రతిపాదన ఇదని, కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో జిడిపిలో కనీసం 10 శాతం నిధులను ఈ రంగంపై వెచ్చించాల్సి వుంటుందని రాజా పేర్కొన్నారు. గవర్నర్ల బోర్డు నియంత్రణలో విద్య ప్రైవేటీకరణ, వ్యాపారీకరణకు ఎన్‌ఇపి నేతృత్వం వహిస్తుందని, డబ్ల్యుటిఓ ప్రకారం విదేశీ వర్శిటీలకు ఇది ఆహ్వానం పలుకుతుందని తెలిపారు. 50,000 విద్యాసంస్థలు ఇప్పుడు 15,000 విద్యాసంస్థలుగా మారుతాయని, 3,000లోపు ఉన్న కాలేజీలన్నింటినీ విలీనం చేస్తారని, ఇది కచ్చితంగా ప్రాంతీయ అసమానతలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఐఐఎంఎస్‌, ఐఐటి, ఐఎస్‌సి వంటి సింగిల్‌ సబ్జెక్ట్‌ ఉన్న సంస్థలు మూతపడతాయని, బహుళ సబ్జెక్ట్‌లు కలిగివున్న సంస్థల మనుగడ మాత్రమే వుంటుందని, ఇది సబ్జెక్ట్‌ల స్పెషలైజేషన్‌ భావనను నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక శాస్త్రాల అధ్యయనానికి మార్కెట్‌ ఉండకపోవడం వల్ల ఇకపై అవన్నీ మూతపడతాయని తెలిపారు. 3 నుంచి 18 ఏళ్ల లోపు వారందరికీ విద్యాహక్కు కల్పించడమొక్కటే ఈ నూతన విద్యావిధానంలో సానుకూల అంశమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ అంశంపై పార్లమెంటులోనూ, రాష్ట్రాలతో సమాలోచనలు జరిపిన మీదటే, దీన్ని అమలు చేయాలని రాజా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?