14 మంది సిబ్బంది మృతి
ఒక నౌకలో నుంచి మరొక నౌకలోకి ఇంధనం మార్చుతుండగా ఘటన
మాస్కో : భారత్, టర్కిష్, లిబయాన్ సిబ్బందితో వెళ్తున్న రెండు నౌకలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. రష్యా నుంచి క్రిమియా ద్వీపకల్పాన్ని వేరు చేసే కెర్చ్ జలసంధి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో దాదాపు 14 మంది మృత్యువాతపడినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. రష్యా ప్రాదేశిక జలాల్లో రెండు పడవల్లో సోమవారం అగ్నిప్రమాదం వాటిల్లిం ది. రెండు నౌకల్లో కూడా టాంజానియా జెండా లు ఎదురుతున్నాయి. అందులో ఒక నౌక సహజవాయువును మోసుకువెళ్తుండగా, మరొకటి ట్యాంకర్ నౌక. అయితే ఒక నౌక నుంచి మరో నౌకలోకి ఇంధనం మార్చుతుండగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురై న క్యాండీ అనే నౌకలో 17 మంది సిబ్బంది ఉ న్నారు. అందులో 9 మంది టర్కీ పౌరులు కాగా, ఎనిమిది మంది భారతీయులు. మరో నౌక మేస్ట్రోలో 15 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఏడుగురు టర్కీ పౌరులు, ఏడుగురు భారతీయులు, లిబియాకు చెందిన ఒకరు ఉన్న ట్లు తీర ప్రాంత రక్షకదళ అధికారులు వెల్లడించారు. ఒక నౌకలో పేలుడు సంభవించి మంట లు మరో నౌకకు విస్తరించాయని ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారని క్రిమియా హెడ్ సర్గెయ్ అక్షయోనవ్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో ఏయే దేశస్థులు ఉన్నారనేది స్పష్టంగా చెప్పలేదు. దాదాపు 12 మందిని రక్షించగా, మరో ఆరుగురు గలంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మండుతున్న నౌకల్లో నుంచి మూడు డజన్ల మంది సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు రష్యా తీరప్రాంత రక్షకదళ ఏజెన్సీ అధికార ప్రతినిధి తెలిపారు.మృతదేహాలను గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయన్నారు. అయితే నౌకల్లో ఇంకా మంటలు చెలరేగుతున్నాయని చెప్పారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు.