పదిమంది డకౌట్‌!

7 పరుగులకే అంధేరీ జట్టు ఆలౌట్‌
ముంబయి : క్రికెట్‌ జెంటిల్మెన్‌ గేమ్‌. అలాంటి జెంటిల్మెన్‌ గేమ్‌లో అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్ని సార్లు చెత్త రికార్డులు నమోదవుతుంటాయి. తాజాగా హార్రిస్‌ షీల్‌ అండర్‌-16 టోర్నమెంట్‌లో అకాడమీ అంథేరీ స్కూల్‌ టీమ్‌ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. హార్రిస్‌ షీల్‌ అండర్‌-16 టోర్నీ భాగంగా బుధవారం ఆజాద్‌ మైదానంలో స్వామి వివేకానంద ఇంటర్నేషనల్‌ స్కూల్‌ బోరివాలీ, చిల్డ్రన్స్‌ అకాడమీ అంధేరీ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన స్వామి వివేకానంద ఇంటర్నేషనల్‌ స్కూల్‌ బోరివాలీ 39 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 605 పరుగులు చేసింది. మయేకర్‌ (338) ట్రిపుల్‌ సెంచరీతో చెలరేగాడు. అయితే, 45 ఓవర్లను అంథేరీ జట్టు నిర్ణీత సమయంలో పూర్తి చేయకపోవంతో 156 పరుగుల పెనాల్టీ విధించారు. దీంతో చిల్డ్రన్స్‌ అకాడమీ అంధేరీ జట్టు విజయ లక్ష్యం 761 పరుగులు అయింది. 761 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చిల్డ్రన్స్‌ అకాడమీ అంధేరీ జట్టు కేవలం 7 పరుగులు చేసింది. అవి కూడా ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. ఓపెనర్లు మొదలుకుని పదో బ్యాట్స్‌మెన్‌ వరకు అందరూ డకౌట్‌గా వెనుదిరిగారు. స్వామి వివేకానంద బౌలర్లలో అలోక్‌ పాల్‌ ఆరు వికెట్లు సాధించగా వరాద్‌ వాజే రెండు వికెట్లు తీశాడు. రెండు రనౌట్ల రూపంలో వచ్చాయి. దీంతో చిల్డ్రన్స్‌ అకాడమీ అంధేరీ జట్టు 754 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

DO YOU LIKE THIS ARTICLE?