‘పట్టభధ్రుల ఎంఎల్‌సి’గా కోదండరామ్‌? పోటీకి పార్టీ నుంచి ఒత్తిడి

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : రానున్న శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేయాలని టిజెఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌పై పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చట్టసభలో అడుగుపెట్టాలని, అందుకు వీలు గా నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రు ల నియోజకర్గ ఎన్నికను వేదికగా చేసుకోవాలని ఇటీవల జరిగిన టిజెఎస్‌ రాష్ట్ర కార్యవర్గం సూచించింది. ఇప్పటి వరకు ఇతర పార్టీలకు మద్దతునిచ్చామని, ఇకనైనా పోటీ చేయాలని పార్టీ నేతలతో పాటు కోదండరామ్‌ సన్నిహితులు కూడా ఆయనపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే దీనిపై కోదండరామ్‌ ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. పోటీ చేసే విషయమై రాజకీయ పార్టీలతో సంప్రదింపులు, మేధావులు, ఆయా జిల్లాకు చెందిన కొందరు ముఖ్యులతో సంప్రదింపుల పర్వాన్ని మొదలు పెట్టేందుకు పార్టీలోని ఒకరిద్దరు ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించాలని కార్యవర్గ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. 2018 సార్వత్రిక ఎన్నికల్లోనే జనగామ, వరంగల్‌ ఉమ్మడి జిల్లా నుంచి ఏదో ఒక స్థానం నుంచి కోదండరామ్‌ పోటీ చేయడం దాదాపు ఖరారైనట్టు భావించినప్పటికీ అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కోదండరామ్‌ పోటీకి దూరంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు మద్దతునిచ్చామని అందులో గెలిచిన కొందరు అధికార టిఆర్‌ఎస్‌లోకి వెళ్లారని, ఇప్పుడు జరుగుతున్న ఎంఎల్‌సి ఎన్నికల్లో ఇతరులు గెలిచినా వారూ ‘కారు’ ఎక్కలేరనే భరోసా లేదని, పైగా మండలిలో ఒక ప్రశ్నించే గొంతు ఉండాలని అందుకు కోదండరామ్‌కు అన్ని అర్హతులూ ఉన్నాయని టిజెఎస్‌ వర్గాలు బలంగా చెబుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అధికార టిఆర్‌ఎస్‌ పట్ల మేధావులు, ప్రభుత్వ వర్గాలు, నిరుద్యోగులు, పట్టభద్రులు, ఇతర రంగాల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నదని, ఇలాంటి నేపథ్యంలో రానున్న ఎంఎల్‌సి ఎన్నికల్లో ఈ వర్గాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలు ఉంటాయని, కాబట్టే బలమైన వ్యక్తి బరిలో నిలబడితే గెలుపు ఖాయమని, అందుకే ఈ అవకాశాన్ని చేతులార వదులుకోవద్దనే అభిప్రాయంలో అటు పార్టీ వర్గాలు, ఇటు కోదండరామ్‌కు సన్నిహితులు భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు అంతకుముందు మానవ హక్కుల నేతగా కోదండరామ్‌ మేధావులకు, ఇతర ఉద్యోగ వర్గాలకు చిరపరిచయస్తుడు. పైగా తెలంగాణ ఉద్యమంలో టిజెఎస్‌ చైర్మన్‌గా తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచారు. తెలంగాణ రాష్ట్రంలోని సమస్యలు, ఉద్యమ ఆకాంక్షలు, అవసరాలు, సమస్యలకు పరిష్కార మార్గాల పట్ల ఆయనకు పూర్తి అవగాహన ఉన్నదని, రాజకీయ నేతలకంటే కూడా ఒక మేధావి వర్గంగా, ఉద్యమ నేతగా ఆయనకు ఉన్న పేరు చట్టసభలకు ఎన్నికయ్యేందుకు దోహదపడుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పలు ఆందోళన కార్యక్రమాలతో పాటు ఉపాధి, ఉద్యోగ సమస్యలపై కూడా పోరాటం చేశారని వారు గుర్తు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇదే అంశంపై ఆ పార్టీలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే పోటీ చేసే అంశంపై కోదండరామ్‌ ఎలా స్పందిస్తారనే విషయమై రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొన్నది.

DO YOU LIKE THIS ARTICLE?