ముగిసిన తొలివిడత పరిషత్ నామినేషన్ల పర్వం
ఖమ్మంలో ఏడు జడ్‌పిటిసి స్థానాలకు టిఆర్‌ఎస్ నుంచి 100 మంది పోటీ
నేటి నుంచి ఊపందుకోనున్న ప్రచారం
ప్రజాపక్షం / హైదరాబాద్ : స్థానిక ఎన్నికల పర్వం అంటేనే హోరాహారీకి మారుపేరు. నువ్వానేనా అన్నట్లుగా జరుగుతా యి. పైగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు పార్టీ ల గుర్తులతో జరుగుతాయి. దీంతో ఈ స్థానిక పోరులో ఆయా అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిష్టతో పాటు పార్టీల ప్రతిష్ట కూడా ముడిపడి ఉండడం తో ఇవి మరింత రసవత్తరంగా జరుగుతాయి. జడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల తొలివిడత నామినేషన్ల పర్వం ఆదివారంతో ముగిసింది. ప్రచారం పర్వం సోమవారం నుంచి ఊపందుకోనుంది. మే 6న పోలింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో స్థానికంగా మంచి పేరున్న నేతలు ఏ పార్టీలో ఉన్నా సరే టికెట్ కోసం పోటీ పడతారు. రానట్లయితే అంత ఈజీగా రాజీ కి రారు. రెబల్‌గా పోటీ చేసైనా తనేంటో పార్టీతో పాటు ప్రజల ముందు నిరూపించుకోవడానికే సై అంటారు. ప్రస్తుతం జడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద తొలి విడతలో 199 జడ్‌పిటిసి స్థానాలకు ఎన్నికలు జరగుతుండగా అధికార టిఆర్‌ఎస్ నుంచి 618 మంది, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి 480 మంది ,బిజెపి నుంచి 260 మంది పోటీ పడుతున్నారు. ప్రధానంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, అధికార పార్టీ టిఆర్‌ఎస్‌లలో ఒకే స్థానం నుంచి పోటీ పడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువ ఉంది. నామినేషన్ల ఉపసంహరణ ఆదివారం ముగిసింది. అయినప్పటికీ ఉపసంహరణలు పెద్దగా జరగలేదు. దాదాపు ప్రతి స్థానంలోనూ ఈ పార్టీలకు రెబల్స్ ఒకరికి మించి పోటీలో ఉన్నారు. దీంతో ఈ రెండు ప్రధాన పార్టీల అగ్రనేతలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా అధికార పార్టీలో అభ్యర్థుల విజయాల బాధ్యత ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ బాధ్యులకు అప్పగించారు. వీరి గెలుపు ఓటములపైనా వారి భవిష్యత్తు ఉంటుందని కూడా టిఆర్‌ఎస్ అధిపతి స్పష్టం చేశారు. దీంతో రెబల్స్ భయం ఆయా స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కంటే వారి గెలుపు బాధ్యతలు తీసుకున్న బడానేతలనే ఎక్కువగా వణికిస్తోంది. నామినేషన్ల స్వీకరణ ముగిసే నాటికి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌కు చెందిన వారు ఎందరు బరిలో ఉన్నారో చూస్తే ఈ రెండు పార్టీల అభ్యర్థులకు రెబల్స్ బెడద ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. తొలి విడతలో ఖమ్మం జిల్లాలో ఏడు జడ్‌పిటిసి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు స్థానాలల్లో నామినేషన్ల పరిశీలన ముగిసే నాటికి వంద మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అంటే సగటను ఒక్కో స్థానానికి 15 మంది పోటీలో ఉన్నారు. బి ఫారం సమర్పించిన అధికారిక అభ్యర్థి పోను ఆయనకు అదే పార్టీకి చెందిన మరో 14మంది రెబల్స్‌గా ఉండబోతున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్‌కు ఇంత బెడద లేదు. ఏడు స్థానాల నుంచి 17 మంది బరిలో నిలిచారు. టిఆర్‌ఎస్ అంత బెడత లేకపోయినా కాంగ్రెస్‌కు కూ డా తొలివిడతలో ఒక్కో జడ్‌పిటిసి స్థానం నుంచి ఇద్దరికి పైగా బరిలో ఉన్నారన్నమాటే. అధికార పార్టీ టిఆర్‌ఎస్ పరిస్థితిని మరి కొన్ని స్థానాల్లో పరిశీలిస్తే.. నల్గొండ జిల్లాలో పది జడ్‌పిటిసి స్థానాలకు53 మంది, మంచిర్యాల జిల్లాలో ఏడు జడ్‌పిటిసి స్థానాలకు 34 మంది, కరీంనగర్ జిల్లాలో ఏడు స్థానాలకు 31, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఏడు స్థానాలకు 26, సూర్యాపేట జిల్లాలో 8 స్థానాలకు 27మంది పోటీలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పరిస్థితిని పరిశీలిస్తే… నల్గొండ జిల్లాలో పది జడ్‌పిటిసి స్థానాలకు 53 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మూ డు స్థానాలకు 26, మంచిర్యాల జిల్లాలో ఏడు స్థానాలకు 24, కరీంనగర్ జిల్లాలో ఏడు స్థానాలకు 23 సంగారెడ్డి జిల్లాలో 9స్థానాలకు 20, సిద్దిపేట జిల్లాలో 10 స్థానాలకు 21 మంది పోటీలో ఉన్నారు. మొత్తం మీద తొలివిడతలో 199 జడ్‌పిటిసి స్థానాలకు ఎన్నికలు జరగుతుండగా అధికార టిఆర్‌ఎస్ నుంచి 618 మంది, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి 480 మంది బరిలో ఉన్నారు. ఈ రెండు పార్టీల తర్వాత బిజెపి ఉంది.