మణిపూర్‌పై పార్లమెంట్లో ఆటంకాలు లేని చర్చ జరిగినప్పుడే ప్రతిష్టంభనకు ముగింపు
ప్రభుత్వానికి తేల్చిచెప్పిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సభ్యులు
ఇతర నిబంధన కింద చర్చించేందుకు అంగీకారం
న్యూఢిల్లీ : మణిపూర్ అంశంపై గురువారం కూడా పార్లమెంట్లో ప్రతిష్టంభన కొనసాగింది. రాజ్యసభలో స్తంభించిపోయిన కార్యకలాపాలు తిరిగి సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఇతర ప్రతిపక్ష నాయకులతో భేటీ అయ్యారు. ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య దాదాపు అరగంట పాటు సమావేశం జరిగింది. అయితే సమావేశం అసంపూర్ణంగా ముగిసింది. రూల్ 267 కింద మణిపూర్‌పై చర్చ జరగాలన్న తమ వైఖరిని విరమించుకుంటున్నట్లు ప్రతిపక్షాలు చెప్పినప్పటికీ ఈ అంశంపై ఉభయసభల్లోనూ సమగ్రమైన చర్చ జరగాలని, ప్రధాని నరేంద్రమోడీ ప్రకటన
చేయాలని రాజ్యసభలో ప్రతిపక్షాలు పట్టువీడడం లేదు. అయితే ప్రధాని ప్రకటన చేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించడం లేదు. ప్రధానికి బదులు హోంమంత్రి ప్రకటన చేస్తారని చెబుతోంది. సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ సమావేశాన్ని ఏర్పాటు చేయగా, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సభ్యులు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రాజ్యసభా నాయకుడు గోయల్, పార్లమెంటరీ వ్యవహారాలశాఖమంత్రి జోషి ఖర్గేతో సమావేశమయ్యారు. మణిపూర్‌లో ఎలాంటి పరిమితులు లేకుండా ఆటంకాలు లేని చర్చను రాజ్యసభలో ప్రారంభిస్తేనే ప్రతిష్టంభన తొలగిపోతుందని ఇండియా కూటమి ఎంపిలు ప్రభుత్వానికి తెగేసి చెప్పారు. మణిపూర్ అంశంపై ప్రత్యేకమైన నిబంధన కింద చర్చ జరపాల్సిన అవసరం లేదని కానీ, కాలపరిమితి లేకుండా పూర్తిస్థాయిలో జరగాలన్నదే తమ డిమాండ్ అని ఓ ప్రతిపక్షనేత తెలిపారు. ప్రతిష్టంభన తొలగేందుకు, సభ సజావుగా జరిగేందుగు ప్రభుత్వానికి ప్రతిపక్ష సభ్యులు మధ్యేమార్గంగా సూచనలు చేశారని సమావేశం అనంతరం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు. ప్రతిపక్ష పార్టీలు రూల్ 267 లేదా రూల్ 176 కింద చర్చను ప్రతిపాదిస్తున్నాయని, అయితే ఇరుపక్షాలు అంగీకరించే భిన్నమైన నిబంధన కింద చర్చను ప్రతిపాదించాయని వర్గాలు తెలిపాయి. ఇటీవల మణిపూర్‌లో పర్యటించిన ఎంపిలు తమ అనుభవాలను చెప్పాలనుకుంటున్నారని, ఆ రాష్ట్రంలో ఏం జరుగుతందో యావత్ దేశానికి తెలియాల్సిన అవసరం ఉందని మరో ప్రతిపక్ష నేత పేర్కొన్నారు. ఇగో గురించి కాకుడా దేశంలో మణిపూర్ భాగమైనందున ప్రధాని తప్పకుండా సభల్లో మాట్లాడాలన్నారు. జులై 20న వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి హింసాత్మక మణిపూర్ సమస్యపై రాజ్యసభ పదేపదే అంతరాయాలను ఎదుర్కొంటోంది.
పరిమితులు లేని చర్చతోనే…
RELATED ARTICLES