HomeNewsBreaking Newsపల్లెల్లోనూ బి పాస్‌

పల్లెల్లోనూ బి పాస్‌

ఇళ్ల నిర్మాణానికి ఆన్‌లైన్‌లో అనుమతులు
ఇప్పటికే మున్సిపాలిటీల్లో అమలు
అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు నిర్ణయం
పంచాయతీరాజ్‌ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు
ప్రజాపక్షం/కరీంనగర్‌ బ్యూరో పట్టణాలు, ప్రధాన జాతీయ రహదారులు, మండల కేంద్రాలకు ఆనుకుని ఉన్న పల్లెల్లోని భూములన్నీ కొన్నేళ్లుగా ప్లాట్లుగా మారుతున్నాయి. వ్యవసాయ భూ ములు ఎకరాలు, గుంటల నుంచి గజాల నుంచి ఫీట్ల చొప్పున విక్రయాలు జరుగుతుండడంతో ఊహించని రీతిలో ధరలు పెరిగాయి. కొనుగోలుదారులు ఆ భూముల్లో నిర్మాణాలు చేపడుతుండగా, అనుమతుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పట్టణాల్లో అమలవుతున్న టిఎస్‌ బి పాస్‌ విధానం గ్రామాల్లో కూడా అమలు చేసేందుకు
నిర్ణయించింది. ఇటీవలే పంచాయతీ రాజ్‌ శాఖ చట్టంలో సవరణలు చేసిన ప్రభుత్వం కొద్ది రోజులుగా జిల్లాలోని పలు గ్రామాల్లో ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఆయా గ్రామాల్లో నిర్మాణదారులకు ఎలాంటి సమస్యలు లేకుండా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేయడమే తరువాయి అనుమతులు వస్తుండటంతో ఇబ్బందులు తొలగిపోతున్నాయి. దీంతో ఏప్రిల్‌ ఒకటి నుండి అన్ని గ్రామాల్లో అమలు చేసేందుకు సన్నాహాలు జరిగాయి.
అక్రమ లేఅవుట్లు అడ్డుకునేందుకే..
పట్టణాలకు ఆనుకుని ఉన్న శివారుల్లోని భూముల ధరలు పెరగడంతో సమీపంలోని గ్రామాలపై కొనుగోలుదారుల దృష్టి పడింది. జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉండటంతో పల్లెల్లోని ప్రధాన భూములలో అక్రమ వెంచర్లు వెలిశాయి. ఇప్పటికే నగర శివార్లలో నలుమూలలా విచ్చలవిడిగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయి దృష్టిపెట్టినా ఎలాంటి ఫలితాలు ఉండటం లేదు. పల్లెల్లో అనుమతులు త్వరితగతిన రావడంతో అంతా అటువైపు భూములు కొనుగోలు చేసి ఫ్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. చాలా మంది రియల్టర్లు పల్లెల్లోనూ అనుమతులు లేకుండా అక్రమ లేఅవుట్‌ ఫ్లాట్లను కూడా విక్రయిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా అమలు
జిల్లాలోని కరీంనగర్‌, చొప్పదండి, హుజురాబాద్‌, మానకొండూర్‌ నియోజకవర్గాల్లో 313 పంచాయతీల్లో ఏప్రిల్‌ 1 నుంచి టిఎస్‌ బిపాస్‌ ద్వారానే నూతన ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. భవన నిర్మాణానికి సంబంధించి అనుమతి కోసం సంబంధిత యజమాని ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి. టిఎస్‌ బిపాస్‌ ధరఖాస్తు చేసుకున్నాక ఆన్‌లైన్‌లో 21 రోజులకే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. 75 గజాలలోపు ఇళ్ల నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. ఈ విధానంలో రూపాయి చెల్లించి భవన నిర్మాణఅనుమతులు పొందవచ్చు. . టిఎస్‌ బిపాస్‌లో ఇళ్ల నిర్మాణానికి ఆమోదయోగ్యమైన స్థలం ఉందో లేదో ముందుగానే తేల్చుకుని వివరాలు పొందుపరుస్తారు.
ఆన్‌లైన్‌లోనే అనుమతి ః జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య
“పల్లెల్లోనూ ఇళ్ల నిర్మాణానికి ఇక నుండి ఆన్‌లైన్‌లోనే అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పల్లెల్లోనూ టిఎస్‌ బి పాస్‌ విధానంలో అనుమతులు తప్పనిసరి. పంచాయతీల పరిధిలో ఉండే ప్రజలు అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగకుండా ఆన్‌లైన్‌లో టిఎస్‌ బి పాస్‌ ధరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు పరిశీలించి సక్రమంగా ఉంటే సంబంధిత అదికారి నిర్ణీత గడువులోగా అనుమతులు జారీ చేస్తారు” అని జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య ‘ప్రజాపక్షం’ ప్రతినిధికి చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments