HomeNewsBreaking Newsపాకిస్థాన్‌ కొత్త ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ ఏకగ్రీవ ఎన్నిక

పాకిస్థాన్‌ కొత్త ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ ఏకగ్రీవ ఎన్నిక

వీళ్ళంతా దొంగలు : వాళ్ళ సభలో కూర్చోను
ఎంపి పదవికి ఇమ్రాన్‌ రాజీనామా
పిటిఐ ఎంపీలంతా అదేబాట!
ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ఎత్తుగడలు పారలేదు. మెజారిటీ కోల్పోయి న ఇమ్రాన్‌ ఆదివారంనాడు నాటకీయ పరిణామాలమధ్య జరిగిన బలపరీక్షలో పదవీచ్యుతుడయ్యారు. సోమవారం మధ్యాహ్నం పాకిస్థాన్‌ జాతీయమహాసభ సమావేశమై షెహబాజ్‌ షరీఫ్‌ (70)ను ఏకగ్రీవంగా ప్రధానమంత్రిగా ఎంపిక చేసుకుంది. ఆయనకు 174 మంది ఎంపీలు మద్దతు తెలియజేశారు. ఏకగ్రీవ ఎన్నిక అనంతరం ప్రధానమంత్రి షెహబాజ్‌ మొదటి ప్రసంగం చేస్తూ, “ఒక ప్రధానమంత్రికి వ్యతిరేకంగా సభలో అవిశ్వాస తీర్మానం విజయవంతం కావడం పాకిస్థాన్‌ చరిత్రలో ఇదే ప్రప్రథమం” అని ప్రకటించారు. “ఇది పాకిస్థాన్‌ దేశ చరిత్రలో గొప్ప రోజు,యావత్‌ జాతికి, దేశానికి గొప్ప రోజు, విఫలమైన ప్రధానమంత్రిని రా జ్యాంగబద్ధంగా, న్యాయబద్ధమైన పద్ధతులలో ఇంటికి సాగనం పాం” అని ఆయన అన్నారు. దేశాధ్యక్షుడు అరిఫ్‌ అల్వి నివాసంలో సోమవారం రాత్రి పొద్దుపోయాక షెహబాజ్‌ ప్రమాణస్వీకారం చేస్తారు. ఎన్నికల్లో ఓట్ల ద్వారా గెలిచిన పాకిస్థాన్‌ తెహ్రీక్‌ పార్టీ (పిటిఐ) జాతీయ మహాసభలో ఓటింగ్‌ను బహిష్కరిస్తోందని విదేశాంగమంత్రి షా మహమూద్‌ ఖురేషీ ప్రకటించడంతో ఇక ప్రధానమంత్రి పదవికి పోటీలో షెహబాజ్‌ ఒక్కరే మిగలడంతో ప్రతిపక్ష ఎంపీల కోరిక నెరవేరింది. ‘ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌’ ప్రధానమంత్రిగా షెహబాజ్‌ పేరునే స్పీకర్‌ ఆయజ్‌ సాధిక్‌ ప్రకటించారు. ఈ సమావేశాన్ని నిర్వహించడానికి తన మనస్సు అంగీకరించడంలేదని డిప్యూటీ స్పీకర్‌ క్వాసిమ్‌ సురి ప్రకటించడంతో ఆయజ్‌ సాధిక్‌ సభాధ్యక్షస్థానంలో కూర్చుని కొత్త ప్రధానమంత్రి ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. 342 మంది సభ్యులుగల పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీలో 172 మంది షెహబాజ్‌కు మొదటినుండీ మద్దతుగా నిలిచారు.
బలప్రదర్శనలో ఓటమిపాలైన ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “వీళ్ళంతా దొంగలు, ఈ దొంగలందరితో కలిసి ఈ సభలో కూర్చోలేను, ఈ సభకు రాజీనామా చేస్తున్నాను” అని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రకటించారు. ప్రతిపక్షం ముందుగా ప్రకటించినవిధంగానే పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ (షరీఫ్‌) పార్టీ అధినేత షెహబాజ్‌ షరీఫ్‌ను కొత్త ప్రధానమంత్రిగా ఎంపిక చేసుకున్నారు. ఈ ప్రక్రియ లాంఛనప్రాయంగా జరిగింది. మూడుసార్లు పాకిస్థాన్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నవాజ్‌ షరీఫ్‌ సొంత సోదరుడే షెహబాజ్‌ షరీఫ్‌.మరీ ముఖ్యంగా షెహబాజ్‌ జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌ మూలాలుగలరు. షెహబాజ్‌ తండ్రి స్వాతంత్య్రానంతరం లాహోర్‌కు తరలివెళ్ళిపోయారు. షెహబాజ్‌ షరీఫ్‌ మూడుసార్లు పంజాబ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అరమరికలు లేని వ్యక్తిగా, బాహాటత్వధోరణిగల నాయకుడుగా ప్రచారం పొందిన నాయకుడు షెహబాజ్‌. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ మాట్లాడుతూ, డాలరు ధర 8 రూపాయలు క్షీణించిందని, ఇది ప్రజలకు ఎంతో సంతోషదాయకమని అన్నారు. సుప్రీంకోర్టు రాజ్యాంగానికి అనుగుణంగా తీర్పు ఇచ్చిన రోజు పాకిస్థాన్‌కు ఒక చరిత్రాత్మకమైన రోజు అని ఆయన అన్నారు.
వీళ్ళంతో దొంగలుఃఇమ్రాన్‌
జాతీయ అసెంబ్లీ వేదికపై బలప్రదర్శనలో ఓటమిపాలైన ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ తీవ్రస్థాయిలో స్పందించారు. “వీళ్ళంతా దొంగలు, ఈ సభలో వీళ్ళతో కలిసి కూర్చోలేను, ఈ సభకు రాజీనామా చేస్తున్నా” అని ఇమ్రాన్‌ఖాన్‌ స్పందించారు. ఆయన వెంట నడుస్తున్న పిటిఐ పార్టీకి చెందిన మిగిలిన ఎంపీలు కూడా అదేబాటలో రాజీనామాలు చేయాలని నిశ్చయించుకున్నారు. వారంతా రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలో పోరానికి సన్నద్ధమవుతున్నారు. “మేం అందరం రాజీనామాలు చేస్తున్నాం, కొత్త ప్రధానమంత్రి ఎంపిక దృశ్యాన్ని మేం పంచుకోం, ఈ సభలో వాళ్ళతో కలిసి కూర్చోం” అరి పిటిఐ పార్టీ నాయకుడు షేక్‌ రషీద్‌ చెప్పారు. ఇమ్రాన్‌ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన మురాద్‌ సయీద్‌ స్పీకర్‌కు పంపిన రాజీనామాలేఖలో, “ధన దాహంతో, అధికార దాహంతో ఈ దేశాన్ని బిచ్చమెత్తుకునేలా చేశారు, ఇలాంటివాళ్ళంతా ఎలా పాలకులవుతారు?’ప్రశ్నించారు.
చైనాతో సంబంధాలు చెక్కుచెదరవ్‌!
పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఆ దేశంతో స్నేహ సంబంధాలు చెక్కుచెదరే అవకాశం లేదని చైనా ప్రకటించింది. రెండు దేశాలమధ్య సంప్రదాయంగా వస్తున్న స్నేహం చెక్కుచెదరే అవకాశం లేదని రెండు దేశాల రాజకీయ నిపుణులు అంచనావేశారు. రెండు దేశాలమధ్య సహకార భాగస్వామ్యంతో కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఎలాంటి విఘాతం కలగదని వారు పేర్కొన్నారు.ఉమ్మడి ఏకాభిప్రాయంతో స్నేహసంబంధాలు అభివృద్ధి చెందినందువల్ల రెండు దేశాలమధ్య మిత్రత్వానికి ద్వైపాక్షిక సంబంధాలకు,ఢోకాలేదని పేర్కొన్నారు. మూడుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన నవాజ్‌ షరీఫ్‌ హయాంలో ఇరు దేశల సంబంధాలు పటిష్టమయ్యాయని, ఇప్పుడు అదే కుటుంబం నుండి వచ్చిన ప్రధానమంత్రి హయాంలో ఈ సంబంధాలు ఇమ్రాన్‌ఖాన్‌ హయాంలోకంటే కూడా ఇంకా ఎంతో మెరుగ్గా ఉంటాయని వారు అంచనావేశారు. రెండు దేశాలమధ్య సంబంధాలు చెక్కుచెదరవని చరిత్ర అనేకసార్లు రుజువుచేసిందని చైనా విదేశాంగమంత్త్రిశాఖ ప్రతినిధి ఝావో లిజియన్‌ ఇప్పటికే స్పష్టం చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments