తొలి విడతకు ముగిసిన ఉపసంహరణలు
ఆఖరి నిమిషం వరకు బుజ్జగింపులు, నోట్ల కట్టలు
రూపు మారిన ఏకగ్రీవాల పర్వం
వార్డు సభ్యుల పదవుల్లోనూ కొనసాగిన అదే జోరు
ప్రజాపక్షం / హైదరాబాద్ : పల్లె పోరు పాకాన పడింది. తొలి విడత ఈ నెల 21న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ పర్వం ఆదివారం ముగిసింది. చివరి నిమిషం వరకు ఏకగ్రీవాల కోసం బుజ్జగింపుల పర్వం, నోట్ల కట్టల ఎర కొనసాగింది. ఈ పర్వంలో అధికార పార్టీ వారు తిరిగి తమ పెత్తనం చాటుకున్నట్లు సమాచారం. చాలా మటుకు ఏకగ్రీవాలను తమ ఖాతాలో వేసుకున్నట్లు తెలిసింది. అనధికారికంగా అందిన సమాచారం మేరకు తొలి విడతలో జరగనున్న 4479 పంచాయతీల్లో దాదాపు 900కు పైగా పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు సమాచారం. సర్పంచ్ స్థానాలకే కాకుండా వార్డు సభ్యుల పదవుల విషయంలోనూ ఈ సారి ఏకగ్రీవాల కోసం ఎడతెగని బేరసారాలు జరిగా యి. ఉపసర్పంచ్ పదవికి డిమాండ్ పెరగడమే దీనికి కారణమని తెలుస్తోంది. తొలివిడతలో నామినేషన్ల పర్వం ముగిసే నాటికి దాదాపు 300కు పైగా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. వీటికి సింగిల్ నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఉపసంహరణ చివరిరోజు ఆదివారం నాటికి పలువురిని పోటీ నుంచి తప్పించడంలో అధికార పార్టీ నేతలు సక్సెస్ అయ్యారు. బుజ్జగింపులకు లొంగని చోట నోట్ల కట్టలను ఎరగా వేశారు. ఒక్కో పంచాయతీకి దాని స్థాయిని బట్టి రూ.20 నుంచి రూ.30లక్షల వరకు డిమాండ్ పలికినట్లు సమాచారం. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో ఏకగ్రీవాల కోసం భారీ మొత్తం పలికినట్లు తెలిసింది. వీటితో పాటు శంషాబాద్, కొత్తూర్, ఇబ్రహీంపట్నం, చేవెల్ల, బాలానగర్, జడ్చర్లతో పాటు కరీంనగర్, వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల్లో ఏకగ్రీవాల కోసం జరిగిన వేలం పాటల్లో పెద్దమొత్తం పలికనట్లు తెలిసింది. కొన్ని పంచాయతీలు అత్యధికంగా రూ.20లక్షలు ధర పలికినట్లు సమాచారం. ప్రధానంగా పరిశ్రమలు, స్థిరాస్థి వ్యాపారాలు, పట్టణాలకు, నగరాలకు ఆనుకుని ఉన్న పంచాయతీలకు బాగా డిమాండ్ పలికినట్లు తెలిసింది.