మరో ఇద్దరికి గాయాలు
న్యూఢిల్లీ: బీహార్‌లోని సీతామర్హి జిల్లా సమీపంలో భారత్ సరిహద్దు వద్ద నేపాల్ పోలీసులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఒక భారతీయ రైతు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని సోనేబర్షా పోలీస్ స్టేషన్ పరిధిలో పిప్రాప్సన్ వద్ద ఉన్న లాల్‌బండి- జానకీనగర్ సరిహద్దు వద్ద భారతీయులకు, నేపాల్ పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో విచక్షణ కోల్పోయిన ఓ పోలీసు అధికారి 15 రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో వికేష్ కుమార్ రాయ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, పక్కనే ఉన్న పొలంలో పనులు చేసుకుంటున్న మరో ఇద్దరు ఉమేష్ రామ్, ఉదయ్ ఠాకూర్‌లకు బుల్లెట్ గాయాలయ్యాయని స్థానికులు వెల్లడించారు. లగన్‌రాయ్ అనే మరో వ్యక్తిని నేపాలీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కాగా, కాల్పులు జరిగిన విషయాన్ని డిజి జితేంద్రకుమార్ ధృవీకరించారు. కాల్పులు జరిగిన స్థలం నేపాల్ అధికార పరిధిలోకి వస్తుందని ఆయన వెల్లడించారు. గాయపడినవారిని సీతామర్హిలోని ఆసుపత్రికి తరలించామన్నారు. సరిహద్దులు దాటడానికి ప్రయత్నించిన భారతీయులపై నేపాల్ పోలీసులు మే 17న కూడా కాల్పులకు పాల్పడ్డారు. భారత్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో సరిద్దులను మార్చి 22న నేపాల్ మూసివేసింది. భారత్‌తో నేపాల్ 1850 కి.మీ. మేర సరిహద్దు కలిగి ఉంది. వివిధ కార్యాకలాపాల నిమిత్తం, కుటుంబాలను కలుసుకోవడానికి స్థానికులు ప్రతినిథ్యం సరిహద్దులు దాటుతూ ఉంటారు.
నేపాల్ పోలీసుల కాల్పుల్లో భారత రైతు మృతి
RELATED ARTICLES