HomeNewsBreaking Newsపతనం అంచున మహారాష్ట్ర ప్రభుత్వం

పతనం అంచున మహారాష్ట్ర ప్రభుత్వం

మంత్రి ఏక్‌నాథ్‌ షిండే చిచ్చు
22 మంది శివసేన ఎంఎల్‌ఎలు గుజరాత్‌లో మకా
బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా?
ముంబయి/సూరత్‌ :
మహరాష్ట్రలోని సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో సంక్షోభం రేగింది. శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌పార్టీలతో కూడిన మహా వికాస్‌ అఘాడి (ఎంవిఎ) సంకీర్ణకూటమిలో శివసేనకు చెందిన 22 మంది ఎంఎల్‌ఎలు తిరుగుబాటు బావుటా ఎగరేసే మార్గంలో ఉన్నారు. ఈ ఎంఎల్‌ఎలు అందరూ మహారాష్ట్ర పట్టణాభివృద్ధి, ప్రజాపనుల శాఖామంత్రి ఏక్‌నాథ్‌ షిండే నాయకత్వంలో ప్రస్తుతం గుజరాత్‌ రాజధాని సూరత్‌లోన ఒక హోటల్‌లో మకాం వేశారు. శివసేనలో శక్తిమంతమైన నాయకుడుగా చెలామణీ అవుతున్న షిండే బిజెపికి మేలు చేసేవిధంగా వేరుకుంపటి యత్నాలు ప్రారంభించారు. దీంతో శివసేన షిండేను అసెంబ్లీలో శివసేన పక్ష నాయకత్వం నుండి తొలగించింది. మహారాష్ట్రలో ఎంవిఎ కూటమిని గద్దె దించేందుకు బిజెపి ప్రయత్నం చేయడం ఇది మూడవసారి. అయితే శరద్‌ పవార్‌ దీనిని శివసేన అంతర్గత అంశంగా పేర్కొన్నారు. అయితే ఎంవిఎ కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ముప్పూ లేదని కాంగ్రెస్‌, ఎన్‌సిపి ప్రకటించాయి. బిజెపితో శివసేన సంబంధాలు తెంచుకుని ఎన్‌సిపి, కాంగ్రెస్‌లతో చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. షిండే వెంట 14 నుండి 15 మంది ఎంఎల్‌ఎలు ఉన్నారని మరోవైపు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ప్రకటించారు. ఎంఎల్‌ఎ నితిన్‌ దేశ్‌ముఖ్‌తో సహా ఇద్దరుఎంఎల్‌ఎలను బాగా చితకబాదారని, దాంతో దేశ్‌ముఖ్‌ గుండెపోటుకు గురయ్యారని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభానికి బిజెపియే ప్రధాన కారణమని రౌత్‌ విమర్శించారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో చేసినవిధంగానే మ రాష్ట్రలో కూడా ప్రభుత్వాని కూల్చివేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. విధానమండలిలో ఆరుసీట్లకు జరిగిన ఎన్నికల్లో, పోటీ చేసిన ఆ ఒక్క సీటును కూడా ఎంవిఎ కూటమి ప్రతిపక్ష బిజెపికి కోల్పోయింది. దీంతో మహారాష్ట్ర విధానమండలిలో ఆరు సీట్లూ బిజెపి వశం అయ్యాయి. అధికారపార్టీ నుండి క్రాస్‌ ఓటింగ్‌ జరగడంతో బిజెపి మరోసీటును అదనంగా చేజిక్కించుకుంది. సోమవారంనాడు మహారాష్ట్ర విధానమండలికి జరిగిన
ఎన్నికల్లో ఈ ఫలితాలు వెలువడిన కొద్ది గంటలకే వేరుకుంపటి నాటకీయ పరిణామాలకు షిండే తెరలేపారు. విధానసభలో బిజెపికి మద్దతుగా ఉన్న చిన్న చిన్న పార్టీలు, స్వతంత్రులతోపాటు అధికారపార్టీ నుండి కూడా క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. శివసేన వైఖరితో ఆ పార్టీ తిరుగుబాటు ఎంఎల్‌ఎలు కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎన్‌సిపి దగ్గర ఉన్న ఉపముఖ్యమంత్రి పదవిని షిండే ఆశిస్తున్నారని, ఆయన అసంతృప్తిగా ఉన్నారని ఒక కాంగ్రెస్‌ మంత్రి అన్నారు.
థానేజిల్లాకు చెందిన ఎంఎల్‌ఎ షిండే (58)కు వ్యతిరేకంగా ఉద్ధవ్‌ ఠాక్రే చర్యలు తీసుకున్నప్పటినుండి పరిస్థితులు మారిపోయాయి. షిండేను అసెంబ్లీలో శివసేనపక్ష నాయకత్వస్థానం నుండి ఠాక్రే తొలగించారని, ఆయన స్థానంలో అజయ్‌ చౌధురిని నియమించామని సంజయ్‌ రౌత్‌ పాత్రికేయులతో చెపారు.ఆయనను పదవి నుండి తొలగించడం సరైన క్రమశిక్షణా చర్య అని రౌత్‌ అన్నారు. ముంబయికి280 కి.మీ దూరంలో సూరత్‌లో మకాం వేసిన షిండే బృందంతో సంప్రదింపులు జరిపేందుకు మిలింద్‌ నర్వేకర్‌, రవింద్ర పాథక్‌లకు బాధ్యతలు అప్పగించారు.అయితే షిండే ఇప్పటివరకూ తన వైఖరి ఏమిటో వెల్లడించలేదు. అయితే ఠాక్రేతో సహా ఎవరి పేరూ ప్రస్తావించకుండా షిండే ఒక ట్వీట్‌ చేశారు. “నేను అధికారం కోసం ఎప్పుడూ మోసానికి పాల్పడను, ఎన్నటికీ పార్టీ వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే బోధనలను, ఆయన మార్గాన్ని విడనాడను” అని ట్వీట్‌ చేశారు. “హిందుత్వ పాఠాలు బోధించిన బాలాసాహెబ్‌ కు మేం కరడుగట్టిన సేన సైనికులం, అధికారం కోసం ఎన్నటికీ మోసానికి పాల్పడం, అధికారం గురించి బాలాసాహెబ్‌, ఆనంద్‌ దిఘేలు చెప్పిన బోధనలు మరువం” అని షిండే మరాఠీ భాషలో ట్వీట్‌ చేశారు. మరణించిన దిఘే శివసేన రాజకీయ ఉపదేశకుడు. షిండే ఆయన శిష్యుడు. ఈ పరిణామాలపై ఎన్‌సిపి నాయకుడు శరద్‌ పవార్‌ ఢిల్లీలో మాట్లాడుతూ,ఈ విధంగా ఎంవిఎ ప్రభుత్వాన్నికూల్చివేసేందుకు బిజెపి ప్రయత్నం చేయడం ఇది మూడవసారి అని అన్నారు. ఈ సంక్షోభాన్ని ఉద్ధవ్‌ ఠాక్రే పరిష్కరించగలరని చెబుతూ ఇదిశివసేనలో అంతర్గత విషయమని అన్నారు.
2019 నవంబరులో మహారాష్ట్రలో శివసేన నాయకుడు ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వంలో ఎంవిఎ కూటమి ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టినప్పటినుండి విధాన సభలో 106 మంది ఎంఎల్‌ఏల బలం ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రతిరోజూ కుట్రలు పన్నుతూనే ఉంది. ఇప్పుడు మంత్రి ఏక్‌నాథ్‌ షిండే నాయకత్వంలో 22 శివసేన ఎంఎల్‌ఏల చీలికవర్గం వేరు కుంపటి పెట్టే యత్నాల్లో ఉండటంతో రెండున్నర ఏళ్ళ ఎంవిఎ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ప్రభుత్వ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రపతి ఎన్నికలు కూడా సమీపించిన తరుణంలో మహారాష్ట్రలో పరిణామం బిజెపినే వేలెత్తిచూపిస్తోంది.
శివసేనకు విధానసభలో 55 మందిఎంఎల్‌ఎలు ఉండగా, వారిలో 22 మంది ప్రస్తుతం మంత్రి ఏక్‌నాథ్‌ షిండే సారథ్యంలో గుజరాత్‌లో మకాం వేశారు. ఈ సంక్షోభం కొనసాగి షిండే ప్రయత్నాలు ఫలించి ఆ 22 మంది ఎంఎల్‌ఎలు బిజెపి లో చేరడమో లేదా వేరే స్వతంత్ర చీలక వర్గంగా కొనసాగడమో చేస్తే ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ముఖ్యమంత్రి ఠాక్రే విధానసభలో బలపరీక్షకు సిద్ధం కావాలని మహారాష్ట్ర బిజెపి తొడలు చరిచి యుద్ధానికి సిద్ధం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ రాజ్యసభ స్థానాలు గెలుచుకుని ఆనాడే సంకేతాలు ఇచ్చింది. మహారాష్ట్ర విధానసభలో ప్రభుత్వాధికారం చేపట్టాలంటే 144 మందికంటే ఎక్కువ ఎంఎల్‌ఎల మద్దతు ఉండాలి. ప్రస్తుతం ఉద్ధవ్‌ ఠాక్రే పార్టీకి 55 మంది ఎంఎల్‌ఎలు ఉండగా, వారిలో 22 మంది షిండే వెంట ఉన్నారు. ఇప్పుడు శివసేన బలం 33కు తగ్గే అవకాశాలున్నాయి. ఎన్‌సిపి కి 53 మంది ఎంఎల్‌ఎలు, కాంగ్రెస్‌కు 44 మంది ఎంఎల్‌ఎలు ఉన్నారు. మొత్తం 287 సీట్లలో ఎంవిఎ బలం 152 మంది కాగా ప్రస్తుతం షిండే 22 మందితో వేరు కుంపటి పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.బహుజన వికాస్‌ అఘది పార్టీకి ముగ్గురుఎంఎల్‌ఎలు, సమాజ్‌వాదీపార్టీ, ఎఐఎంఐఎం, ప్రహార్‌ జనశక్తిపార్టీలకు ఇద్దరేసి ఎంఎల్‌ఎలు ఉన్నారు. ఎంఎన్‌ఎస్‌, సిపిఐ(ఎం), పిడబ్ల్యుపి, స్వాభిమాని పక్ష, రాష్ట్రీయ సమాజ్‌పార్టీ, జన్‌సురాజ్య శక్తి పార్టీ, క్రాంతికారి షేత్కారీ పక్షలకు ఒక్కొక్కరు వంతున ఎంఎల్‌ఎలు ఉన్నారు. కాగా విధానసభలో 13 మంది ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు.ప్రతిపక్ష బిజెపికి 106 మంది ఎల్‌ఎల్‌ఎల బలం ఉంది.
ఈ సమస్య పరిష్కరించేందుకు శరద్‌ పవార్‌తోపాటు కాంగ్రెస్‌ నాయకుడు బాలాసాహెబ్‌ థోరత్‌,ఉద్ధవ్‌ ఠాక్రేలు మంగళవారం రాత్రి సమావేశమయ్యారు. ఈ పరిణామాలను జాగ్త్రత్తగా గమనిస్తున్నామని కాంగ్రెస్‌ మంత్రి బాలాసాహెబ్‌ థోరత్‌ అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎఐసిసి పరిశీలకుడు కమల్‌నాథ్‌ను మహారాష్ట్రకు కాంగ్రెస్‌ అధిష్టానం ప్రత్యేక దూతగా నియమించింది. ఆయన బుధవారంనాడు ముంబయి చేరుకుంటారు. మరోవైపు ఎన్‌సిపి ఎంఎల్‌ల బలం చెక్కుచెదరలేదని ఆ పార్టీ తరపు మంత్రి ఛగన భుజబల్‌ చెప్పారు. థానేలో షిండే నివాసం వెలుపల భారీగా పోలీసులను మోహరించారు.
29 మంది స్వతంత్రులు,చిన్నపార్టీల
ఎంఎల్‌ఎల పాత్ర కీలకం?

మహారాష్ట్ర ఎంవిఎ సంకీర్ణ కూటమిలో 22 మంది శివసేన ఎంఎల్‌ఎలు సూరత్‌లో మకాంవేసి చీలిక ప్రయత్నాలు ప్రారంభించడంతో ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న 13 మంది ఇండిపెండెంట్‌ ఎంఎల్‌ఎలతోసహా చిన్న పార్టీలకు చెందిన మొత్తం 29 మంది శాసనసభ్యులపాత్ర ఇప్పడు కీలకం కానున్నది. ఒకవేళ ఎంవిఎ సంకీర్ణ కూటమిలో ఈ చీలికవర్గంతో రాజీకుదరక సంక్షోభం ముదిరిపోతే ఎంవిఎ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తవానికి సంకీర్ణ కూటమి మెజార్టీ కోల్పోయి కష్టాల్లో పడుతుంది. ఈ పరిస్థిల్లో ఈ 29 మంది ఎంఎల్‌ఎల పాత్ర కీలకంగా ఉంటుంది. ఇప్పటికే బిజెపికి అసెంబ్లీలో 106 మంది ఎంఎల్‌ఎలు ఉన్నారు. చిన్నచితక పార్టీలతో కలిపి తమకు135 మంది ఎంఎల్‌ఎల బలం ఉందని బిజెపి భుజాలు చరుస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఈ నేపథ్యంలో షిండే నేత్రుత్వంలోని 22 మంది ఎంఎల్‌ఎలు కూడా జత కలిస్తే బిజెపకి పట్టపగ్గాలుండవు. 288 మంది ఎంఎల్‌ఎ సీట్లు ఉండే మహారాష్ట్ర అసెంబ్లీలో ఒక శివసేన ఎంఎల్‌ఎ మరణించగా 287 మంది ఉన్నారు. అధికారం పొందాలంటే ఏ పార్టీకైనా 144 మంది ఎంఎల్‌ఎల బలం ఉండాలి. ప్రస్తుతం ఎంవిఎ కూటమికి 152 మంది బలం ఉంది. వీరిలో 22 మందిని షిండే చీల్చుకుని వెళ్ళేయత్నం చేశారు. ఈ వివాదం ముదిరితే కూటమి ప్రభుత్వం మైనార్టీలో పడుతుంది. శివసేనకు 55, ఎన్‌సిపికి 53, కాంగ్రెస్‌కు44 మంది ఎంఎల్‌ఎలు ఉన్నారు. 13 మంది ఇండిపెండెంట్లలో ఒకరైన రాజేంద్రపాటిల్‌ యద్రాకర్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా మరో మూడు పార్టీల ఎంఎల్‌ఎలు కూడా మంత్రులుగా ఉన్నారు. 13 మందిలో ఆరుగురు బిజెపికి మద్దతు ఇస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments