HomeNewsBreaking Newsపాక్‌పై భారత్‌ ఘనవిజయం

పాక్‌పై భారత్‌ ఘనవిజయం

మహిళల ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా శుభారంభం
బే ఓవల్ల్‌ : ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియా శుభారంభం చేసింది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో మిథాలిసేన 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దాయాది జట్టు 137 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమ్‌ ఇండియా ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. పాక్‌ ఓపెనర్‌ సిద్రా అమీన్‌ (30; 64 బంతుల్లో 3×4) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. రాజేశ్వరి నాలుగు.. ఝులన్‌ గోస్వామి, స్నేహ్‌ రాణా రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు టీమ్‌ ఇండియా 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. పూజా వస్త్రాకర్‌ (67; 59 బంతుల్లో 8×4), స్నేహ్‌ రాణా (53 నాటౌట్‌ : 48 బంతుల్లో 4×4), స్మృతి మంధాన (52; 75 బంతుల్లో 3×4, 1×6) అర్ధ శతకాలతో రాణించారు.టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్‌ ఇండియాకు పాక్‌ అమ్మాయిలు ఆదిలోనే షాకిచ్చారు. ఓపెనర్‌ షెఫాలీ వర్మ(0)ను డకౌట్‌గా పెవిలియన్‌ పంపారు. ఈ క్రమంలోనే వన్‌డౌన్‌ బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(40; 57 బంతుల్లో 2×4)తో కలిసి మంధాన భారత ఇన్నింగ్స్‌ను నిర్మించింది. ఇద్దరూ నిలకడగా ఆడుతూ రెండో వికెట్‌కు 92 పరుగుల కీలక భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలోనే పాక్‌ బౌలర్లు అనూహ్యంగా రెచ్చిపోయారు. 18 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు పడగొట్టారు. క్రీజులో కుదురుకున్న మంధాన, దీప్తితో సహా కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (9), హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (5), రీచాఘోష్‌ (1)లను పెవిలియన్‌కు పంపారు. దీంతో టీమ్‌ ఇండియా 114/6తో నిలిచి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలోనే క్రీజులోకి వచ్చిన పూజా, స్నేహ్‌ రాణా కీలకంగా ఆడారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 122 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. చివరి పది ఓవర్లలో 84 పరుగులు సాధించి జట్టుకు విలువైన స్కోర్‌ అందించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments