బస్సు సౌకర్యంలేక ప్రయాణికుల అవస్థలు
ఆటోలను ఆశ్రయిస్తున్న వైనం
పట్టించుకోని పాలకులు, అధికారులు
ప్రజాపక్షం/హుజూర్నగర్రూరల్ రాష్ట్రంలోని పలు గ్రామాలకు ఇప్పటికీ బస్సు సౌ కర్యం లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందుల కు గురవుతున్నారు. నిత్యం వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రాలకు వెళ్లే ప్రజలు బస్సులు లేక ఆటోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆటోలు, ప్రైవేట్ వాహనాల్లో పరిమితికి మంచి ప్రయాణికులను తీసుకెళ్తుండడంతో ప్రమాదాలు కూడా చోటు చేసుకున్న ఘటనలు లేకపోలేదు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని లక్కవరం, శ్రీనివాసపురం, అమరవరం, అంజలీపురం, లింగగిరి, సీతారాంపురం, బూరుగడ్డ మాచవరం, కరక్కాయలగూడెం గ్రామాలకు రహదారి సౌకర్యం ఉంది. గతంలో పాలకుల బత్తిడితో కొన్నాళ్లు బస్సులు నడిపినప్పటికీ ఆదాయం రావడం లేదంటూ అధికారులు నిలిపిశారు. దీంతో సమయానికి కళాశాలలకు, పాఠశాలలకు వెళ్లలేక విద్యార్థులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు వెళ్లి తిరిగి గ్రామాలకు చేరుకోవాలన్నా సమయానికి ఒక్కోసారి ఏవీ అందుబాటులో లేకపోవడంతో వారి ఇబ్బందులు వర్ణాతీతం.
సామర్థ్యానికి మించి ప్రయాణికుల తరలింపు
ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు మండల కేంద్రానికి చేరుకోవాలంటే ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించి ఆటోవాలాలు సామర్థ్యానికి మంచి ప్రయాణికులను తరలిస్తున్నారు. దీంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆయా గ్రామాల ప్రజలు బస్సులు నడపాలని అనేకసార్లు రాస్తారోకోలు, ఆందోళనలు చేసినా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం కూలీలు పనులకు వెళ్లాలంటే బస్సు సౌకర్యం లేక పడరాని పాట్లు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు స్పందించి గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి ప్రజలు, విద్యార్థులు కోరుతున్నారు.
తీవ్ర ఇబ్బందులకు పడుతున్నాం –
సిరంగి నాగయ్య, అంజలీపురం
ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అంజలీపురం నివాసి సిరంగి నాగయ్య వాపోయారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోవాలాలు ఛార్జీలు అధికంగా వసూలు చేస్తున్నార్నారు.
అధికారులు స్పందించాలి
కాలేజీ, పాఠశాలలకు వెళ్లే సమయంలో బస్సులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అమరవరానికి చెందిన డిగ్రీ విద్యార్థి మలికంటి నరేష్ పేర్కొన్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని బస్సులు నడపాలన్నారు.
సమస్యను పరిష్కరిస్తాం : కోదాడ డిపో మేనేజర్
బస్సులు లేకపోవడంపై కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్ అప్పారావును వివరణ కోరగా తాను ఇటవలే విధుల్లో చేరానని త్వరలోనే గ్రామాలను సందర్శించి ప్రయాణికుల సమస్యను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని చెప్పారు.