ప్రతి కంప్యూటర్ సమాచారంపై కేంద్ర నిఘా
పది దర్యాప్తు సంస్థలకు సంపూర్ణ అధికారాలను కట్టబెట్టిన హోంశాఖ
కేంద్ర ప్రభుత్వ ‘ఇంటర్సెప్ట్’ విధానంపై ఆగ్రహజ్వాలలు
ఇది నియంతృత్వ చర్య : రాహుల్‌గాంధీ
రాజ్యాంగ విరుద్ధం : వామపక్షాలు
ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి : ఎస్పి, ఆర్జెడి, టిఎంసి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేశంలోని ప్రతీ కంప్యూటర్‌పై నిఘా పెట్టాలని నిర్ణయించింది. వ్యక్తిగత సమాచారాన్ని కూడా పరిశీలించే అధికారాన్ని దర్యాప్తు సంస్థలకు ఇచ్చింది. ఇందుకు సంబంధించి దేశంలోని 10 దర్యాప్తు సంస్థలకు కేంద్ర హోంశాఖ శుక్రవారం అనుమతులిచ్చింది. దర్యా ప్తు సంస్థలకు సహకరించనివారికి ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ కొత్త ఉత్తర్వు ప్రకారం కంప్యూటర్ సమాచారంపై మరిన్ని అధికారాలు పొందే ఆ పది సంస్థలు: ఇంటెలిజెన్స్ బ్యూరో, మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ప్రత్యక్ష పన్నుల సెం ట్రల్ బోర్డు (ఆదాయపు పన్ను శాఖ), రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్, సిబిఐ, ఎన్ఐఎ, పరిశోధన విశ్లేషణ విభాగం, సిగ్నల్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్(జమ్మూకశ్మీర్, ఈశాన్య, అస్సాం సర్వీసు ప్రాంతాలు), ఢిల్లీ పోలీస్ కమిషనర్. కంప్యూటర్లలో నిక్షిప్తం చేసిన, పంపించిన, పొందిన, లేదా జనరేట్ చేసిన సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు అడ్డుకోవచ్చు, పర్యవేక్షించొచ్చు, డీక్రిప్ట్ చేయొ చ్చు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై గురువారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా గురువారం సంతకం చేశారు. ఈ చర్య శుక్రవా రం రాజకీయ దుమారం రేపింది. ప్రభుత్వం ‘నిఘా రాజ్యాన్ని’ సృష్టింప చూస్తోందని ప్రతిపక్షాలు నిందించాయి. కానీ దీన్ని కేంద్రం ఖండించింది. కంప్యూటర్ డేటాను నియంత్రించే, అడ్డగించే నియమాలను 2009లోనే కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ హయాంలో రూపొందించారని పేర్కొంది. ప్రస్తుతం ఆ అధికారాన్ని అమలుచేసేందుకే అధికారాలు కల్పిస్తూ కొత్త ప్రకటన చేశామని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. ఈ ఉత్తర్వును కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీ లు ఏకేశాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని, అప్రజాస్వామికమని, ప్రాథమిక హక్కులపై దాడి యత్నమని పేర్కొన్నాయి. బిజెపి ప్రభుత్వం భారత్‌ను ‘నిఘా రాజ్యం’గా మార్చేస్తోందని ఆరోపించాయి. సమాచారాన్ని అడ్డగించే ప్రభుత్వ ఉత్తర్వును బిజెపి సమర్థించింది. జాతీయ భద్రతరీత్యా తగిన రక్షణలు చేశామంది.ప్రతిపక్షాలు ఎలాంటి హోంవర్క్ చేయకుండానే మాట్లాడుతున్నాయనేందుకు ఇదో ఉదాహరణ( టెక్ట్ బుక్ కేస్) అని పేర్కొంది. ప్రతిపక్షం ఆరోపిస్తున్న నిఘా ఆరోపణను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.